శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (19:21 IST)

ఆయన నా గదిలోకి వచ్చి నాపై అత్యాచారం చేశారు, నేను మూడు రోజుల వరకు గదిలోనే ఉండిపోయాను

జూమ్ స్క్రీన్ మీద కూడా మోనిక (పేరు మార్చాం) చాలా ఇబ్బంది పడ్డారు. ఆమెలో భయం కనిపించింది. ఎవరైనా తనపై ప్రతీకారం తీర్చుకుంటారేమోనని ఆమె భయపడుతోంది. కానీ, తన కథ చెప్పడానికి ఆమె కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు రమాకాంత్ గుండేచా తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు.

 
సంగీతం నేర్చుకోవడానికి మధ్యప్రదేశ్‌లోని ద్రుపద్ సంస్థాన్‌‌ స్కూల్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పారు. రమాకాంత్ 2019లో మరణించారు. ఆ తర్వాత సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలను వేధించారంటూ ఆయన సోదరులు ఉమాకాంత్, అఖిలేష్‌‌‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీబీసీ మూడు నెలల పాటు పరిశోధన చేసింది.

 
గుండేచా సోదరులపై ఎన్నో ఆరోపణలు బీబీసీ దృష్టికి వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను ఉమాకాంత్, అఖిలేష్ ఖండించారు. రమాకాంత్, ఉమాకాంత్ సోదరులు ద్రుపద్ బాణీ సంగీతంలో ప్రముఖ విద్వాంసులు. ఇది హిందుస్తానీ సంగీతంలో ఒక సంప్రదాయ శైలి. మరొక సోదరుడు అఖిలేష్ వాద్యకారుడు.

 
రమాకాంత్, ఉమాకాంత్ చేసిన సంగీత సేవకుగాను వారికి భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ శ్రీ పురస్కారం కూడా లభించింది. వారు స్థాపించిన ద్రుపద్ సంస్థాన్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది సంగీత విద్యార్థులను ఆకర్షించింది. తమకు యునెస్కో ఇంటాన్జిబుల్ కల్చరల్ హెరిటేజ్ కమిటీ గుర్తింపు కూడా ఉందని ఈ సంస్థ చెబుతోంది. కానీ, ఆ విద్యాలయానికి తమకు ఎటువంటి సంబంధం లేదని యునెస్కో బీబీసీకి తెలిపింది.

 
అటువంటి ప్రచారాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంస్థకు సీజ్ అండ్ డెసిస్ట్ ఆదేశాలు పంపుతామని యునెస్కో పేర్కొంది. గుండేచా అన్నదమ్ములపై వచ్చిన ఆరోపణలు హిందుస్తానీ సంగీత ప్రపంచానికి దిగ్బ్రాంతి కలిగించాయి. గురు శిష్య పరంపర అనే ఒక పురాతన సంస్కృతిపై కూడా అందరి దృష్టిని మరల్చాయి. ఈ పరంపరలో శిష్యులు గురువు ఇష్టాలకు పూర్తిగా లొంగి ఉండే ఒక అనధికార ఒప్పందం జరుగుతుంది.

 
అసభ్యకరమైన, లైంగికంగా ప్రేరేపించే సందేశాలు పంపించడం దగ్గరి నుంచి లైంగిక వేధింపులకు గురిచేశారనే వరకు ఈ ముగ్గురు అన్నదమ్ములపై ఆరోపణలు వచ్చాయి. రమాకాంత్ విషయంలో అత్యాచారం చేశారనే ఆరోపణ కూడా ఉంది. తను సంగీత స్కూల్‌‌లో చేరిన మొదటి వారంలోనే రమాకాంత్ నుంచి ఆమోదయోగ్యం కాని వాట్సాప్‌ సందేశాలు వస్తూ ఉండేవని మోనిక చెప్పారు.

 
ఒక రోజు సాయంత్రం ఆయన తన కారులో చీకటిగా ఉండే ప్రదేశానికి తీసుకుని వెళ్లి, కారు వెనుక సీటులో తనను లైంగికంగా వేధించారని మోనిక ఆరోపించారు. "ఆయన నన్ను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టారు. నేను ఆయన్ను దూరంగా తోసేసినప్పటికీ ఆయన నన్ను వేధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన నా శరీరాన్ని తాకి నా బట్టలు తొలగించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నేను ఒక రాయిలా ఉండిపోయాను. నేను స్పందించటం లేదని ఆయనకు అర్ధమయింది. దాంతో, నిన్ను స్కూల్ దగ్గర తిరిగి వదిలిపెట్టనా? అని అడిగారు. నేను సమాధానం కూడా చెప్పలేకపోయాను" అని మోనిక చెప్పారు.

 
ఆ ఘటనను పూర్తిగా మర్చిపోవాలని ఆమె అనుకున్నారు. తనకు సంగీతమంటే ఇష్టం ఉండటంతో వెంటనే స్కూల్ మానేయలేదని, అక్కడ సంగీతం నేర్చుకోవడానికి ఉద్యోగం మానేసి, తన దగ్గరున్న డబ్బులన్నీ అక్కడ చెల్లించానని మోనిక చెప్పారు. కానీ, మూడు నెలల తర్వాత రమాకాంత్ తనపై అత్యాచారం చేశారని మోనికా ఆరోపించారు.

 
"ఆయన గదిలోకి వచ్చి నా బట్టలు తొలగించి బలవంతంగా సెక్స్ చేశారు. ఆయన నాపై అత్యాచారం చేసి గదిలోంచి వెళ్లిపోయారు. నేను తలుపు బిగించి మూడు రోజుల వరకు తిండి కూడా తినకుండ గదిలోనే ఉండిపోయాను" అని ఆమె చెప్పారు. సారా (పేరు మార్చాం) అనే మరో విద్యార్థిని కూడా తనను అఖిలేష్ గుండేచా లైంగికంగా వేధించారని బీబీసీకి చెప్పారు.

 
"నేనక్కడ ఉన్నప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాను. అఖిలేష్ నన్ను స్కూలుకు తీసుకుని వెళ్లడానికి వచ్చారు. ఆయన నా పక్కన కూర్చుని నా చేతులు తాకడం మొదలుపెట్టారు. నేను ఆయన్ను దూరంగా తోసేసాను. నాకు ఏదోలా అనిపించింది" అని ఆమె చెప్పారు. ద్రుపద్ సంస్థాన్ విద్యాలయ ఆవరణలో లైంగిక వేధింపులకు, హింసకు గురైనట్లు మొత్తం ఐదుగురు అమ్మాయిలు బీబీసీతో చెప్పారు.

 
రమాకాంత్ లైంగిక చర్యలను తిరస్కరించినప్పుడు వారికి సంగీతం నేర్పేందుకు ఆసక్తి చూపేవారు కాదని కొంత మంది అమ్మాయిలు చెప్పారు. ఎవరైనా అమ్మాయి ఫిర్యాదు చేస్తే ఆ అమ్మాయిని బహిరంగంగా తరగతి గదిలో అవమానపరిచేవారని చెప్పారు. సియాటిల్‌లో ప్రాథమిక పాఠశాల టీచర్‌గా పని చేస్తున్న రేచెల్ ఫెయిర్ బ్యాంక్స్ మార్చి 2017లో ద్రుపద్ సంస్థాన్‌లో చేరారు. మొదటి రోజు నుంచే తనకు వేధింపులు మొదలయ్యాయని ఆమె చెప్పారు.

 
సామాన్లను గదిలో పెట్టడానికి వచ్చిన డ్రైవర్ కూడా తనపై కన్ను వేశారని ఆమె చెప్పారు. "ఆయన నన్నేదయినా చేస్తారేమో అనే భయంతో నేను రమాకాంత్‌ని లోపలకు రమ్మన్నాను. కానీ, నాకు సహాయం చేయాల్సింది పోయి, ఆయన నన్ను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు" అని ఆమె ఆరోపించారు. ఆయన ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. నాపై ఉన్న ప్రేమను చెబుతూ ఆయన సందేశాలు పంపుతూ ఉండేవారని రేచెల్ ఆరోపించారు.

 
ఒక రోజు క్యాంపస్ బయట ఉన్న పొలాల్లోకి తీసుకువెళ్లి, తన ప్యాంటు విప్పేసి తన ప్రైవేటు భాగాలను తాకారని కూడా ఆమె ఆరోపించారు. "నేను ఆయనను వెనక్కి తోసేసాను. అక్కడ నుంచి నన్నొక చిన్న ఊరికి తీసుకుని వెళ్లి దించేశారు. అక్కడ నుంచి ఆ చీకట్లో పొలాల మీదుగా నడుచుకుంటూ స్కూల్‌కి వెళ్లాను. అలా జరిగిన వెంటనే నేను స్కూల్ మానేసాను. ఇక ఆయన సమక్షంలో నేను కూర్చోలేకపోయాను" అని ఆమె చెప్పారు.

 
ఈ విషయంపై ఇన్ని సంవత్సరాల తర్వాత 2020లో ఫేస్‌బుక్‌లో "ద్రుపద్ ఫ్యామిలీ ఇన్ యూరోప్" అనే గ్రూపులో వారిపై ఆరోపణలతో కూడిన పోస్టు చదివిన తర్వాత గొంతు విప్పేందుకు తనకు ధైర్యం వచ్చిందని రేచెల్ అన్నారు. అయితే, ఈ ఆరోపణలను అఖిలేష్, ఉమాకాంత్ గుండేచా న్యాయవాదులు ఖండించారు. ఇదంతా గుండేచా అన్నదమ్ములకు, ద్రుపద్ సంస్థాన్‌కి ఉన్న ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొన్ని దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నమని వారన్నారు.

 
ఈ ఆరోపణలను సంస్థ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటి గత నాలుగు నెలలుగా విచారణ చేస్తోంది. లైంగిక ఆరోపణలు, హింస గురించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని భారతీయ చట్టాలు చెబుతున్నాయి. ఈ విద్యాలయం మీద ఒత్తిడి తెచ్చిన తర్వాతే ఈ కమిటీని ఏర్పాటు చేశారని అక్కడ చదువుతున్న విద్యార్థులు చెబుతున్నారు.

 
ప్రస్తుతం అక్కడ చదువుతున్న విద్యార్థులకు మద్దతు తెలపడం వలన పూర్వ విద్యార్థులకు కూడా బెదిరింపులు వచ్చాయని చెబుతున్నారు. అయితే, చట్టాన్ని అనుసరించి విచారణకు సంబంధించిన విషయాలను బాధితులు బయటకు వెల్లడించకూడదు. హిందుస్తానీ సంప్రదాయ సంగీత ప్రపంచంలో 'మీ టూ' ఆరోపణలు వినిపించిన తొలి సంఘటన ఇదే అయినప్పటికీ, ఇది వెలుగులోకి రావడం ఆలస్యమయిందని చాలా మంది అంటున్నారు.

 
ఈ సంప్రదాయ కళను అభ్యసించడానికి గురు శిష్యుల మధ్య మంచి సంబంధాలు ఉండాలని చాలామంది సంప్రదాయ సంగీతకారులు చెబుతున్నప్పటికీ ఈ విధానంలో దోపిడీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది బీబీసీతో అన్నారు. "శిష్యులు తనకు పూర్తిగా లొంగి ఉండాలని గురువులు ఆశిస్తారు. అబ్బాయిలకు ఇది కాస్త తక్కువ మోతాదులో ఉంటుంది. అదే అమ్మాయి అయితే, ఈ లొంగుబాటు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే అమ్మాయిలకు ముప్పు ఎక్కువగా ఉంటుంది" అని 79 సంవత్సరాల సంగీతకారిణి నీలా భగవత్ అన్నారు.

 
"ఈ గురు శిష్య సంప్రదాయాన్ని పూర్తిగా నిర్మూలించాలి" అని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ అన్నారు. "చాలా సంబంధాల్లో మాదిరిగానే ఈ గురు శిష్య పరంపర కూడా అధికారిక అసమతుల్యతలపై ఆధారపడి ఉంటుంది. కానీ, ఇక్కడ ఆ అసమానతలను సంబరం చేసుకుంటారు" అని గుండేచాలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ఆయన అభిప్రాయపడ్డారు.

 
"నేను సంప్రదాయ విధానాలను నాశనం చేస్తున్నాననే వాదనలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, విమర్శల నుంచి రక్షించుకోవడానికి గతం సమాధానం కాకూడదు" అని ఆయన రాసారు. గురువు కూడా మనిషే అని కృష్ణ, భగవత్ కూడా అంటారు. ఆ వ్యక్తిని సదరు రంగంలో నిపుణులుగానే చూడాలి కానీ, ఎటువంటి తప్పు చేయని దేవుడిగా కాదని అన్నారు. "ఇటీవల కాలంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎవరైనా ఆ సంస్థలను పరిశీలించి వాటిలో ఇంటర్నల్ కంప్లైయన్స్ కమిటీలు ఉన్నాయో లేదో పరిశీలించాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా" అని ప్రముఖ సంగీత విద్వాంసురాలు శుభ ముద్గల్ ప్రశ్నించారు.

 
ఈ ఆరోపణలపై నిశ్శబ్దంగా ఉండిపోయిన సంగీత ప్రపంచంలో తమ అభిప్రాయాలను వినిపించిన కృష్ణ, భగవత్, సుధ లాంటి వ్యక్తులు అరుదు. అయితే, ఈ ఆరోపణల ప్రభావం గుండేచా అన్నదమ్ములపై ఎంతవరకు పడుతుందనే విషయం గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఉదాహరణకు అఖిలేష్ గుండేచాపై సోషల్ మీడియాలో వచ్చిన ఎదురుదెబ్బలతో 2020లో జరిగిన తాన్సేన్ సమారోహ్ సంగీత ఉత్సవంలో పాల్గొనడాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.

 
చట్టపరంగా ముందుకు వెళ్లలేకపోవడానికి న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుందనే నమ్మకం లేకపోవడమే కారణమని బీబీసీతో మాట్లాడిన చాలామంది విద్యార్థులు చెప్పారు. విద్యార్థుల్లో చాలా మంది దేశం కూడా వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ విషయంలో తర్వాత వాళ్లు ఏం చేస్తారన్న దానిపై కూడా స్పష్టత లేదు. విచారణ కమిటీ వెలికితీసిన ఆధారాలతో దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు దొరకాలని చాలా మంది అమ్మాయిలు అనుకుంటున్నారు. దీంతో పాటు గుండేచాలు అమ్మాయిలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు. కానీ, ఇదింకా జరగలేదు.

 
విచారణ కమిటీ నివేదికను బయటకు వెల్లడించని పక్షంలో విచారణకు అర్థం లేదని రేచెల్ అంటారు. తనకు జరిగిన అనుభవం వల్ల తాను ద్రుపద్‌ని వదిలి వెళ్లాల్సి వచ్చిందనే విషయం తనను నిరంతరం బాధపెడుతూ ఉంటుందని ఆమె చెప్పారు. "నా తాన్పురా (వీణాలాంటి వాయిద్యం) లివింగ్ రూమ్‌లో ఉంది. అది అమ్మేద్దామని అనుకుంటున్నాను. దురదృష్టవశాత్తు గత జ్ఞాపకాలు గుర్తు రాకుండా నేను పాడలేను" అని చెప్పారు.