ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 1 జూన్ 2021 (16:14 IST)

MIS-C: కరోనా వల్ల పిల్లలకు వస్తున్న ఈ కొత్త వ్యాధి ఎంత ప్రమాదకరం, దీనిని ఎలా గుర్తించాలి?

నాలుగేళ్ల అమన్(పేరు మార్చాం)ను తల్లిదండ్రులు హడావుడిగా గాజియాబాద్‌(ఉత్తరప్రదేశ్)లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఆ పిల్లాడిని ఐసీయూలో చేర్పించాలని డాక్టర్లు చెప్పారు. అమన్ రిపోర్టులు అసాధారణంగా ఉండడంతో డాక్టర్లు ఆందోళనకు గురయ్యారు. "నా కొడుక్కి దాదారు రెండు వారాల నుంచి లైట్‌గా జ్వరం(99 డిగ్రీలు) ఉంది. కళ్లలో దురదగా ఉందని చెప్పేవాడు. ఆస్పత్రికి వచ్చాక మొదట పొట్టనొప్పి ఉందన్నాడు. మిగతా అంతా మామూలే. శారీరకంగా వేరే ఎలాంటి సమస్యలూ రాలేదు" అని అమన్ తల్లి పూజా చెప్పారు.

 
ఒక ఇన్ఫెక్షన్ వల్ల బాబు గుండెలో ఒక భాగంలో వాపు వచ్చిందని ఆస్పత్రిలోని డాక్టర్లు అమన్ తండ్రి సూరజ్‌కు చెప్పడంతో ఆయన కంగారుపడ్డారు. "అమన్‌కు ఎంఐఎస్-సి అనే సమస్య వచ్చింది" అని డాక్టర్లు చెప్పారు. ప్రముఖ మెడికల్ జర్నళ్లలో ఒకటైన ద లాన్సెట్ వివరాల ప్రకారం పిల్లల్లో వచ్చే 'మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్(MIS-C) చాలా తీవ్రమైన వ్యాధి. దీనిని ప్రస్తుతం కోవిడ్-19(సార్స్-కోవిడ్-2)కు జోడించి చూస్తున్నారు.

 
టీచరుగా పనిచేస్తున్న సూరజ్ కుటుంబానికి, అమన్‌ జబ్బు పడడానికి ముందే కరోనా వచ్చింది. ఐసొలేషన్‌లో ఉన్న తర్వాత మే రెండో వారంలో ఆయన కుటుంబంలో అందరికీ కోవిడ్ పరీక్షల్లో అందరికీ నెగటివ్ వచ్చింది. కుటుంబంలో కరోనా వచ్చినపుడు అందరికంటే భిన్నంగా, అమన్‌కు కళ్ల దురదలు తప్ప వేరే సీరియస్ లక్షణాలేవీ కనిపించలేదు. అమన్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. కానీ, యాంటీబాడీ టెస్ట్‌లో అమన్ శరీరంలో కోవిడ్ యాంటీ బాడీస్ తక్కువ మోతాదులో కనిపించాయి.

 
అమన్‌కు చికిత్స చేస్తున్న న్యూబార్న్ అండ్ పీడియాట్రిక్స్ నిపుణులు డాక్టర్ అజిత్ కుమార్ బాలుడి పరిస్థితి గురించి చెప్పారు. "అమన్‌ ఈసీజీలో తేడా కనిపించింది. అతడి ఎకో(గుండె పరీక్ష) రిపోర్ట్ కూడా సరిగా లేదు. మిగతా ఆరోగ్య హెల్త్ మార్కర్స్ కూడా సరిలేవు. ఇంత చిన్న వయసు పిల్లాడికి అలాంటి సమస్యలు రావడం, చాలా అసాధారణ విషయం" అన్నారు.

 
గత కొన్ని రోజులుగా పెరిగిన కేసులు
"జనం కరోనా నుంచి కోలుకుంటుంటే, పిల్లల్లో ఎంఐఎస్-సి కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాపించిన తర్వాత ఇవి బయటపడుతున్నాయి. అయితే, పిల్లల్లో ఎంఐఎస్ కేసులు ఇప్పుడు అరుదుగానే కనిపిస్తున్నాయి. కానీ, ఇది వచ్చిన పిల్లల్లో ఈ వ్యాధికి కారణం ఏంటో ఇప్పటికీ తెలీడం లేదు. ఎందుకంటే సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. పిల్లల కేసుల సంఖ్య కూడా చాలా పెరిగింది" అని అజిత్ చెప్పారు. డాక్టర్ అజిత్ కుమార్ ఆస్పత్రిలో ఆరు ఐసీయూ పడకలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఎంఐఎస్-సి వచ్చిన పిల్లలే ఉన్నారు. మీడియా రిపోర్టుల ప్రకారం దిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇప్పటివరకూ ఈ వ్యాధికి సంబంధించి 200 కేసులు నమోదయ్యాయి.

 
పిల్లలకు వస్తున్న 'మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్' గురించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు ఏఎన్ఐ చెప్పింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఎంఐఎస్-సి కేసులు పెరుగుతున్నాయని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ కూడా చెప్పింది. ఎంఐఎస్-సి కేసులు హఠాత్తుగా పెరిగాయని ఈ సంస్థ చెప్పింది. 4-18 ఏళ్ల మధ్య పిల్లలు దీనికి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. అయితే కొన్ని కేసుల్లో ఆరు నెలల శిశువుల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.

 
ఎంఐఎస్-సి వ్యాధిని ఎలా గుర్తించాలి
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) 2020 మే నుంచి ఈ వ్యాధిపై అధ్యయనం చేస్తోంది. "ఎంఐఎస్-సి ఒక అరుదైన, ప్రమాదకరమైన వ్యాధి" అని సీడీసీ చెప్పింది. దీనిని ఇప్పుడు కోవిడ్-19కు జోడించి చూస్తున్నారు. సంస్థ వివరాల ప్రకారం ఎంఐఎస్-సి వ్యాధి పిల్లల్లో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పేగులు, మెదడుపై ప్రభావం చూపించవచ్చు. ఈ వ్యాధి వచ్చిన కొందరు పిల్లల్లో మెడ నొప్పి, శరీరంపై దద్దుర్లు, కళ్లు ఎర్రబడడం కూడా కనిపించాయని అమెరికా పరిశోధకులు చెప్పారు. ఎంఐఎస్-సి లక్షణాలు పిల్లందరిలో ఒకేలా ఉండాల్సిన అవసరం లేదనేది కూడా గమనించాలని సంస్థ చెప్పింది. 2020 జూన్‌లో ఈ వ్యాధికి సంబంధించి అమెరికాలో చాలా కేసులు నమోదయ్యాయి.

 
మొదట్లో చిన్న చిన్న లక్షణాలు
"ఈ వ్యాధి వచ్చిన పిల్లలు ఆస్పత్రిలో సగటున ఏడెనిమిది రోజులు ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. పిల్లందరికీ జ్వరం వచ్చింది. దాదాపు 73 శాతం మందిలో పొట్ట నొప్పి లేదా డయేరియా సమస్యలు కనిపించాయి. 68 శాతంమంది పిల్లలు వాంతులు కూడా చేసుకున్నారు" అని మెడికల్ జర్నల్ ద లాన్సెట్ తన రిపోర్టులో చెప్పింది. ప్రపంచంలోని మరికొన్ని సంస్థలు చెబుతున్న ఇతర లక్షణాలతోపాటూ 'కళ్ల కలక' కూడా ఎంఐఎస్-సి వ్యాధికి సంబంధించిన ఒక ప్రధాన లక్షణమని బ్రిటన్‌ ప్రముఖ మెడికల్ జర్నల్ ద బీఎంజే చెప్పింది.

 
"ఎంఐఎస్-సి లక్షణాలు కావసాకీ డిసీజ్‌లాగే ఉండడంతో ఈ రెండు వ్యాధులను కలిపి కూడా చూస్తున్నారు. కానీ ఎంఐఎస్-సి మరో రకం వ్యాధి. ఇది వచ్చిన వారికి కావసాకీ వ్యాధికి భిన్నంగా గుండె, పేగులకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి" అని బీఎంజే తన రిపోర్ట్ చెప్పింది. పరిశోధకుల వివరాల ప్రకారం ఎంఐఎస్-సి ఒక ప్రోగ్రెసివ్(మెల్లగా తీవ్రమయ్యే) వ్యాధి. ఇది మొదట చిన్న చిన్న లక్షణాలతో మొదలవుతుంది. కానీ, ఏ చికిత్సా తీసుకోకుంటే అది వేగంగా పెరుగుతుంది. కొన్ని రోజుల్లోనే దానివల్ల చాలా అవయవాలపై ప్రభావం పడుతుంది. అవి ఒకేసారి పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది.

 
పిల్లలపై ఈ వ్యాధి ప్రభావం ఎంత
ఎలాంటి పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రమవుతోంది. ఎందుకు అవుతోంది అనే విషయంలో సీడీసీ పరిశోధకులు ఇప్పటివరకూ తగిన వివరాలు సేకరించలేకపోయారు. అయితే ఎంఐఎస్-సి లక్షణాలు కనిపించిన పిల్లలకు ఎప్పుడైనా కోవిడ్-19 రావడం, లేదా కోవిడ్ రోగులకు వారు దగ్గరగా మెలగడం జరిగింది. ముందే కొన్ని రకాల వ్యాధులున్న పిల్లలకు, ఎలాంటి ఆరోగ్య స్థితి ఉన్న పిల్లలకు ఈ వ్యాధి ప్రమాదకరం అనేది అప్పుడే చెప్పలేం. ఎంఐఎస్-సికి గురైన ఎలాంటి పిల్లలకు మొదట చికిత్స అందించాలి, ఎవరిపై ఎక్కువ దృష్టి పెట్టాలి అనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు" సీడీసీ పరిశోధకుల చెప్పారు.

 
అయితే, లాన్సెట్ పరిశోధకులు ఎంఐఎస్-సి బాధితులైన కొందరు పిల్లలపై పరిశోధనలు చేశారు. ఈ వ్యాధి వారిపై అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధనల్లో ఎంఐఎస్-సి వ్యాధికి గురైన పిల్లలందరిలో సీఆర్పీ లేదా ఈఎస్ఆర్ లాంటి రక్త పరీక్షల ఫలితాలు సరిగ్గా లేవని గుర్తించారు. వీటితోపాటూ చాలా మంది పిల్లల్లో డీ-డైమర్(రక్తం గడ్డకట్టే పరీక్ష), గుండెకు సంబంధించిన పరీక్షల్లో కూడా తేడాలు కనిపించాయి. దాదాపు 54 శాతం మంది పిల్లల ఈసీజీ(గుండె పరీక్ష) రిపోర్ట్ కూడా సరిగా లేదని ఈ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.

 
లాన్సెట్ రిపోర్ట్ ప్రకారం ఎంఐఎస్-సి వ్యాధికి గురైన 22 శాతం పిల్లలకు వెంటిలేటర్ అవసరమైంది. ఈ వ్యాధి ఉందని ధ్రువీకరించిన పిల్లల్లో 71 శాతం మందిని ఐసీయూలో చేర్చారు. ఎంఐఎస్-సి వ్యాధికి గురైన పిల్లల్లో 1.7 శాతం మంది చనిపోయారు. ఎంఐఎస్-సి ఒక ప్రమాదకరమైన వ్యాధి కావచ్చు. కానీ. సమయానికి గుర్తించి, తగిన చికిత్స అందిస్తే చాలా మంది పిల్లల ప్రాణాలు కాపాడవచ్చు. అయితే, ఈ వ్యాధి దీర్ఘకాలిక పరిణామాల గురించి ఇప్పటికీ తెలీడం లేదు అని లాన్సెట్ చెప్పింది.

 
ఎంఐఎస్-సి ముప్పు ఎలా తప్పిచగలం
సమయానికి వ్యాధిని గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడం వల్ల ఎంఐఎస్-సిని చాలావరకూ తగ్గించవచ్చని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ఇన్సెంటివ్ కేర్ కూడా చెబుతోంది. ఎంఐఎస్-సి బాధితుల్లో ఎక్కువమంది పిల్లలకు 'ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబ్యులిన్(ఐవీఐజీ), స్టెరాయిడ్స్' ద్వారా చికిత్స అందిస్తారని మెడికల్ జర్నల్ ద బీఎంజే చెప్పింది. అయితే పిల్లలపై ఈ చికిత్స వల్ల సానుకూల ప్రభావం ఏమేరకు ఉంది, అనే విషయంలో ఇప్పటివరకూ పెద్దగా సమాచారం అందుబాటులో లేదు.

 
కానీ, ఈ వ్యాధి లక్షణాలను సరిగా గుర్తించడం చాలా ముఖ్యమని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ చెప్పింది. "తల్లిదండ్రులు, ముఖ్యంగా కరోనాకు గురైన కుటుంబం తమ పిల్లల్లో ఎంఐఎస్-సి లక్షణాలు ఏవైనా కనిపిస్తే వాళ్లు వాటి గురించి కచ్చితంగా డాక్టరును సంప్రదించాలి" అని తెలిపింది. "తక్కువ ఖర్చుతో అయ్యే సీవీసీ, ఈఎస్ఆర్, సీఆర్‌పీ లాంటి రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు. సీఆర్పీ లాంటి పరీక్ష ద్వారా పేద కుటుంబాలు కూడా దీనిని గుర్తించవచ్చు" అని సంస్థ చెప్పింది. "అమన్ ఇప్పుడు ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశాం. అయితే కొంతకాలం పాటు తను మందులు వేసుకోవాల్సి ఉంటుంది" అని డాక్టర్ అజిత్ కుమార్ చెప్పారు.

 
డాక్టర్లను అత్యంత ఆందోళనకు గురి చేసిన ఒక ప్రమాదం నుంచి కూడా అమన్ సురక్షితంగా బయటపడ్డాడు. "అమన్‌ను సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడం మంచిదైంది. లేదంటే తనకు తర్వాత అవయవాల్లో రక్తం గడ్డకట్టేది. దానితో పోరాడడం చాలా కష్టం. అలాంటి స్థితికి చేరిన వంద మంది పిల్లల్లో ఒకరు చనిపోవడం మేం చూస్తున్నాం" అన్నారు అజిత్ కుమార్. "భారత్‌లో 14 ఏళ్ల లోపు చిన్నారుల జనాభా 26 శాతం. అందులో సగం మంది ఐదేళ్ల లోపువారే" అని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ చెప్పింది. భారత్‌లో కరోనా మూడో వేవ్ వస్తే, ఈ వయసు పిల్లలకు ఎక్కువ సమస్యలు తలెత్తవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అందుకే, పిల్లల్లో అనారోగ్య లక్షణాలపై పిల్లల వైద్య నిపుణులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.