బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 31 మే 2021 (10:39 IST)

‘హైబ్రీడ్ కోవిడ్ వేరియంట్’: ఇది చాలా డేంజరస్.. గాలిలో ఎక్కువగా వ్యాపిస్తోంది

భారత, బ్రిటన్ వేరియంట్ల కాంబినేషన్‌గా కనిపిస్తున్న ఒక కొత్త కోవిడ్-19 వేరియంట్‌ను వియత్నాంలో గుర్తించామని, అది గాలిలో చాలా వేగంగా వ్యాపిస్తుందని ఆ దేశ వైద్యశాఖ అధికారులు చెప్పారు. ఈ తాజా మ్యూటేషన్ చాలా ప్రమాదకరమైనదని వియత్నాం ఆరోగ్యశాఖ మంత్రి నుయెన్ తాహ్ లాంగ్ వర్ణించారు. వైరస్ నిత్యం మార్పులకు గురవుతూ ఉంటుంది.

 
వీటిలో చాలావరకూ ప్రమాదకరం కావు. కానీ కొన్ని మ్యూటేషన్లు వైరస్‌ వేగంగా సంక్రమించేలా చేస్తాయి. కోవిడ్-19 మొదట బయటపడినప్పటి నుంచి దానిలో వేలాది మ్యూటేషన్లను గుర్తించారు. "భారత్‌, యూకేలో కనుగొన్న రెండు వేరియంట్ల లక్షణాలు కలిసున్న ఒక కొత్త కోవిడ్-19 వేరియంట్‌ను వియత్నాంలో గుర్తించారు" అని నుయెన్ చెప్పారని రాయిటర్స్ పేర్కొంది.

 
ఈ కొత్త హైబ్రీడ్ వేరియంట్ ఇంతకు ముందు వెర్షన్ల కంటే వేగంగా ముఖ్యంగా గాలిలో ఎక్కువగా వ్యాపిస్తోందని ఆయన చెప్పారు. కొత్తగా కరోనా బారిన పడిన వారికి చేసిన పరీక్షల్లో ఈ వెర్షన్‌ను గుర్తించినట్లు ఆయన చెప్పారని ఆన్‌లైన్ న్యూస్ పేపర్ వీఎన్ ఎక్స్‌ప్రెస్ రాసింది. ఈ కొత్త వైరస్ జెనెటిక్ కోడ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.

 
గత అక్టోబర్‌లో భారత్‌లో కనుగొన్న B.1.617.2 అనే వేరియంట్, యూకే వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు గుర్తించారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకా రెండు డోసులు వేసుకుంటే, అవి భారత వేరియంట్ మీద అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని, కానీ, ఒక డోసు వేసుకున్నవారిలో ఆ ప్రభావం తగ్గినట్లు కనిపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.

 
కరోనా వైరస్‌లో వచ్చిన ఏ మ్యుటేషన్లు అయినా ఎక్కువ మంది జనాభాను తీవ్ర అనారోగ్యానికి గురిచేసినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు. కోవిడ్-19 ఒరిజినల్ వెర్షన్ విషయానికి వస్తే దీనివల్ల వృద్ధులు, ఇతర అనారోగ్య కారణాలు ఉన్న వారికి ముప్పు అధికంగా ఉంటుంది. వేగంగా వ్యాపించే వైరస్ కూడా అంతే ప్రమాదకరంగా ఉంటుంది. ఇది వ్యాక్సీన్ వేసుకోని వారి మరణాలకు కారణం అవుతుంది. గత కొన్ని వారాలుగా వియత్నాంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.

 
మహమ్మారి మొదలైన తర్వాత ఇప్పటివరకూ ఆ దేశంలో కరోనా కేసులు 6700లకు పైగా నమోదయ్యాయి. వీటిలో సగం కేసులు ఈ ఏడాది ఏప్రిల్ తర్వాతే నమోదయ్యాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం వియత్నాంలో కోవిడ్-19 వల్ల ఇప్పటి వరకు 47మంది చనిపోయారు.