శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (19:15 IST)

#BottleCapChallenge: ఈ వైరల్ బాటిల్ క్యాప్ చాలెంజ్ ఏంటి? ఎందుకు?

సోషల్ మీడియాలో మరో చాలెంజ్ వైరల్ అవుతోంది. బాటిల్ క్యాప్ ఛాలెంజ్. మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్, నటుడు అర్జున్, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్.. వంటి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ హేమాహేమీలు ఈ వైరల్ చాలెంజ్‌ను స్వీకరించి తమ ప్రతిభ చాటుతున్నారు. 
 
ఇంతకీ ఏమిటీ బాటిల్ క్యాప్ చాలెంజ్? 
బాటిల్ మీద ఒక మూతను వదులుగా పెట్టాలి. దానిని తీయటానికి మీ చేయి కానీ, పాదం కానీ కావాలి. మీరు ఆ పనిచేస్తున్నపుడు రికార్డు చేయటానికి ఒక ఫోన్ కావాలి. 'రౌండ్‌హౌస్' అనే మార్షల్ ఆర్ట్ కిక్‌ను ఉపయోగించి బాటిల్ మీద మూతను ఒక్క కిక్‌తో విప్పేయటం ఈ చాలెంజ్ లక్ష్యం. ఇది చాలా ఈజీగా కనిపించొచ్చు. కానీ ఈ పని చేయాలంటే చాలా స్కిల్ అవసరం మరి.
 
ఈ చాలెంజ్ ఎలా మొదలైంది? 
టైక్వాండో ఫైటర్, శిక్షకుడు ఫారబీ దావ్లెచిన్ తన అద్భుత కిక్ ట్రిక్‌ను జూన్ 25న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఇదొక చాలెంజ్‌గా వైరల్ అవటం మొదలైంది. యాక్షన్ సినిమా నటుడు జేసన్ స్టాథమ్ ఈ చాలెంజ్ స్వీకరించి తన కిక్‌ను స్లోమోషన్‌ వీడియో పోస్ట్ చేశాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌ను స్వీకరించి, సాధించటానికి ప్రయత్నిస్తున్నారు.
 
ఇంకా ఏమేం వైరల్ చాలెంజ్‌లు ఉన్నాయి? 
సోషల్ మీడియాలో వైరల్ అయిన మొదటి చాలెంజ్ ఇదే కాదు. గత రెండేళ్లుగా వైరల్ అవుతున్న చాలెంజ్‌లలో ఇది తాజాది. మానెక్విన్ చాలెంజ్, ఫాలింగ్ స్టార్స్, ఫ్లాస్, ట్రైయాంగిల్ డ్యాన్స్, 10 ఇయర్ చాలెంజ్ వంటివి చాలా వైరల్ అయ్యాయి. ఇటువంటి చాలెంజ్‌లు ఎవరైనా సెలబ్రిటీ రంగంలోకి దిగి షేర్ చేస్తే అవి వైరల్ అవుతున్నాయి.