మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (14:10 IST)

నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్: విదేశీ నాయకులను మోదీ తన సొంత రాష్ట్రానికి ఎందుకు ఎక్కువగా తీసుకెళ్తున్నారు?

Boris Johnson
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. ఈ వారం ప్రారంభంలో జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రారంభోత్సవంలో మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనమ్‌కు గుజరాత్ ఆతిథ్యం ఇచ్చింది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, మరికొందరు ప్రపంచ నేతలు కూడా గుజరాత్‌లో పర్యటించారు.

 
2014 నుండి టైమ్‌లైన్‌ను పరిశీలిస్తే, గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులు గుజరాత్‌లో పర్యటించారు. అంతకుముందు రాజ్యాల అధినేతలు ఇండియాకు వచ్చినప్పుడు ఎక్కువగా దిల్లీకి పరిమితమయ్యేవారు లేదా తాజ్‌మహల్‌ను చూడడానికి వెళ్లేవాళ్లు. కొన్నిసార్లు ముంబై, చెన్నై వంటి ఇతర నగరాలకు వెళ్లేవారు.

 
జిన్‌పింగ్ నుంచి బోరిస్ జాన్సన్ వరకు-గుజరాత్ సందర్శనలు
2014 సెప్టెంబరులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించినప్పుడు, ఆయన మొదట అహ్మదాబాద్‌ను సందర్శించి, ఆ తర్వాత దిల్లీకి వచ్చారు. 2017లో జపాన్ ప్రధాని షింజో అబే సెప్టెంబర్ 13, 14 తేదీల్లో అహ్మదాబాద్‌ను సందర్శించారు. 2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అహ్మదాబాద్‌ను సందర్శించారు. తర్వాత దిల్లీ, ముంబయిలలో పర్యటించారు. ఫిబ్రవరి 2020లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. వారు మొదట అహ్మదాబాద్‌లోనే దిగారు. తర్వాతే ఆగ్రా, దిల్లీలకు వచ్చారు. ఇప్పుడు, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా అహ్మదాబాద్‌లో కాలు మోపారు. అహ్మదాబాద్‌లో కొన్ని కార్యక్రమాలు, సమావేశాలలో పాల్గొని దిల్లీకి వస్తారు.

 
సంప్రదాయంలో మార్పు
2014కి ముందు భారత్‌కు వచ్చిన పలు దేశాధినేతల పర్యటనలు ఎక్కువగా దేశ రాజధాని దిల్లీలోనే ఉండేవి. ముంబయి ఆర్థిక రాజధాని కావడంతో కొన్ని దేశాల నేతలు కూడా అక్కడికి వెళ్లేవారు. కొన్నిసార్లు, చాలా అరుదుగా, విదేశీ ప్రముఖులు ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికి చెన్నై లేదా కోల్‌కతాకు వెళ్లేవారు. దేశ అగ్రనాయకులతో సమావేశాలు దిల్లీకే పరిమితమయ్యాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, నరేంద్ర మోదీ చాలా దేశాల అధినేతలను గుజరాత్‌కు తీసుకువస్తున్నారు. విదేశీ నేతలకు స్వాగతం పలికేందుకు రోడ్‌షోలు, కలర్ ఫుల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020లో గుజరాత్‌ను సందర్శించినప్పుడు, మోటేరా క్రికెట్ స్టేడియంలో 'నమస్తే ట్రంప్' కార్యక్రమం, రోడ్‌షో జరిగింది. కార్యక్రమంపై విమర్శలు కూడా వచ్చాయి. జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటన కూడా గుజరాత్ నుంచే ప్రారంభమైంది. ఆ సమయంలో గుజరాత్‌లో '50 జపనీస్ కంపెనీలు' ఉన్నందున ఆయన గుజరాత్ పర్యటనను నిపుణులు 'కీలకమైనది' అని అభివర్ణించారు. 2014లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ దంపతులు అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు సబర్మతీ నది ఒడ్డున జానపద నృత్యాలతో స్వాగతం పలికారు.

 
''ఒక ప్రధానమంత్రి తన సొంత రాష్ట్రానికి ఇతర దేశాల అధ్యక్షులను లేదా ప్రధానమంత్రులను ఇన్నిసార్లు రప్పించడం ఎప్పుడూ జరగలేదు'' అని దిల్లీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు వినోద్ శర్మ అన్నారు. అయితే, ఈ మధ్య కాలంలో రాజధాని దిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలను కూడా కొందరు నేతలు సందర్శించారు. 2021 అక్టోబర్‌లో, డెన్మార్క్ ప్రధానమంత్రి మాట్ ఫ్రెడరిక్సన్ దిల్లీని సందర్శించారు. 2020 ఫిబ్రవరిలో మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మింట్ దిల్లీ, ఆగ్రాలను సందర్శించారు. శ్రీలంక, భూటాన్, పోర్చుగల్ ప్రధానులు 2018, 19 సంవత్సరాల్లో భారతదేశాన్ని సందర్శించారు, వారు కూడా దిల్లీలోనే పర్యటించారు. 2019 అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని మామల్లపురంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని సందర్శించారు. ఇటలీ ప్రధాని పాలో జెంటిలో కూడా 2017 అక్టోబర్‌లో దిల్లీని సందర్శించారు. ఒక దేశాధినేత గుజరాత్‌ను సందర్శించారంటే దానికి కారణం ఏమిటి? ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌కే మోదీ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారా?

Boris Johnson
గుజరాత్ బిజినెస్ మోడల్ కోసమా?
గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌‌ను ప్రారంభించారు. ఇది స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం. ''విదేశీ నేతల గుజరాత్ పర్యటనలు పరిశ్రమకు ఎంతో మేలు చేశాయి. నేడు ప్రపంచ పటంలో గుజరాత్‌కు ముఖ్యమైన స్థానం ఉంది'' అని గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ హేమంత్ షా అన్నారు. "విదేశీ అతిథి వచ్చినప్పుడు, వారికి రాష్ట్రం గురించి అవగాహన వస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. దీని ఆధారంగానే పెట్టుబడి ప్రణాళికలు రూపొందిస్తారు'' అన్నారు హేమంత్.

 
"ప్రధానమంత్రి గుజరాత్‌కు చెందినవారు. దాని వల్ల గుజరాత్‌కు ప్రయోజనం ఉంటే అది మంచిదే కదా'' అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, రచయిత ఘనశ్యామ్ షా ఈ వాదనతో విభేదిస్తున్నారు. "పెట్టుబడిదారులకు ప్రాంతంతో పనిలేదు" అని ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా లేనప్పుడు కూడా గుజరాత్‌లో విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అహ్మదాబాద్ టెక్స్‌టైల్ మిల్లులకు ప్రసిద్ధి చెందినదని, గుజరాత్‌కు ఉన్న బిజినెస్ ఇమేజ్ బీజేపీ ప్రభుత్వం కన్నా పాతదని ఘనశ్యామ్ అన్నారు.

 
రాజకీయ లబ్ధి కోసమా?
డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు, షింజో అబే పర్యటనల సందర్భంగా రోడ్‌షోలు నిర్వహించగా, వీటికోసం వేలాది మంది ప్రజలు రోడ్లపై గుమిగూడారు. ఈ కార్యక్రమాలపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కొంతమంది నిపుణులు ఇటువంటి కార్యక్రమాలను "రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నాలు"గా అభివర్ణించారు. ''సమాఖ్య రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ సమాన స్థానం ఉంటుంది, కాబట్టి ఒక రాష్ట్రానికే ప్రాధాన్యత ఇవ్వడం ప్రమాదకరం'' అని రాజకీయ విశ్లేషకుడు వినోద్ శర్మ అన్నారు. ''నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు, ఆయన 'టీమ్ ఇండియా' అని అన్నారు. జట్టు విషయానికి వస్తే, ఆటగాళ్లందరికీ ఆడే అవకాశం వస్తుంది'' అన్నారు వినోద్ శర్మ.

 
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏయే రాష్ట్రాలకు వనరులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలన్నారు. "ఏ రాష్ట్రం అత్యధిక ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) తీసుకువస్తుందనే దానిపై రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక పోటీని సృష్టించడం కేంద్రం బాధ్యత. దాని కోసం, ప్రతి రాష్ట్రానికి సమాన అవకాశం కల్పించాలి'' అని శర్మ అభిప్రాయపడ్డారు. ''నరేంద్ర మోదీ తన రాష్ట్రానికి ఇచ్చినంత ప్రాధాన్యత మరే ఇతర ప్రధాని తమ రాష్ట్రానికి ఇవ్వలేదని నేను అనుకోను. ఇందులో నాకు రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రధానికి తన రాష్ట్రంతో ఉన్న అనుబంధం, రెండోది గుజరాత్ ఒక కంఫర్ట్ జోన్ కావడం'' అని గుజరాతీ సీనియర్ జర్నలిస్ట్ రమేష్ ఓజా అభిప్రాయపడ్డారు.

 
గుజరాత్‌ను ప్రమోట్ చేస్తున్నారా?
ఒక నాయకుడు మరొక దేశాన్ని సందర్శించినప్పుడు, సాధారణంగా ఆ దేశ రాజధానికి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో, వారు దేశ రాజధానితో పాటు ఇతర నగరాలు లేదా రాష్ట్రాలను కూడా సందర్శిస్తారు. "భారత ప్రధానిగా, భారత గుజరాతీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది" అని గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా మాజీ చైర్‌పర్సన్, వ్యాపారవేత్త భాగ్యేష్ సోనేజీ అన్నారు. ''ఇతర రాష్ట్రాల కంటే గుజరాత్ ముందంజలో ఉండటమే దీని వెనుక ఉద్దేశం. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె. ఆడ్వాణీ బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా, మోదీ ప్రచారకర్తగా ఉన్నారు'' అని చెప్పారు ఘనశ్యామ్.

 
''ఆ సమయంలో మోదీ తన ప్రసంగంలో ఆడ్వాణీని గుజరాత్ 'ప్రతినిధి'గా చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అడ్వాణీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీనగర్ నుంచి వచ్చారు'' అన్నారాయన. ''గుజరాత్‌ను ప్రమోట్ చేసే అవకాశాన్ని నరేంద్ర మోదీ ఎప్పుడూ వదులుకోరు. గుజరాత్‌ను జాతీయ స్థాయిలో మోడల్‌గా తీర్చిదిద్దుతామని సందేశం పంపాలనుకుంటున్నారు'' అన్నారు ఘనశ్యామ్ షా.