సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (16:06 IST)

తీహార్‌ జైల్లో దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్, ‘నిర్భయ దోషులకి ఉరి వేయడానికే’ - ప్రెస్ రివ్యూ

దిల్లీలో నిర్భయపై మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులకి ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ‘సాక్షి’ ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం... బిహార్‌ బక్సర్‌ జైలు నుంచి ఉరితాళ్లను తీసుకువస్తున్నారు. ఉరికంబంపై శిక్ష అమలు ఎలా జరపాలో నలుగురు దోషుల బరువు, ఎత్తున్న దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్‌ వేసి చూశారని జైలు వర్గాలు తెలిపాయి.
 
దోషులందరినీ ప్రస్తుతం తీహార్‌ జైలు నంబర్‌ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచి సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్‌ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇటీవల మండోలి జైలులో ఉన్న పవన్‌ కుమార్‌ గుప్తాను తీహార్‌ జైలుకి తరలించినట్టు డైరెక్టర్‌ జనరల్‌ (జైళ్లు) సందీప్‌ గోయెల్‌ వెల్లడించారు. ముఖేష్‌ సింగ్, అక్షయ్‌ సింగ్, వినయ్‌ శర్మను ఉంచిన జైలు నెంబర్‌3లో పవన్‌ కుమార్‌ గుప్తాను ఉంచారు.
 
నిర్భయను 2012 డిసెంబర్‌ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్‌ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరు జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్‌ హోంకి పంపారు. మిగిలిన నలుగురిని ఏ రోజైతే అత్యంత పాశవికంగా నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారో అదే రోజు డిసెంబర్‌ 16న ఉరితీస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దోషులందరూ ఒకే జైలుకి చేరడంతో వారికి ఉరిశిక్ష అమలు జరపడం ఖాయమన్న వార్తలకు ఊతమిచ్చినట్టయింది.