ఉత్తర కొరియాలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆకస్మిక పర్యటనను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా 'కేసీఎన్‌ఏ' ప్రశంసించింది. ఇదో అద్భుత ఘటనను అభివర్ణించింది. ట్రంప్ పర్యటనపై కేసీఎన్‌ఏ విస్తృతంగా వార్తలు అందించింది. ఉత్తర కొరియా ప్రజలకు బయటి ప్రపంచం వార్తలు తెలియడం అరుదు. ప్రభుత్వ నియంత్రణ అధికంగా ఉండే ఉత్తర కొరియా మీడియా దశాబ్దాలుగా అమెరికాను దేశానికి అతిపెద్ద శత్రువుగా చూపిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ స్నేహితుడిగా ట్రంప్ ఉత్తర కొరియాలో అడుగుపెడుతున్న ఫొటోలు ఉత్తర కొరియా ప్రజలకు చాలా కాలం గుర్తుండిపోతాయి. సరిహద్దు దాటి ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్ కూడా ఉత్తర కొరియాను సందర్శించారు. కానీ వారు అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత, అది కూడా విమానంలో నేరుగా రాజధాని ప్యాంగ్‌యాంగ్ చేరారు.
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సరిహద్దు (డీఎంజెడ్) వద్ద ఆదివారం కిమ్‌తో ట్రంప్ సమావేశమయ్యారు. దక్షిణ కొరియా నుంచి ఆయన ఈ ప్రదేశంలో అడుగుపెట్టారు. ట్రంప్‌తోపాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఉన్నారు.
ట్రంప్‌ది సాహసోపేతమైన చర్య అని కిమ్ అభివర్ణించారు. డీఎంజెడ్ ప్రాంతంలోని సంయుక్త భద్రతా ప్రదేశం(జేఎస్ఏ)లో ఉన్న ఒక సైనిక స్థావరంలో ఈ భేటీ జరిగింది. ‘‘మన మధ్య జరిగే భవిష్యత్ చర్చలపై ఈ భేటీ సానుకూల ప్రభావం చూపుతుంది’’ అని ట్రంప్‌తో కిమ్ చెప్పారు. ఈ భేటీలో ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా, ఆమె భర్త జరెడ్ కుష్నెర్ కూడా పాల్గొన్నారు.
దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలను వేరు చేసే సరిహద్దు వద్ద ఇరు వైపుల నుంచి భారీ సైనిక మోహరింపులతో ఏర్పాటైన ప్రాంతమే డీఎంజెడ్. దీనికి రెండు వైపులా దాదాపు 250 కిలోమీటర్ల మేర తమ భూభాగాల్లో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సైనికులు పహారా కాస్తుంటారు. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉండే ఈ సైనికుల్ని గత ఏడాది కాలంగా తగ్గించారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ మాత్రం ట్రంప్, కిమ్ చర్చల్లో పాల్గొనలేదు. ఈ చర్చలు జరుగుతున్నంత సేపు ఆయన డీఎంజెడ్ వద్ద ఉన్న మరొక భవనంలో ఉన్నారు. ఉత్తర కొరియాపై అమెరికా విధించిన ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు. గతంలో వియత్నాం వేదికగా జరిగిన చర్చలు- ఆంక్షల తొలగింపు వ్యవహారం కారణంగానే అర్ధంతరంగానే ముగిసిపోయాయి.
అమెరికా ఆంక్షల్ని తొలగిస్తేనే అణు నిరాయుధీకరణకు తాము తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తర కొరియా గతంలో ప్రకటించింది. ఈ ఆంక్షల్ని తొలగించాలనే తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా తాను చేసిన ట్వీట్‌కు స్పందించి, తనను ఆహ్వానించినందుకు కిమ్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఒకవేళ కిమ్ కనుక తనను ఆహ్వానించకుంటే మీడియా మొత్తం తనను, కిమ్‌ను విమర్శించేదని అన్నారు.
కిమ్‌తో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తమ మధ్య జరిగిన ఈ భేటీ చాలా ప్రత్యేకమైందని చెప్పారు. మూన్ అన్నట్లుగా ఇదొక చారిత్రాత్మక సందర్భమని, ఈ భేటీకి కారణం కిమ్ అంటూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కిమ్‌కు, తనకు మధ్య జరిగిన చర్చల ఆధారంగా, సమగ్రమైన మంచి ఒప్పందాన్ని తయారు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు తాము అంగీకరించామని ట్రంప్ చెప్పారు. రెండు, మూడు వారాల్లోనే ఉత్తర కొరియా, అమెరికా బృందాలు ఈ ప్రక్రియను ప్రారంభిస్తాయన్నారు. అమెరికా రావాలని తాను కిమ్‌ను ఆహ్వానించానని, అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో తాను చెప్పలేనని ట్రంప్ వెల్లడించారు.
ఈ సమావేశం ఎలా సాధ్యమైందంటే...
జీ 20 సదస్సు కోసం జపాన్ వెళ్లిన డోనల్డ్ ట్రంప్ అక్కడి నుంచి వెనుదిరుగుతూ ఒక ట్వీట్ చేశారు. ‘‘దక్షిణ కొరియా వెళుతున్నా (ప్రెసిడెంట్ మూన్‌తో కలిసి). అక్కడ ఉన్నప్పుడు, ఒకవేళ ఉత్తర కొరియా ఛైర్మన్ కిమ్ కనుక దీన్ని చూస్తే.. ఆయన్ను సరిహద్దు/డీఎంజెడ్ వద్ద కలుస్తా, అతని హ్యాండ్ షేక్ చేసేందుకు, హలో చెప్పేందుకు’’ అని ఈ ట్వీట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
ఒకప్పుడు ఒకరిపై ఒకరు తిట్ల వర్షం కురిపించుకుని, పరస్పరం హెచ్చరించుకున్న ట్రంప్, కిమ్ తొలిసారి 2018 జూన్ నెలలో సింగపూర్‌లో కలిశారు. తర్వాత రెండోసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలో కలిశారు. తర్వాత చర్చల్లో పురోగతి లేదు. ఇప్పుడు హఠాత్తుగా మరోసారి కలుసుకున్నారు.