శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (15:38 IST)

బ్రా వేసుకోకుండా ఫొటోలు దిగుతున్నారు.. వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు.. ఎందుకలా?

దక్షిణ కొరియాలో కొంతమంది మహిళలు బ్రాలు ధరించకుండా ఉన్న తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. #నోబ్రా అనే హ్యాష్‌ట్యాగుతో ఆ ఫొటోలను పెద్దఎత్తున పోస్టుచేస్తున్నారు. దీనిని నో బ్రా ఉద్యమంగా చెబుతున్నారు. తొలుత కొన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్న దక్షిణ కొరియా నటి, గాయని శులి తను బ్రా లేకుండా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ ఉద్యమం ఊపందుకుంది. దాంతో నటి శులీ ఈ ఉద్యమానికి 'ముఖచిత్రం'గా మారారు. బ్రాలు ధరించాలా.. వద్దా... అన్నది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని చెప్పమే ఈ ఉద్యమం ఉద్దేశం.

 
బ్రాలెస్ ఉద్యమం
ఈ ఉద్యమానికి మద్దతుగా శులీకి అనేకమంది నుంచి సందేశాలు వస్తున్నప్పటికీ, కొంతమంది మహిళలు, పురుషుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. అందరి దృష్టినీ 'తనవైపు తిప్పుకోవాలన్న' ఆలోచనతోనే ఆమె ఈ ఉద్యమాన్ని ప్రారంభించారంటూ చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు విమర్శిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఇతరులను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని ఆమె తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.

 
"బ్రా ధరించడం అనేది మీ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని అర్థం చేసుకుంటాను. కానీ, మీరు వక్షోజాలు బయటకు ఎక్కువగా కనిపించేలా చాలా బిగుతుగా ఉండే దుస్తులను ధరిస్తున్నారు. మీకు స్వేచ్ఛ ఉందని చెప్పడానికి అలా చేయాల్సిన అవసరం లేదు" అని ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. "మీరు బ్రా వేసుకోలేదని మిమ్మల్ని మేము నిందించడంలేదు. చనుమొనలను కాస్త దాచుకోవాలని మాత్రమే చెబుతున్నాం" అని మరో వ్యక్తి పోస్ట్ చేశారు.

 
"మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తోంది. మీరు అలా చర్చికి వెళ్లగలరా? మీ సోదరి భర్తనో, మీ అత్తింటి వారినో కలిసేందుకు అలా వెళ్లగలరా? మిమ్మల్ని చూస్తే పురుషులే కాదు, మహిళలకూ అసౌకర్యంగా ఉంటుంది" అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇదంతా జరుగుతుండగానే, తాజాగా మరో ప్రముఖ సింగర్ హ్వాసా ఫొటోలు కూడా నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. హ్వాసా హాంకాంగ్ నుంచి సియోల్‌కు వస్తున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో ఆమె బ్రా వేసుకోకుండా తెల్లని టీషర్టు మాత్రమే ధరించారు. ఆ తర్వాత #నోబ్రా ఉద్యమం మరింత ఊపందుకుంది. దక్షిణ కొరియాలో స్వేచ్ఛ కోసం మహిళలు ఈ తరహా ఉద్యమాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 

 
భయపెట్టే చూపులు
కొన్నేళ్లుగా పితృస్వామ్య సంస్కృతి, లైంగిక హింస, "స్పై కెమెరా" నేరాలు పెరుగుతుండటంపై దక్షిణ కొరియా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కొరియాలో మహిళల విశ్రాంతి గదులు, పబ్లిక్ టాయిలెట్లలో రహస్య కెమెరాలు బయటపడిన ఘటనలు ఇటీవలి కాలంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. స్పై కెమెరా పోర్న్‌కు వ్యతిరేకంగా 2018లో సియోల్ నగరంలో వేలాది మంది మహిళలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు.

 
అయితే, బీబీసీతో మాట్లాడిన దక్షిణ కొరియా మహిళల్లో కొందరు మాత్రం కొంత అయోమయంలో ఉన్నారు. వారు తాజా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు, కానీ, అలా తాము కూడా బ్రాలు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగ్గలం అన్న ధైర్యం వారిలో కనిపించలేదు. అలా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే పురుషుల 'ఓర చూపు'లతో ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు అంటున్నారు. 2014లో 'నో బ్రాబ్లమ్' పేరుతో బ్రాలు లేకుండా తిరిగే మహిళల అనుభవాలతో దక్షిణ కొరియాలో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. ఆ డాక్యుమెంటరీ ప్రొడక్షన్ బృందం సభ్యుల్లో 28 ఏళ్ల జియాంగ్ సియాంగ్ యున్ కూడా ఒకరు. "మహిళలు బ్రాలు తప్పనిసరిగా ధరించాలని ఎందుకు ఆలోచించాలి?" అని ప్రశ్నిస్తారామె.

 
అది మా ఇష్టం
ప్రస్తుతం ఈ విషయాన్ని చాలామంది మహిళలు బహిరంగంగా చర్చించడం మంచి పరిణామమని ఆమె అన్నారు. అయితే, నేటికీ టీషర్టుల నుంచి చనుమొనలు బయటకు కనిపించడం పట్ల చాలామంది మహిళలు సిగ్గు పడుతున్నారని జియాంగ్ చెప్పారు. 24 ఏళ్ల పార్క్ I- సీయుల్ అనే దక్షిణ కొరియా మోడల్ కూడా గతేడాది తను మూడు రోజుల పాటు బ్రా ధరించకుండా ఉన్నప్పుడు వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోకు 26,000 వ్యూస్ వచ్చాయి. తన ఫాలోవర్లలో కొంతమంది ప్రస్తుతం మృదువుగా ఉండే బ్రాలను ఎంచుకుంటున్నారని ఆమె అంటున్నారు.

 
"బిగుతైన వైర్ బ్రాలు ధరించకపోతే వక్షోజాలు కిందకు జారి అందవిహీనంగా కనిపిస్తామన్న అపోహ ఉండేది. కానీ, నేను ఆ వీడియో తీసిన తర్వాత, నేను అలాంటి బ్రాలు వేసుకోవట్లేదు. ప్రస్తుతం వేసవిలో మృదువుగా ఉండే బ్రాలెట్ ధరిస్తాను, చలికాలంలో అసలు బ్రా వేసుకోను" అని ఆమె చెప్పారు.

 
దేశవ్యాప్తంగా స్పందన
ఈ ఉద్యమం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా స్పందన వస్తోంది. డేగు పట్టణానికి చెందిన విజువల్ డిజైన్ విద్యార్థి 22 ఏళ్ల నహ్యూన్ లీ... యిప్పీ అనే స్టార్టప్‌ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ నిపుల్ ప్యాచ్‌లను తయారు చేస్తోంది. గాయని శులీ నోబ్రా ఉద్యమం ప్రారంభించిన తర్వాత తాను ఆఫీసుకు వెళ్లినప్పుడు మాత్రమే బ్రా ధరిస్తున్నానని, బోయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లేటప్పుడు బ్రా వేసుకోవట్లేదని జియొల్లానామ్-డో ప్రావిన్సుకు చెందిన 28 ఏళ్ల డా క్యుంగ్ చెప్పారు. "నీకు బ్రా వేసుకోవడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తే, అసలు వేసుకోకు అని నా బోయ్‌ఫ్రెండ్ అన్నాడు" అని ఆమె తెలిపారు.

 
బ్రా వేసుకోకపోతే ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుందా?
"బ్రా వేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ మహిళలకు ఉందని నేను అనుకుంటున్నాను. కానీ, మీకు వక్షోజాల బరువు మరీ ఎక్కువగా ఉంటే వాటిని పైకి అదిమిపట్టేలా బ్రా ధరిస్తే మంచిది. లేదంటే దాని ప్రభావం మెడ, వెన్ను భాగం మీద కూడా పడుతుంది. వయసు పెరిగే కొద్దీ సహజంగానే శరీర ఆకృతి మారుతుంది, చర్మంలో పటుత్వం తగ్గుతుంది" అని బ్రెస్ట్ రీసెర్చ్ ఆస్ట్రేలియా కో డైరెక్టర్, ఫిజియోథెరపిస్టు డాక్టర్ డీడ్రె మెక్ ఘీ అంటున్నారు. ఛాతి నొప్పి, మెడ నొప్పిని నివారించేందుకు స్పోర్ట్స్ బ్రాలు ఉపయోగపడతాయని ఆమె చెప్పారు.

 
బ్రాలు ధరించినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుందని చెప్పేవారు... 'శరీరానికి ఫిట్‌గా లేని బ్రాలు ధరించి ఉంటారు' అని యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌‌మౌత్‌లో బయోమెకానిక్స్ సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జెన్నీ బర్బేజ్ అంటున్నారు. రొమ్ము కేన్సర్‌కు బ్రా ధరించడానికి మధ్య సంబంధం ఉన్నట్లుగా ఇప్పటి వరకు ప్రామాణికంగా జరిగిన ఏ శాస్త్రీయ పరిశోధనలోనూ వెల్లడి కాలేదని ఆమె చెప్పారు. 1968లో మిస్ అమెరికా కార్యక్రమం సమీపంలో కొందరు మహిళలు బ్రాలు చేతపట్టుకుని నిరసన తెలిపారు.

 
అమెరికాలో 50 ఏళ్ల క్రితమే నిరసన
మహిళలు ఇలాంటి ఉద్యమాలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. 1968లో మిస్ అమెరికా అందాల పోటీ కార్యక్రమం జరుగుతుండగా, సమీపంలో కొందరు మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. బ్రాలతో పాటు మరికొన్ని రకాల దుస్తులను నిరసనకారులు రోడ్డుపై విసిరేశారు.
ఆ తర్వాత కూడా కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. ఈ ఏడాది జూన్‌లో స్విట్జర్లాండ్‌ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చి సమాన వేతనం, సమానత్వంతో పాటు, లైంగిక వేధింపులు, హింసను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలంటూ బ్రాలను కాల్చి నిరసన తెలిపారు.

 
ప్రపంచవ్యాప్తంగా రొమ్ము కేన్సర్‌ గురించి అవగాహన పెంచేందుకు అక్టోబర్ 13 గతంలో 'నో బ్రా డే'గా ఉండేది. అయితే, గతేడాది ఫిలిప్పీన్స్ మహిళలు ఆ తేదీని లింగ సమానత్వ దినంగా ప్రకటించారు. న్యూయార్క్‌లో 'ఫ్రీ ద నిపుల్' పేరుతో నిరసన కొందరు మహిళలు నిరసన తెలిపారు. సెన్సార్‌షిప్ విషయంలో మహిళల శరీర భాగాల పట్ల వివక్ష చూపుతున్నారంటూ కొంతకాలంగా ఉద్యమాలు జరుగుతున్నాయి.

 
2014 డిసెంబర్‌లో 'ఫ్రీ ద నిపుల్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. మహిళల వక్షోజాలను సెన్సార్ చేయడం పట్ల న్యూయార్క్ నగరంలో కొంతమంది మహిళలు చేస్తున్న ఉద్యమం ఆధారంగా ఆ డాక్యుమెంటరీ రూపొందించారు. అది మహిళ శరీర భాగాలపై సెన్సార్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కొరియాలో ప్రారంభమైన తాజా నో బ్రా ఉద్యమం ఆ చర్చను మరో స్థాయికి తీసుకెళ్తోంది.