బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 12 మార్చి 2021 (13:20 IST)

పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు ‘అధికారికంగా’ కనిపించదు, ఎందుకు?

పింగళి వెంకయ్య.. ‘భారత జాతీయ పతాక రూపశిల్పి...’ అనేది తెలుగు వారే కాదు.. భారతీయులు చాలా మంది చెప్పే మాట. చిన్నప్పటినుంచి పాఠ్యపుస్తకాల్లో చదవుకున్న మాట. తెలుగు ఆంగ్ల పత్రికల రిపోర్ట్స్‌లో తరచుగా అలాగే ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ.. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌సైట్లలో కనిపించే జాతీయ పతాక చరిత్రలో ఎక్కడా పింగళి వెంకయ్య పేరు ప్రస్తావన లేదు.

 
ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మాత్రం.. 1921లో బెజవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సదస్సులో ‘ఒక ఆంధ్రా యువకుడు’ ఒక జెండాను తయారు చేసి గాంధీకి చూపించారు అని ప్రస్తావించారు. అయితే.. 2009లో భారత ప్రభుత్వం పింగళి వెంకయ్య స్మారక పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రదానం చేయాలని 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అదేమీ కార్యరూపం దాల్చలేదు.

 
నిజానికి.. భారత జాతీయ పతాకం రూపకల్పనలో చాలా చరిత్ర ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఈ పతాకం పురుడుపోసుకుంది. ఇప్పుడున్న రూపానికి రాకముందు అనేక మార్పులకు లోనయింది. అందులో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైనదని.. ఇప్పటి జాతీయ పతాకానికి అదే మాతృక అని.. చరిత్ర పుస్తకాల్లో చెప్తారు. పాఠ్యపుస్తకాల్లోనూ జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య అని బోధిస్తున్నారు.

 
కానీ.. ఈ అంశంపై స్పష్టత లేదు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అనేక రకాలుగా మారిన జెండాల్లో పింగళి రూపొందించిన జెండా ప్రధానమైనదే అయినప్పటికీ.. ఇప్పటి జాతీయ పతాకం దానికి భిన్నమైనదని పలువురు వాదిస్తున్నారు. జాతీయ జెండాకు ఇప్పటి తుదిరూపం రావడంలో.. హైదరాబాద్‌కు చెందిన ఆడపడుచు సురయ్యా తయాబ్జీ ప్రధాన పాత్ర పోషించారన్నది ఇందులో ఒకటి. నిజానికి.. ఆమె భర్త బద్రుద్దీన్ ఫయాజ్ తయాబ్జి 1947లో ప్రధానమంత్రి కార్యాలయంలో ఐసీఎస్ అధికారిగా పనిచేస్తున్నారని.. 1931లో కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలోని చరఖా స్థానంలో అశోక చక్రం ఉంచాలని ఆయన సూచించారని.. ట్రెవర్ రాయల్ తన పుస్తకం ‘ద లాస్ట్ డేస్ ఆఫ్ ద రాజ్’ పుస్తకంలో రాశారు.

 
అశోక చక్రంతో కూడిన జాతీయ పతాకం నమూనాను ఆయన భార్య సురయ్యా తయాబ్జీ తయారు చేయగా.. 1947 ఆగస్టు 15న తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆ జెండాను తన కారు మీద ఉపయోగించారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కొంత కాలం కిందట హైదరాబాద్‌కు చెందిన కెప్టెన్ ఎల్. పాండురంగారెడ్డి కూడా మీడియా ముందు చెప్పారు.

 
భారత జాతీయ పతాకం చరిత్ర మీద అధ్యయనం, పతాకాలు, స్టాంపుల సేకరణ హాబీగా ఉన్న శేఖర్ చక్రబర్తి అనే బ్లాగర్ కూడా.. జాతీయ పతాక రూపకర్తలు పలువురిలో పింగళి వెంకయ్య ఒకరని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అయితే.. జాతీయ పతాకం విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా పట్టించుకోవటానికి పింగళి పట్టుదల, ఆసక్తి కారణమని.. అందువల్ల జాతీయ పతాకం రూపకల్పనలో పింగళి అగ్రగణ్యుడిగా నిలిచిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

 
నిజానికి.. 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చాలా కీలక పాత్ర పోషించింది. అప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ, ఇతరత్రా నాయకులు రూపొందించిన జాతీయ పతాకాలు సామన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు. కానీ.. పింగళి రూపొందించిన పతాకం.. జాతీయోద్యమ పతాకంగా మారింది.

 
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో 1876 ఆగస్టు 2న జన్మించిన పింగళి.. చిన్న వయసులోనే జాతీయోద్యమంవైపు ఆకర్షితులయ్యారు. సైన్యంలో చేరి బోయర్ యుద్ధంలో పాల్గొనటానికి ఆఫ్రికా వెళ్లారు. అక్కడ గాంధీజీ ఉద్యమాలతో స్ఫూర్తిపొందారు. భారతదేశం తిరిగివచ్చాక స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో భారత జాతీయ పతాకం రూపకల్పన మీద ఆయనకు ఆసక్తి కలిగింది. పింగళి తన ఆలోచనలతో 1916లో ‘ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకం రాశారు. అందులో 24 రకాల జెండా నమూనాలను ప్రతిపాదించారు.

 
మహాత్మా గాంధీ స్వయంగా ఒక వ్యాసంలో రాసినదాని ప్రకారం.. 1921లో విజయవాడలో కాంగ్రెస్ సదస్సు జరిగినపుడు పింగళి కొన్ని పతాకాల నమూనాలు తయారు చేసి గాంధీజీకి చూయించారు. హిందువులు, ముస్లింలకు చిహ్నంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఒక జెండా తయారు చేయాలని గాంధీ చెప్పారు. పింగళి అలాగే చేయగా.. అందులో చరఖా బొమ్మ చేర్చాలని హన్స్‌రాజ్ సూచించారు. అలా చేర్చిన పతాకం గాంధీజీకి బాగా నచ్చింది. ఎరుపు, ఆకుపచ్చ రంగులకు పైన.. ఇతర మతస్తులందరికీ చిహ్నంగా తెలుపు రంగును చేర్చాలని గాంధీ సూచించారు.

 
అయితే.. పింగళి ఆ జెండాను తయారు చేసి తీసుకురావటం కొంత ఆలస్యం కావటంతో ఆ కాంగ్రెస్ సదస్సు ముందు దానిని ఆమోదానికి పెట్టలేకపోయారు. ఇలా జరగటం ఒకందుకు మంచిదేనని.. జెండాను మరింతగా తీర్చిదిద్దటానికి, ఆమోదనీయంగా మలచటానికి అది వీలు కల్పించిందని గాంధీ ఆ తర్వాత పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించకపోయినప్పటికీ.. పింగళి జెండా భారీ స్థాయిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. జలియన్‌వాలా బాగ్ దురంతానికి నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో 1923 ఏప్రిల్ 13న నాగ్‌పూర్‌లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తొలిసారిగా పింగళి జెండాను ఎగురవేశారు. దీనికి బ్రిటిష్ పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఆ ఘర్షణ ఒక మహోద్యమంగా మారింది.

 
నాగ్‌పూర్ కాంగ్రెస్ కమిటీ.. ‘జెండా సత్యాగ్రహా’నికి పిలుపునిచ్చింది. స్వరాజ్యం కాంక్షిస్తూ సాగిన ఆ జెండా సత్యాగ్రహం అనతి కాలంలోనే జాతీయ స్థాయికి పెరిగింది. జాతీయోద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా బలపడింది. పింగళి రూపొందించిన జెండా తన వంతు పాత్ర పోషించింది. భారత జాతీయ పతాకంగా ఆ జెండా అప్పుడే గుర్తింపు పొందింది.

 
ఈ నేపథ్యంలో జెండాలోని రంగులు.. అవి ఏ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్వల్ప వివాదాలూ తలెత్తాయి. దీంతో అందరికీ ఆమోదయోగ్యమైన జెండా రూపకల్పనకు కాంగ్రెస్ పార్టీ ఒక జెండా కమిటీని ఏర్పాటు చేసింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య కన్వీనర్‌గా ఏర్పాటైన ఆ కమిటీలో సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

 
ఆ కమిటీ అనేక మంది నుంచి సూచనలను స్వీకరించి.. పూర్తిగా కాషాయ వర్ణం మీద ఎరుపు చరఖా చిహ్నం ముద్రించిన పతాకాన్ని రూపొందించింది. కానీ 1931లో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దానిని తిరస్కరించింది. పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రజాదరణ పొందిందని.. దాన్ని సమూలంగా మార్చివేయటం ఉద్యమానికి ఉపకరించబోదని అభిప్రాయపడింది. అవసరమైతే పింగళి రూపొందించిన పతాకాన్నే మెరుగుపర్చుకుని ముందుకు వెళ్లాలని భావించారు.

 
పింగళి రూపొందించిన పతాకంలో.. ఎరుపు రంగు స్థానంలో కాషాయ రంగును చేర్చుతూ కొత్త త్రివర్ణ పతాకాన్ని ఖరారు చేసింది. అందులో పైన కాషాయ రంగు.. కింద ఆకుపచ్చ రంగు.. మధ్యలో తెల్ల రంగు ఉండేలా మార్పులు చేశారు. చరఖా అలాగే కొనసాగింది. ఇందులోని రంగులకు మతపరమైన ప్రాతినిధ్యాలేవీ లేవని ప్రకటించారు. సాహసం, త్యాగాలకు కాషాయవర్ణం, శాంతి సత్యాలకు శ్వేతవర్ణం, నిజాయితీ, దయాగుణాలకు ఆకుపచ్చ రంగు చిహ్నాలుగా అభివర్ణించారు. దీనిని అదే సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆమోదించింది. అదే సదస్సులో ‘పూర్ణ స్వరాజ్’ పిలుపు కూడా ఇచ్చింది.

 
అయితే.. 1921లో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ‘స్వరాజ్’ పతాకం గాను.. 1931లో ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ‘పూర్ణ స్వరాజ్ పతాకం’గాను.. కొందరు అభివర్ణిస్తున్నారు. 1947లో భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించేనాటికి జాతీయ పతాకాన్ని ఖరారు చేసే బాధ్యత రాజ్యాంగసభ తీసుకుంది. స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్ పార్టీ జెండాగా ఉన్న చరఖాతో కూడిన త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా అంగీకరించటానికి విముఖత వ్యక్తమైంది.

 
దీంతో.. చరఖా స్థానంలో బుద్ధుడి ధర్మ చక్రాన్ని చేర్చాలని రాజ్యాంగసభ చైర్మన్ డాక్టర్ అంబేడ్కర్ ప్రతిపాదించారు. అయితే.. ధర్మచక్రానికి బదులు అశోక చక్రాన్ని చేర్చాలన్న ప్రతిపాదన మీద ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కానీ.. చరఖాను తొలగించటం గాంధీజీకి ఏమాత్రం ఇష్టం లేదు. చరఖా ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ రాజ్యాంగసభ సిఫారసు మేరకు నెహ్రూ ప్రభుత్వం అశోక చక్రం ఉన్న జెండానే ఖరారు చేసింది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు సమాచారాన్ని విశ్లేషించినపుడు.. నేటి జాతీయ జెండాకు మూలమైన త్రివర్ణ పతాకపు స్థూల రూపం.. పింగళి వెంకయ్య 1921లో రూపొందించిన జెండాకు.. గాంధీ సూచించిన మార్పులు చేయటం ద్వారా తయారైన జెండా అని తెలుస్తోంది.

 
జాతీయ పతాకం ప్రస్థానంలో మైలురాళ్లు...
భారత జాతీయ పతాకం స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అనేక రకాలుగా మారుతూ ఇప్పటి రూపం తీసుకుంది. ఆ ప్రస్థానంలో మైలురాళ్లు ఇవీ...

 
భారత ఉపఖండం బ్రిటిష్ సామ్రాజ్య వలస పాలనలోకి రావటానికి ముందు.. విజయనగర సామ్రాజ్యం మొదలుకుని మొఘలుల సామ్రాజ్యం వరకూ.. అనేక రాజ్యాలు, సంస్థానాలుగా ఉండేది. ఆయా రాజ్యాలు, సంస్థానాలకు వేటి జాతీయ జెండా వాటికి ప్రత్యేకంగా ఉండేవి.

 
ఈస్ట్ ఇండియా కంపెనీ జెండా: మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారత్ మీద బ్రిటన్ పాలన సాగేది. 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో.. ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి బ్రిటన్ సామ్రాజ్యం నేరుగా భారతదేశాన్ని తన పరిపాలన కిందకు తీసుకువచ్చింది.

 
బ్రిటిష్ ఇండియా జెండా: ‘భారతదేశాని’కి మొట్టమొదటిగా ఒక జాతీయ జెండా వచ్చింది. అది ఇతర బ్రిటిష్ వలస దేశాల తరహాలోనే ఉండేది. వాటి మీద బ్రిటిష్ సామ్రాజ్య జెండా ‘యూనియన్ జాక్’ తప్పనిసరిగా ఉండేది. 19వ శతాబ్దం చివర్లో భారతదేశంలో స్వాతంత్ర్య కాంక్ష.. జాతీయోద్యమం ఊపందుకునే సమయంలోనే భారత జాతీయ జెండా ఆలోచనలు బలపడ్డాయి. ఆ మేరకు జెండా రూపకల్పనలు జరిగాయి.

 
1906 కలకత్తాలో జాతీయ పతాకం: భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పతాకాన్ని.. 1906 ఆగస్టు 7న ఇప్పటి కోల్‌కతా (అప్పటి పేరు కలకత్తా)లోని పార్సీ బగాన్ కూడలిలో ఆవిష్కరించినట్లు చెప్తారు. అది కూడా త్రివర్ణ పతాకమే.. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వర్ణాలు ఉండేవి. పైన ఎనిమిది కమలం పువ్వులు, మధ్యలో 'వందే మాతరం' నినాదం కింద సూర్య, చంద్రుల బొమ్మలు ఉండేవి.

 
1907లో పారిస్‌లో భారత పతాకం: రెండో జాతీయ పతాకాన్ని.. 1907లో దేశబహిష్కారానికి గురైన మేడం కామా తదితర విప్లవకారులు పారిస్‌లో ఆవిష్కరించారు. ఇది కూడా దాదాపు మొదటి పతాకం లాగానే ఉండేది. కాకపోతే పై భాగంలో కమలానికి బదులు.. ఇందులో సప్తరుషులకు గుర్తుగా ఏడు నక్షత్రాలను చేర్చారు. ఈ పతాకాన్ని బెర్లిన్‌లో జరిగిన సోషలిస్ట్ సదస్సులోనూ ప్రదర్శించారు

 
1917లో అనీబీసెంట్, తిలక్ పతాకం: స్వాతంత్ర్య పోరాటం కీలక మలుపు తిరిగిన 1917లో మూడో జాతీయ పతాకం రూపొందింది. స్వపరిపాలన (హోం రూల్) ఉద్యమం సందర్భంగా అనీ బీసెంట్, లోకమాన్య తిలక్‌లు దీనిని ఆవిష్కరించారు. ఇందులో ఏడు ఎరుపు గీతలు, ఐదు ఆకుపచ్చ గీతలు ఒకదాని తర్వాత ఒకటి అడ్డంగా పరిచివుంటాయి. వాటిపైన సప్తరుషుల చిహ్నంగా ఏడు నక్షత్రాలు.. ఒక వైపు మూలన బ్రిటన్ జాతీయ పతాకం, రెండో మూలన సూర్య, చంద్రుల చిహ్నాలు ఉన్నాయి.

 
1921: బెజవాడలో పింగళి వెంకయ్య జాతీయ పతకం: స్వాతంత్ర్య ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 1921లో బెజవాడలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్య ఒక జాతీయ పతాకాన్ని రూపొందించి ఆ సదస్సులో గాంధీజీకి చూపారు. దేశంలో రెండు ప్రధాన మతస్తులైన హిందువులు, ముస్లింలకు గుర్తుగా.. ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. అందులో చరకాను చేర్చాల్సిందిగా లాలా హన్స్‌రాజ్ సోంధీ సూచించారు. గాంధీజీ ఈ జెండాలోని ఎరుపు, ఆకుపచ్చ రంగులకు తోడు.. మిగతా మతాల వారికి గుర్తుగా తెలుపు రంగును చేర్చాలని సూచించారు. ఈ పతాకాన్ని స్వాతంత్ర్య ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉపయోగించారు.

 
1931లో త్రివర్ణ పతాకం: జాతీయ పతాకం చరిత్రలో 1931 మరో మైలురాయి. త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా నిర్ణయిస్తూ కాంగ్రెస్ సదస్సులో తీర్మానం చేశారు. ఎరుపు రంగును కాషాయ రంగుగా మార్చారు. ఇప్పటి త్రివర్ణ పతాకానికి ఇదే పునాది. ఈ పతాకాన్నే.. అందులోని చరఖాను తొలగించి.. నేతాజీ సుభాశ్‌చంద్రబోస్ బ్రిటిష్ వారి మీద పోరాడటానికి స్థాపించిన భారత జాతీయ సైన్యం రెండో ప్రపంచ యుద్ధంలో తన జాతీయ జెండాగా ప్రదర్శించింది.

 
1947.. అశోకుడి ధర్మచక్రంతో స్వతంత్ర భారత పతాకం: స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యంగ సభ జాతీయ పతాకాన్ని రూపొందించింది. 1931 నాటి పతాకంలోని రంగులను అలాగే ఉంచి.. తెలుపు రంగు మీద చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ చక్రం ముదురు నీలం రంగులో ఉంటుంది.