మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 8 మార్చి 2021 (21:57 IST)

BBC ISWOTY: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్-2020 అవార్డు విజేత: కోనేరు హంపి

భారత చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్ (BBC ISWOTY) 2020' పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డు కోసం ఎన్నికల బరిలో నిలిచిన అయిదుగురు నామినీల్లో స్ప్రింటర్ ద్యుతీ చంద్, ఎయిర్‌గన్ షూటర్ మను భాకర్, రెజ్లర్ వినేశ్ ఫోగట్, ప్రస్తుత భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి కూడా ఉన్నారు.

 
పబ్లిక్ ఓటింగులో హంపికి అత్యధిక ఓట్లు వచ్చాయి. హంపి 2020లో కెయిర్న్స్ కప్ గెలుచుకున్నారు. ఆమె ప్రస్తుతం మహిళల విభాగంలో వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్. రెండేళ్ల ప్రసూతి విరామం తర్వాత 2019 డిసెంబర్లో ఆమె ఈ టైటిల్ గెల్చుకున్నారు

 
ఆటను ఆస్వాదించండి-కోనేరు హంపి
"ఇండోర్ గేమ్ కావడంతో చెస్‌కు భారతదేశంలో క్రికెట్‌కు ఉన్నంత ఫాలోయింగ్ ఉండదు. ఈ అవార్డు వల్ల ఈ ఆట మరింత మంది దృష్టిని ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాను" అని బీబీసీ పురస్కారాన్ని గెల్చుకున్న అనంతరం హంపి అన్నారు. ఫలితంపై దృష్టి పెట్టకుండా ఆటను ఆస్వాదించాలని హంపి వర్ధమాన క్రీడాకారిణులకు సూచించారు. "చివరి దాకా పోరాడండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ గౌరవాన్ని, గుర్తింపును మీరే సంపాదించుకోవాలి. లక్ష్యం మీదే దృష్టి పెట్టండి" అని సలహా ఇచ్చారు.

 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి చెస్‌లో బాల మేధావిగా గుర్తింపు పొందారు. అత్యంత చిన్న వయసులోనే.. అంటే 15 ఏళ్ల ఒక నెల 27 రోజులకే 2002లో గ్రాండ్‌మాస్టర్ అయ్యారు. ఈ రికార్డ్‌ను 2008లో చైనాకు చెందిన హౌ యిఫాన్ అధిగమించారు. "నా దృఢసంకల్పం, ఆత్మవిశ్వాసంతోనే ఒకదాని తరువాత ఒకటిగా విజయాలను సాధిస్తూ వచ్చాను. మహిళా క్రీడాకారులు ఎప్పుడూ ఆటను విడిచిపెట్టకూడదు. పెళ్లి, మాతృత్వం అనేవి జీవితంలో భాగాలు. అవి మన ఆటకు అడ్డం కాకూడదు" అని హంపి పేర్కొన్నారు.

 
బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డెవీ ఈ పురస్కార వేడుకను వర్చువల్‌గా నిర్వహించి, విజేతను ప్రకటించారు. "BBC ISWOTY కేవలం ఒక అవార్డ్ మాత్రమే కాదు. ఇది, మా సంపాదకీయ నిబద్ధతలో భాగం. సమాజంలోని భిన్న స్వరాలకు, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే దిశగా మా జర్నలిజం నిష్పాక్షికంగా, నిజాయితీగా వ్యవహరిస్తూ వాస్తవ ప్రపంచానికి అద్దం పట్టాలన్నదే మా ప్రయత్నం " అని ఆయన అన్నారు. దేశంలోని అత్యున్నత క్రీడాకారిణిని సత్కరించుకోవడమే కాక, మహిళా క్రీడాకారులు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను చర్చకు తెచ్చే లక్ష్యంతో 2019లో 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్'అవార్డు ప్రారంభమైంది.

 
అంజు బాబీ జార్జ్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
భారత క్రీడా రంగంలో విశేష కృషి చేసి, భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలిచిన మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్‌ 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు' ఎంపికయ్యారు. ఆమె ఇప్పటికీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ మెడల్ సాధించిన ఏకైక భారతీయ అథ్లెట్. ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు అంజు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తనకు నిరంతరం మద్దతునిస్తూ ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, సహచరుడికి కృతజ్ఞతలు తెలిపారు.

 
"సవాళ్లను, పరిమితులను ఎదుర్కొంటూ పోరాడితే మీరు మరింత శక్తిమంతులవుతారు. లక్ష్యం మీదే దృష్టి పెడుతూ దినదినాభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తూ ఉండాలని" ఆమె అథ్లెట్లు అందరికీ పిలుపునిచ్చారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు విజేతను ఒలింపిక్స్‌లో భారతదేశానికి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిన ఏకైక క్రీడాకారుడు అభినవ్ బింద్రా ప్రకటించారు. ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ 'ఎమెర్జింగ్ ప్లేయర్ అవార్డ్'ను ప్రకటించారు.

 
నా శ్రమకు తగిన గుర్తింపు-మను భాకర్
మను భాకర్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ లభించింది. అవార్డులలో ఈ కేటగిరీని ఈ సంవత్సరమే జోడిందారు. "నా శ్రమకు తగిన గుర్తింపు వచ్చింది. నేనెంత కృషి చేస్తున్నాన్న విషయం ఇప్పుడు అందరూ గ్రహించారనిపిస్తోంది" అంటూ మను భాకర్ సంతోషం వ్యక్తం చేశారు. 19 ఏళ్ల మను భాకర్ అతి చిన్న వయసులోనే ప్రపంచ కప్‌లో స్వర్ణం సాధించిన భారత షూటర్‌గా 2018లో రికార్డు నెలకొల్పారు.

 
దిల్లీలో వర్చువల్ వేడుక
ఈ ఏడాది బీబీసీ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలో వర్చువల్‌గా జరిగింది. నాలుగుసార్లు పారా బాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పారుల్ పార్మర్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి మహిళ సంతోష్ యాదవ్ కూడా ఇందులో పాల్గొన్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ అవార్డ్ నామినీల జాబితాను ఫిబ్రవరిలో ప్రకటించారు. ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు సభ్యులుగా ఉన్న జ్యూరీ.. ఐదుగురు నామినీలను ఎంపిక చేసింది.

 
స్పోర్ట్స్ హ్యాకథాన్
ఈ ఏడాది ISWOTYలో భాగంగా ఫిబ్రవరి 18న 'స్పోర్ట్స్ హ్యాకథాన్' కూడా నిర్వహించారు. భారత మహిళా క్రీడాకారుల గురించి మరింత సమాచారాన్ని వివిధ భారతీయ భాషల వికీపీడియాల్లో చేర్చడమే దీని లక్ష్యం. ఈ క్రీడారిణుల గురించి వికీపీడియాలో ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంది. దేశంలోని 13 యూనివర్సిటీల నుంచీ వచ్చిన 300 మంది జర్నలిజం విద్యార్థుల సహాయంతో 50 మంది భారత మహిళా క్రీడాకారుల గురించి 300లకు పైగా ఎంట్రీలను వికీపీడియాలో చేర్చారు.

 
BBC ISWOTYలో భాగంగా క్రీడల దిశ, గమనాన్ని మారుస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన భారత మహిళా క్రీడాకారులపై కథనాలను 'ఇండియన్ ఛేంజ్‌ మేకర్స్ సీరీస్' ద్వారా బీబీసి అదించింది. ఈ సీరీస్‌లో పారా బాడ్మింటన్ ప్లేయర్ పారుల్ పార్మర్, హెప్టాథ్లెట్ స్వప్న బర్మన్, పారా స్కేటర్ ప్రియాంక దివాన్, మాజీ ఖో-ఖో ప్లేయర్ సరికా కాలే, రెజ్లర్ దివ్య కక్రాన్‌ల విజయగాథలను ప్రసారం చేశారు.