గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 16 మార్చి 2022 (20:20 IST)

రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: పరువు కాపాడుకునే దారుల కోసం పుతిన్ ప్రయత్నం

ఎంత ఘోర యుద్ధమైనా ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందే. కొన్నిసార్లు.. చావో రేవో తేల్చుకునే వరకూ పోరాటం జరుగుతుంది. 1945లో లాగా. అయితే ఎక్కువగా ఏదో ఒక రాజీ ఒప్పందంతో యుద్ధాలు ముగుస్తాయి. ఆ ఒప్పందాలు ఎవరినీ పూర్తిగా సంతృప్తి పరచవు. కానీ కనీసం రక్తపాతం ఆగిపోతుంది. అంతేకాదు.. భీకరంగా యుద్ధం చేసుకున్న బద్ధ శత్రువులైనా సరే.. పోరాటం ముగిశాక మెల్లమెల్లగా పాత సంబంధాలను పునరుద్ధరించుకుంటాయి. శత్రుత్వాలు కాస్తంతైనా తగ్గుతాయి.

 
రష్యా, యుక్రెయిన్‌ల మధ్య ఇప్పుడు ఈ రాజీ ప్రక్రియ మొదలైనట్లు కనిపిస్తోంది. ఆగ్రహం.. ముఖ్యంగా యుక్రెయిన్ వారిలో చాలా దశాబ్దాల పాటు కొనసాగుతుంది. కానీ ఇరు పక్షాలూ శాంతి కోరుతున్నాయి. ఇరువురికీ శాంతి అవసరం. యుక్రెయిన్‌కు శాంతి ఎందుకు కావాలంటే.. ఆ దేశంలోని నగరాలు, పట్టణాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రష్యాకు శాంతి ఎందుకు కావాలంటే.. యుక్రెయిన్ అధ్యక్షుడు చెప్తున్నదాని ప్రకారం.. చెచెన్యాతో చేసిన రెండు యుద్ధాల్లో రష్యాకు జరిగిన సైనిక ప్రాణ నష్టం, ఆయుధ నష్టం కన్నా చాలా ఎక్కువ ప్రాణ, ఆయుధ నష్టాన్ని ఈ యుద్ధంలో ఇప్పటికే చవిచూసింది. అయితే జెలియెన్‌స్కీ చెప్తున్న లెక్కలు నిజమో కాదో తేల్చటం అసాధ్యం.

 
కానీ.. తమ స్వీయ పతనానికి దారితీయగల శాంతి ఒప్పందం మీద ఎవరూ ఇష్టపూర్వకంగా సంతకం చేయరు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయితే.. పరువు కాపాడుకునే మార్గాల కోసం వెదుకుతున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఇప్పటికే దౌత్యవేత్తగా అద్భుతమైన నైపుణ్యం చూపారు. రష్యాను వెనక్కు పంపటం కోసం.. తనకు, తన ప్రజలకు ఆమోదయోగ్యమైనది ఏదైనా సరే చేస్తామని చెప్పటానికి, చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు.

 
ఈ దారుణ పరిస్థితుల నుంచి యుక్రెయిన్.. సమైక్యంగా, స్వతంత్ర దేశంగా బయటపడేలా చూడటమే ఆయన ఏకైక లక్ష్యం. పుతిన్ కోరుకుంటున్నట్లుగా కనిపిస్తున్న విధంగా.. రష్యాలో యుక్రెయిన్ ఒక రాష్ట్రంగా మారకూడదన్నది ఆయన పట్టుదల. పుతిన్‌కు కావలసింది.. ఇప్పుడు తాము గెలిచినట్లు ప్రకటించుకోగలగటం. ఈ అనవసర దండయాత్రలో రష్యా ముఖం పగిలేలా ఎదురు దెబ్బతిన్నదని ఆయన ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి ఒక్కరికీ అర్థమయినా సరే. ప్రపంచంలో నిజంగా ఏం జరుగుతోందనేది అర్థం చేసుకునే సుమారు 20 శాతం మంది రష్యన్లు.. పుతిన్ తనే స్వయంగా రచించుకున్న తన స్వీయ భ్రమల కోసం ఉన్నదంతా ఊడ్చి జూదంలో పణంగా పెట్టి, ఓడిపోయారని తెలుసుకుంటారు.

 
ఇక.. ప్రభుత్వ టీవీ చానల్‌లో తమకు ఏం చెప్తే అది నమ్ముతుండే మిగతా మెజారిటీ ప్రజల మద్దతు కోసం పోరాటం జరుగుతుంది. అసాధారణ ధైర్యశాలి, టీవీ ఎడిటర్ మరీనా ఒవిస్యాన్నికోవా.. ప్రభుత్వ టీవీల్లో జనానికి చెప్తున్నదంతా బూటకపు ప్రచారమని రాసిన ప్లకార్డుతో అకస్మాత్తుగా స్క్రీన్ మీద ప్రత్యక్షం కావటం వంటి సంఘటనలు జరిగినా సరే వారు ప్రభుత్వ ప్రచారాన్నే నమ్ముతుంటారు. మరైతే.. రష్యాలో మెజారిటీ ప్రజల దృష్టిలో బాగుండేలా.. పుతిన్ ఈ దారుణ యుద్ధం నుంచి బయటపడాలంటే ఆయనకు ఏం కావాలి?

 
మొదటిది.. సమీప భవిష్యత్తులో నాటోలో చేరే ఉద్దేశం తమకు లేదని యుక్రెయిన్ ఒక హామీ ఇవ్వటం. దీనిని యుక్రెయిన్ రాజ్యాంగంలో కూడా రాయాలనొచ్చు. దీనికోసం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఇప్పటికే మార్గం సిద్ధం చేశారు. యుక్రెయిన్ మీద నో-ఫ్లై జోన్ ప్రకటించాలంటూ.. నాటో అంగీకరించలేని దానిని ఆయన అడిగారు. ఆపైన.. ఈ విషయంలో తన అంచనాలను వమ్ము చేశారని ఆ కూటమిని విమర్శించారు. చివరిగా.. నాటో ఇలా వ్యవహరిస్తున్నపుడు అందులో చేరటం అవసరమా అంటూ గట్టిగా మాట్లాడారు.

 
ఇది తెలివైన రాజకీయ వైఖరి. ఇంతకంటే మెరుగైనది ఉండదు. నాటో అపఖ్యాతి మూటగట్టుకుంది. దానిని అది సులభంగానే తట్టుకోగలదు. యుక్రెయిన్‌కు తను కోరుకున్నట్లు వ్యవహరించే స్వేచ్ఛ లభిస్తుంది. ఇంతవరకూ సులభంగానే జరుగుతుంది. అయితే.. యూరోపియన్‌లో చేరాలన్న యుక్రెయిన్, జెలియెన్‌స్కీ ప్రగాఢ వాంఛను అణచుకోవటం కష్టం. దీనికి రష్యా అంతే తీవ్రంగా వ్యతిరేకం. అన్నిటికన్నా ఇంకా కష్టమైన విషయమేమిటంటే.. యుక్రెయిన్ భూభాగాన్ని రష్యా బాహాటంగా దొంగిలించటాన్ని జీర్ణించుకోవటం.

 
2014లో క్రైమియాను కోల్పోయిన యుక్రెయిన్.. దానికి బలవంతంగా ఏదో విధంగా లాంఛన ఆమోదం తెలపాల్సి వస్తుంది. ఇక తూర్పు యుక్రెయిన్‌లో ఇప్పటికే రష్యా నియంత్రణలో ఉన్న భూభాగాలను తాను అంటిపెట్టుకునే ఉండాలన్నది రష్యా ఉద్దేశంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రష్యా సామ్రాజ్యంలో భాగమైన ఫిన్లండ్‌ మీద 1939లో జోసెఫ్ స్టాలిన్ దండెత్తారు. 2022లో పుతిన్ యుక్రెయిన్ విషయంలో నమ్మినట్లుగానే.. నాడు స్టాలిన్ కూడా తన సైన్యం ఫిన్లండ్‌లో స్వల్ప కాలంలోనే పైచేయి సాధిస్తుందని బలంగా నమ్మారు. స్టాలిన్ సేనానులు ప్రాణ భీతితో.. ఆయన అంచనాలు సరైనవేనని భరోసా ఇచ్చారు. కానీ స్టాలిన్ అంచనాలు తప్పాయి.

 
నాటి శీతాకాల యుద్ధం 1940 వరకూ కొనసాగింది. సోవియట్ సైన్యం అవమానం చవిచూసింది. ఒక మహత్తర శక్తిని ప్రతిఘటించిన ఫిన్లండ్‌కు న్యాయమైన జాతీయ గర్వం మిగిలింది. ఆ దేశం కొంత భూభాగాన్ని కోల్పోయింది. దానికి కారణం.. స్టాలిన్, పుతిన్ వంటి నిరంకుశ పాలకులు.. తాము విజయం సాధించినట్లుగా బయటపడటం అవసరం. కానీ ఫిన్లండ్ తన అతి ముఖ్యమైన, శాశ్వతమైన దానిని కాపాడుకుంది. అది - స్వేచ్ఛాయుతమైన, స్వీయ నిర్ణయాధికారం గల దేశంగా సంపూర్ణ స్వాతంత్ర్యం.

 
రష్యా దాడులను ఎన్నిటినో తిప్పికొట్టి, పుతిన్ బలగాలు బలహీనంగా, అసమర్థంగా ఉన్నట్లు కనిపించేలా చేసిన నేటి యుక్రెయిన్‌.. నాటి ఫిన్లండ్‌లా చేయగలగాలి. పుతిన్ సైన్యాలు కీయెవ్ నగరాన్ని, యుక్రెయిన్‌లోని మరిన్ని భూభాగాలను హస్తగతం చేసుకుంటే తప్ప.. 1940లో ఫిన్లండ్ తరహాలో యుక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తుంది.

 
క్రైమియాను, తూర్పు యుక్రెయిన్‌లో కొన్ని భాగాలను కోల్పోవటం అన్యాయమైన, అక్రమమైన నష్టమే అవుతుంది. కానీ వ్లాదిమిర్ పుతిన్ తాను పైచేయి సాధించాలంటే ఇప్పటికే ఉపయోగించిన వాటికన్నా తీవ్రమైన ఆయుధాలను ఉపయోగించటం ప్రారంభించాల్సి వస్తుంది. యుద్ధంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. అసలైన విజేత ఎవరవుతారనే దాని మీద ఎవరికీ పెద్ద సందేహాలు ఉండవు.