శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (15:45 IST)

ఉక్రెయిన్‌పై దండయాత్ర - రష్యాకు మరో ఎదురుదెబ్బ

ఉక్రెయిన్‌పై గత 21వ రోజులుగా దండయాత్ర సాగిస్తున్న రష్యాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే భారీ సంఖ్యలో సైన్యాన్ని కోల్పోయిన రష్యా తాజాగా మరో మేజర్ జనరల్‌ను కోల్పోయింది. గత నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనేవుంది. చిన్నదేశం చిటికెలో తమ వశం చేసుకోవచ్చని భావించిన రష్యాకు ఉక్రెయిన్ సేనలు, ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో రష్యా అంతర్జాతీయంగా ఆంక్షల కోరల్లో చిక్కుకుంది. అలాగే, యుద్ధభూమిలో కూడా భారీ మొత్తంలో ప్రాణనష్టాన్ని చవిచూస్తుంది. 
 
తాజాగా ఉక్రెయిన్ సేనల దాడిలో రష్యా మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేన్ ప్రాణాలు కోల్పోయినట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈయన 150వ మోటరైజ్డ్ రైఫిల్ డివిజన్‌లో సేవలందిస్తున్నారు. అలాగే, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రైఫిల్స్ యూనిట్‌లో సైనికులను పరీక్షించడంలో ఆయనకు చాలా అనుభవం కూడా ఉంది. అలాంటి మేజర్ జనరల్‌లను రష్యా కోల్పోయింది.