శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (20:40 IST)

వకీల్ సాబ్ Vs. పింక్: 'ఆర్ యూ ఏ వర్జిన్' అని పవన్ కల్యాణ్ తన క్లయింట్‌ను ఎందుకు అడగలేకపోయారు

'ఆర్ యూ ఏ వర్జిన్, మిస్ మీనల్ అరోరా?' కోర్టు బోనులో ఉన్న అమ్మాయిని సూటిగా ప్రశ్నిస్తాడు డిఫెన్స్ లాయర్ దీపక్ సెహగల్ (అమితాబ్ బచ్చన్) 'పింక్' సినిమాలో. "తలాడించడం కాదు. స్పష్టంగా నోటితో చెప్పు' అని కూడా అంటాడు. 'పింక్' రీమేక్‌గా పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లో ఆ ప్రశ్న ప్రాసిక్యూటర్ నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్) అడుగుతారు. సరే, అడిగితే అడిగారు. దానికి వకీల్ సాబ్‌కు ఎందుకంత కోపం రావాలి?

 
కోపం వస్తే వచ్చింది, కోర్టు హాలులోనే జడ్జి ముందర టేబుల్‌ను ఎందుకు విరగ్గొట్టాలి? సరే, విరగ్గొడితే విరగ్గొట్టారు. కానీ, అదే ప్రశ్నను ఆయన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఫిర్యాదుదారు అయిన ఆ కుర్రాడిని ఎందుకు అడగాలి? అడిగి ఏం సాధిస్తారు? అతను వర్జిన్ అయినా, కాకున్నా దానివల్ల కేసుకు కలిగే నష్టం లేదా లాభం ఏమైనా ఉందా?

 
'పింక్'లో అమితాబ్ బచ్చన్ నిస్సంకోచంగా అడిగిన ప్రశ్నను, తెలుగు వకీల్ సాబ్ 'సత్యదేవ్' తన క్లయింట్ పల్లవిని ఎందుకు అడగలేకపోయారు? పైగా, ప్రత్యర్థి లాయర్ ఆ ప్రశ్న అడగడం మహాపరాధం అన్నట్లుగా బెంచీలు, బల్లలు విరగ్గొట్టి వీరంగం సృష్టిస్తాడు. ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి తాను వర్జిన్ కాదంటుంది. "19 ఏళ్ల వయసులో అది ఇష్టపూర్వకంగా జరిగింది. ఎవరూ ఫోర్స్ చేయలేదు. డబ్బివ్వలేదు" అని బదులిస్తుంది.

 
సెక్స్‌లో కన్సెంట్ లేదా అంగీకారం ఎంత ముఖ్యమో చెప్పడం ప్రధానాంశంగా ఉన్న కథలో ఆ ప్రశ్న కుర్రాడిని అడగడంలో అర్థం లేదు. అతను వర్జిన్ అయినా కాకున్నా 'కన్సెంట్' రూల్ అతనికీ వర్తిస్తుంది. అయితే, అమ్మాయికి పెళ్లికి ముందు సెక్స్, ఇష్టపూర్వకంగా జరిగినప్పటికీ అది ఆమె క్యారెక్టర్ మీద దాడి చేయడానికి ఈ సమాజంలో ఓ అస్త్రంగా పనికొస్తోంది. క్యారెక్టర్ అసాసినేషన్ తరువాత ఆమెను నేరస్థురాలిని చేయడం సులువవుతుంది. అలాంటి సోషల్ స్ట్రక్చర్‌ మీద బలంగా దాడి చేసి ఒక 'పాత్ బ్రేకింగ్' సినిమాగా నిలిచిపోయింది 'పింక్'. అందులోని ప్రోటాగనిస్ట్ ఆ ముగ్గురు నిందితులతో పాటు సినిమా చూస్తున్న ప్రేక్షకులందరి మైండ్‌సెట్‌ను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాడు.

 
'అలాంటి అమ్మాయిలకు, అలాగే జరుగుతుంది' అని బోనులో నించున్న 'నేరస్థుడు' గట్టిగా అరిచినప్పుడు, "అలా జరగకూడదు. జరగడానికి వీల్లేదు" అని వకీల్ సాబ్ మరింత ఆవేశంగా అంటాడు కదా? అదే అసలు పాయింట్. ప్రొవకేషన్‌కు గురైన ఆ కుర్రాడి వాగుడంతా పూర్తయ్యాక, 'సరిగ్గా జరిగిందదే యువరానర్' అని డిఫెన్స్ లాయర్ తన వాదనలు ముగించడమే ఈ కథలో అద్భుతమైన క్లైమాక్స్.

 
మరి, ఆ క్లైమాక్స్‌కు లీడ్ చేసే కీలకమైన మాటను తెలుగు హీరో ఎందుకు చెప్పలేకపోయారు. తెలుగు నేటివిటీకి కన్సెంట్ అంటే ఏమిటో ఇంకా తెలియదని భయపడ్డారా? లేక మన హీరో ఒక ఆడపిల్లను అలా అడగడం మంచి సంప్రదాయం కాదని 'ఫ్యూడల్ నీడలోనే' ఆగిపోయాడా? ఈ సంప్రదాయం నుంచి బయటపడకపోవడంతో 'పింక్' తరువాత అయిదేళ్లకు వచ్చిన 'వకీల్ సాబ్' కొన్నేళ్లు వెనక్కి వెళ్లిపోయింది.

 
'ఆదర్శ మహిళలకే హక్కులుంటాయా..?'
'పింక్' దర్శకుడు అనిరుధ్ రాయ్ చౌధురి తన కథలోని ముగ్గురు అమ్మాయిలను కావాలనే సోకాల్డ్ మంచి అమ్మాయిలుగా చూపించలేదు. స్వతంత్రంగా తమ జీవితాల్ని తమకు నచ్చినట్లుగా జీవించాలని ఆశపడే ఈ కాలం అమ్మాయిలను తన క్యారెక్టర్లుగా ఎంచుకున్నాడు. కులం, మతం, గతం, ప్రాంతం, ఆర్థిక స్తోమత, ముఖ్యంగా స్త్రీల మీద పురుషాధిక్య సమాజం ఆపాదించిన నైతిక విలువల చట్టుబండలేవీ వారికి న్యాయం దొరక్కుండా అడ్డుపడకూడదని చూపించేందుకు ఆ ముగ్గురు అమ్మాయిలకు మూడు భిన్నమైన నేపథ్యాలను ఇచ్చాడు.

 
ఒక అమ్మాయి రాక్ షోస్‌లో డాన్సర్. ఓ వ్యక్తిని 19 ఏళ్లప్పుడే ప్రేమిస్తుంది. మరో అమ్మాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె ఓ మిడిల్ ఏజ్ వ్యక్తిని ప్రేమిస్తుంది. అతడికి ఓ కూతురు. భార్య లేదు. నార్త్-ఈస్ట్ ప్రాంతానికి చెందిన మూడో అమ్మాయి ఓ బ్యూటీ సెలూన్లో పని చేస్తుంటుంది. ఇవీ "పింక్"లో ఆ మూడు ప్రధాన పాత్రల కండిషన్స్.

 
కానీ, తెలుగులోకి వచ్చేప్పటికి ఆ పాత్రలను 'మంచికి నమూనాలుగా' చిత్రించారు. ఇండిపెండెంట్ యాటిట్యూడ్స్ స్థానంలో సెంటిమెంట్స్‌ను బలంగా చూపించే ప్రయత్నం జరిగింది. అమ్మాయిలు చక్కగా గుడికి వెళ్తుంటారు. హారతులు పడతారు. అమ్మానాన్న చూపించిన సంబంధానికి ఓకే చెబుతారు. బాయ్‌ఫ్రెండ్ ఫ్యామిలీతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ, ఇలాంటి 'ఆదర్శ మహిళలకు' అన్యాయం జరిగితేనే మన గుండె స్పందిస్తుందా? భార్య లేని మగాడిని ప్రేమించి, అతడి ఇంటి వంట గదిలో కబుర్లు చెబుతూ కనిపించే అమ్మాయిని మనం చులకనగా చూస్తామా? కథలోని అసలు పాత్రలకు బదులు 'మోడల్ సిటిజెన్స్' లేదా సాంప్రదాయిక మగువలను ప్రొజెక్ట్ చేయడమనే మార్పు వల్ల ఈ ప్రశ్నలకు జవాబులు లభించవు.

 
స్టార్ హీరో వర్సెస్ స్టోరీ
ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్టుగా ఉన్నంతకాలం అతడు లేదా ఆమె కెరీర్ హారిజోంటల్‌గా ఉంటుందని, స్టార్ అయితే మాత్రం వెర్టికల్ గ్రోత్ తప్పదని హాలీవుడ్‌లో ఓ విశ్లేషణ ఉంది. హారిజోంటల్‌గా అంటే సమాంతరంగా వైవిధ్యమైన పాత్రలతో కెరీర్ విస్తరిస్తుందని అర్థం. వెర్టికల్ గ్రోత్ అంటే ఒకే పాత్ర అలా నిటారుగా ఆకాశాన్నంటేలా పెరిగిపోవడం. అంటే, స్టార్ అయింతర్వాత ఇక ఎప్పటికీ స్టార్‌గానే కొనసాగాలి. రజినీ, రజినీలాగే కనిపించాలి, చిరంజీవి చిరంజీవిలానే ఉండాలి. పవన్ కల్యాణ్ పవర్ స్టార్‌లానే ఉండాలి. వారి రూపం, శక్తియుక్తులు, స్వభావాలు, లక్షణాలు సినిమా సినిమాకు పెద్దగా ఏమీ మారవు. వాళ్ల చుట్టూ ఉండే పాత్రల కథలే కొద్దిగా మారుతుంటాయంతే. కథ ఏదైనా వారు ఆ మూసలో ఉండాల్సిందే. అసాధ్యమైన ఫైట్లు, ఫీట్లతో ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉండాల్సిందే. అలాంటి యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ జానర్‌లోనూ ప్రతి ప్రయత్నమూ 'హిట్' అవుతుందన్న గ్యారంటీ లేదు.

 
కానీ, ఒక బలమైన సమకాలీన సమస్యను డీల్ చేసే 'పింక్' లాంటి కథను ఏరికోరి ఎంచుకున్నప్పుడు హీరోగారు కొంత తగ్గాల్సిందే. ఎక్కడ తగ్గాలో తెలియడమంటే అదే. సినిమాకు 'కథే హీరో' అని మన తెలుగు సినీ పెద్దలు తరచూ చెబుతుంటారు కానీ, హీరోనే అసలు కథ అని పదే పదే రుజువవుతూ ఉంటుంది. కథే హీరో కావడమంటే, కథే హీరోనూ ఇతర పాత్రలనూ నడిపించడం.

 
పింక్ సినిమా టైటిల్స్‌లో ముగ్గురు అమ్మాయిల పేర్లు పడిన తరువాత అమితాబ్ బచ్చన్ పేరు కనిపిస్తుంది. అలా చేయాలని అమితాబే దర్శకుడ్ని కోరారని అమెజాన్ ప్రైమ్‌లో రాశారు. అదీ ఆయన కథకు ఇచ్చిన గౌరవం. కానీ, వకీల్ సాబ్‌లో ఎప్పట్లాగే హీరోయిజంతోనే కథను నడిపించే ఫార్ములా అమలైంది. 'మంచి మెసేజ్‌ను ఎంటర్‌టైనర్‌గా మలిచి మాస్‌కు చేరువ చేసే' తెలుగు సినిమాటిక్ కల్చరే తెర నిండుగా మార్మోగింది. పునరావాసం కల్పించకుండా పేద వాడలు కూల్చే గూండాల మీద కొరియోగ్రాఫికల్ స్టంట్స్ చేస్తూ హీరో ఎంట్రీ ఇస్తాడు.

 
తెలంగాణ వచ్చి ఇన్నేళ్లయినా డీఎస్సీ కూడా ప్రకటించలేదంటూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసే విద్యార్థి నాయకుడు, సింగరేణి కార్మికులు, చుండూరు బాధితుల తరఫున పోరాడే మానవ హక్కుల న్యాయవాది, ఇలా సమస్త ఉద్యమాల సమిష్టి చిహ్నంగా పవన్ పొలిటికల్ అజెండాను చూపించే 'ఫ్లాష్‌బ్యాక్' అసలు కథను చాలా సేపు మరిచిపోయేలా చేస్తుంది.

 
అంటే, స్టోరీని స్టార్ ఇమేజ్ నిష్పూచీగా డామినేట్ చేసింది. ఎంతైనా స్టార్ సినిమా కదా, ఆ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండకుంటే ఎలా అని అంటారేమో? ఎలిమెంట్స్ పేరుతో ఒకటో రెండో ఫైట్ సీన్స్ క్రియేట్ చేస్తే సరేలే అనుకోవచ్చు. "పింక్" తమిళ రీమేక్ 'నేర్కొండ పార్వై'లో హీరో అజిత్ ఆ అమ్మాయిల కేసు టేకప్ చేయకుండా బెదిరించేందుకు విలన్ రౌడీలను పంపిస్తాడు. వాళ్లను కొట్టి ఆ రాజకీయ నాయకుడి వద్దకు వెళ్లిన హీరో, 'నన్ను భయపెట్టాలని చూశావ్. నాలో భయం కనిపిస్తోందా... ఏదైనా కోర్టులోనే తేల్చుకుందాం' అని వార్నింగ్ ఇస్తాడు. హిందీ, తమిళ వెర్షన్లను కలిపి, వాటికి పొలిటికల్ ఇష్యూస్‌ జత చేసి వండిన వకీల్ సాబ్ కూడా అలాంటి వార్నింగే ఇస్తాడు. కానీ, మళ్లీ క్లయిమాక్స్‌లో ఓ ఫైట్ సీన్ క్రియేట్ చేస్తాడు. వార్నింగ్ తేలిపోతుంది. సమస్యేంటంటే, సిస్టమ్ పరిధిలో వ్యవస్థ మీద చట్టబద్ధమైన పోరాటం చేస్తున్న హీరో, రోలెక్స్ వాచీని ఆయుధంగా పట్టుకుని వీధి పోరాటాలు చేస్తూ ఇన్‌స్టంట్ జస్టిస్ ‌కోసం తెగబడడం ఓ పారడాక్స్.

 
అమితాబ్ ఎందుకు అలా తీక్షణంగా చూస్తుంటాడు...
'పింక్' సినిమాలో ఆ ముగ్గురు అమ్మాయిల పక్కింట్లో ఉండే అమితాబ్ బచ్చన్ వారి వంక పదే పదే తీవ్రంగా చూస్తుంటాడు. వారు ఏదో సమస్యలో చిక్కుకున్నారని ఆ అనుభవజ్ఞుడైన లాయర్ గ్రహిస్తాడు. ఆ తరువాత ఫలక్ (తెలుగులో జరీనా) మీదకు ఓ వెహికిల్ దూసుకొస్తుంటే పక్కకు లాగి, 'యూ షుడ్ బీ కేర్ ఫుల్' అని చెబుతాడు. అతడి కళ్ల ముందే మీనల్‌ను వ్యాన్లో కిడ్నాప్ చేసి తీసుకుపోతారు. తిరిగి ఆమెను ఇంటి వద్ద వదిలేసినప్పుడు కూడా ఆయన తన బాల్కనీలోంచి చూస్తాడు. కిడ్నాప్ అయిన వెంటనే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అలా ఒక ఇన్ సైడ్ అబ్జర్వర్‌గా వారి కథలోకి స్వయంగా ఎంటరవుతాడు అమితాబ్ బచ్చన్ ఉరఫ్ దీపక్ సెహగల్.

 
ఆ చూపుల్లో ఒక మిస్టిసిజమ్ ఉంటుంది. అది కన్సర్న్ అని క్రమంగా అర్థమవుతూంటుంది. అలా ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. ఈ సెన్సిబిలిటీని వకీల్ సాబ్ మిస్సయింది. వకీల్ సాబ్ చిత్రంలో పల్లవిని కిడ్నాప్ చేసిన వారు తిరిగి కాలనీ లోపలికి వచ్చి ఆమెను వదిలేసినప్పుడు హీరో చూస్తాడు. ఆమె పూర్తిగా షాక్ అయిపోయి వెళ్లిపోతుంటే, హీరో అదేమీ పట్టనట్లుగా, ఆ వాహనంలోని కుర్రాళ్ల మీద హీరోయిజం చూపించి వదిలేస్తాడు. మెడిసిన్ అని రాసి ఉన్న లిక్కర్ హిప్ ఫ్లాస్క్‌లో మందు పోసుకుని తాగితే కానీ ఆవేశాన్ని తగ్గించుకోలేని కథానాయకుడు ఆ తరువాత సీన్లలో ఆ సంగతి మరిచిపోవడం ఓ ఉపశమనం.

 
మగువలు ఎంతకాలం సహనానికి ప్రతీకలు?
చీకటి చీకటి ఇంకా చీకటినే తేస్తోంది/ఈ వెలుగు పాదాలకు సంకెళ్లేమిటి?/సీతాకోక చిలుకల రెక్కల మీద రాళ్లు పెట్టారెవరు... ఏమిటీ సంప్రదాయం?/ నిప్పు కణికలోంచి ఎగసే పొగ ఏమని అరుస్తోంది? అంటూ తన్వీర్ ఘాజీ రాసిన గాఢమైన కవిత్వం 'కారి కారి రైన సారి...' పాటగా నేపథ్యంగా వినిపిస్తుంది "పింక్"లో.

 
ఆధునికమని చెప్పుకుంటున్న ఈ సమాజంలో మహిళలు అణచివేతను భరిస్తున్న నిప్పుకణికల్లా ఉన్నారని ఈ పాట ఘోషిస్తుంటే, వకీల్ సాబ్‌లోని 'మగువా మగువా...' పాట మహిళను ఆదిశక్తి రూపమని, సహనంలో భూదేవి లాంటిదని రొమాంటిసైజ్ చేస్తుంది. పాట, బాణీ గొప్పగా ఉంటాయి వేరేగా వింటే. కానీ, ఈ సినిమా కాంటెక్స్ట్‌లో చూస్తే అదంతా కాలం చెల్లిన భావాల కూర్పు. ఆమె లాలనలో ప్రతి మగవాడూ పసివాడేగా అని ప్రాబంధిక మూస వాక్యాలతో మురిసిపోవడానికి, ఈ కథలోని సంఘర్షణకూ ఏమైనా సంబంధం ఉందా?

 
'పింక్' ఎండ్ టైటిల్స్ రోల్ అవుతుంటే అమితాబ్ గొంతులో వినిపిస్తుంది మళ్లీ తన్వీర్ పాట... నువ్వు ముందుకు వెళ్తూనే ఉండు/నీ అస్తిత్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళు/నువ్వు హారతిలో దీపానివి కాదు/ఆగ్రహ జ్వాలవు/సంకెళ్లను తెంచుకుని వాటినే ఆయుధాలుగా మలచుకుని వెళ్తూ ఉండు/కొంగును జెండాలా ఎగరేయ్... ఆకాశమే చప్పట్లు కొడుతుంది. దర్శకుడు కథలోని అంతస్సారంతో మమేకమైనప్పుడే ఇలాంటి సాహిత్యానికి ప్రేరణ ఇవ్వగలుగుతాడు.

 
పింక్ ఒక మూడ్ క్రియేట్ చేస్తే...
కథ బలంగా వచ్చినప్పుడు, తీసేవాళ్లు కథను అంతే బలంగా నమ్మినప్పుడు మొదటి అయిదు నిమిషాల్లోనే థీమ్ సెట్ అయిపోతుంది. వకీల్ సాబ్ దర్శకుడు శ్రీరామ్ వేణు ఆ ప్రాథమిక జాగ్రత్తలు తీసుకున్నారు. ఓపెనింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ విషయంలో డీవియేట్ కాలేదు. మాస్ అట్రాక్షన్స్ అనుకున్న వాటిని ఫస్టాఫ్‌లో దట్టించి, సెకండాఫ్‌లో కోర్టు రూమ్ డ్రామాకు కట్టుబడి ఉన్నాడు, మళ్లీ ఒకటి రెండు ఇంక్లూషన్స్‌ను మినహాయిస్తే.

 
ఫ్యాన్స్‌కు పవన్ కల్యాణ్ ఒక ఫీస్ట్‌లా కనిపిస్తాడు. ప్రకాశ్ రాజ్ యాక్టింగ్ చెప్పక్కర్లేదు. అయితే, కోర్టు రూం డిస్కోర్స్‌ అంతా ఒకే గ్రాఫ్‌లో కాకుండా మాడ్యులేషన్ వేరియేషన్స్ కనిపిస్తే మరింత బాగుండేది. ముఖ్యంగా, పింక్‌లో ప్రముఖ బెంగాలీ నటుడు ధృతిమాన్ ఛటర్జీ జడ్జి పాత్రలో జీవించాడు. సత్యజిత్ రే వంటి దర్శకులతో కలిసి ఎన్నో గొప్ప సినిమాలు చేసిన ధృతిమాన్ ముఖంలో కూడా కేసు నడుస్తున్న తీరులోని మార్పులు కనిపిస్తాయి. జడ్జి పర్స్పెక్టివ్ లోంచి తీసిన షాట్స్ కూడా చాలా యాప్ట్‌గా ఉంటాయి. కానీ, తెలుగులో జడ్జి పాత్రను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆయనలో కేసును ఫాలో అవుతున్న లక్షణం కన్నా చిరాకే ఎక్కువగా కనిపించింది.

 
కథకు సంబంధించిన ఒక విజువల్ మూడ్, మ్యూజికల్ సెన్సిబిలిటీస్ కూడా సినిమా చూస్తున్నప్పుడు రెండు బలమైన పాత్రలుగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. ప్రయత్నపూర్వకంగా అలాంటి లక్షణాలను దూరంగా పెట్టడం వల్ల వకీల్ సాబ్ సినిమాలో సోల్ మిస్సయి, ఒక ఎంటర్‌టైనర్‌గా మిగిలిపోయింది.

 
తమన్ సంగీతం ఆడియన్స్‌ను ఎగ్జయిట్ చేసేలా ఉంది. కానీ, ఆడియన్స్‌ను కథలోకి లాక్కుని, ఇన్‌వాల్వ్ చేసే సంగీతం ఒకటుంటుంది. స్టీరియోటైప్స్‌ను బ్రేక్ చేసే పింక్ లాంటి కథలకు అది అవసరం. కథలోని మానసిక స్థితికి ట్రిగ్గర్ చేసే ఇన్‌స్ట్రుమెంటల్ యాక్టివిటీ ఇందులో అసలేం జరగలేదు. అందుకే, కోర్టు రూమ్ వాదోపవాదాల సంగీతానికి, మెట్రో రైల్ పైటింగ్ సీన్ బీజీఎంకు పెద్దగా తేడా కనిపించదు. దాంతో, క్లిషేను అవాయిడ్ చేసిన ఓ మంచి కథ మళ్లీ ఓ రొటీన్ మాస్ మసాలా కథలా 'అలరిస్తుంది.'

 
అన్నింటికీ మూలం 1988లో వచ్చిన 'ది అక్యూజ్‌డ్'
జోడీ ఫోస్టర్ ఆకతాయి అమ్మాయిగా, అన్‌ప్రిడిక్టబుల్‌గా కనిపించే 'ది అక్యూజ్డ్' సినిమాను జొనాథన్ కప్లాన్ డైరెక్ట్ చేశాడు. బార్‌లో తాగడానికి వచ్చి గ్యాంగ్ రేప్‌కు గురైన అమ్మాయి, 'నేనెందుకు బాధపడాలి? తప్పు చేసిన వాడు బాధపడాలి' అని నిర్ణయించుకుని కోర్టు పోరాటానికి దిగుతుంది. 'నేను నో అన్నాను' అనే పాయింట్‌తోనే ఆ కథ ముగుస్తుంది.

 
జోడీకీ మొదటి ఆస్కార్ ఆ సినిమాతోనే వచ్చింది. ఆ సినిమా ఇచ్చిన ఇనిస్పిరేషన్‌తోనే పింక్ తయారైంది. దాన్ని దర్శకుడు అనిరుధ్ రాయ్, లిబరలైజ్డ్ ఎకానమీలో మారుతున్న అర్బన్ స్పేస్‌ను బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని పింక్‌ను తెరకెక్కించాడు. నిజం చెప్పాలంటే, ది అక్యూజ్‌డ్‌లోని డ్రామా పార్ట్‌ను పక్కన పెట్టి "నో" అన్న మాటకు ఉన్న విలువ చుట్టే విజువల్ డిబేట్ క్రియేట్ చేశాడు.

 
తెలుగు సినిమా మైండ్ సెట్ మారదా?
అత్యాచారం, లైంగికదాడి జరిగినప్పుడు అమ్మాయిలు చివరికి తమను తామే నేరస్థులుగా భావించే పరిస్థితులు ఉన్నాయి. ఏ సామాజిక తరగతికి చెందిన మహిళలైనా ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆ టైములో అక్కడేం చేస్తున్నావ్? అలాంటి డ్రెస్‌లు ఎందుకు వేసుకున్నావ్? నీకిది అలవాటేగా లాంటి ప్రశ్నలను సమాజం వారి మీదకు ఎక్కు పెడుతుంది.

 
"విదేశాల్లో పెద్ద చదువులు చదువుకుని వచ్చి, హుందాగా సూటుబూటు వేసుకునే ఇప్పటి యువకులు కూడా అదే ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో ఉన్నారు. తప్పు అమ్మాయిల్లో కాదు, తమలోనే ఉందని వారు తప్పనిసరిగా తెలుసుకోవాలి" అంటాడు బచ్చన్. వకీల్‌ సాబ్‌లో కూడా, "చీడ ఇక్కడ ఉంటే మందు ఎక్కడో కొట్టాలంటారేంటి యువరానర్" అంటాడు లాయర్ సత్యదేవ్.

 
కోర్టు డ్రామా ముగిసి జడ్జి తీర్పు చెప్పిన తరువాత 'పింక్'లో ప్రాసిక్యూటర్ ప్రశాంత్ మెహ్రా (పీయూష్ మిశ్రా) లేచి వచ్చి అమితాబ్ బచ్చన్‌కు షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆ చర్యలో ఒక రియలైజేషన్ ఉంది. అది ప్రేక్షకుడి నుంచి దర్శకుడు ఆశిస్తున్న రియలైజేషన్. వకీల్ సాబ్‌లో దీనికి రివర్సుగా జరుగుతుంది. కేసు గెలిచాక పవన్ కల్యాణ్ వెళ్లి ప్రకాశ్ రాజ్‌కు హేక్ హ్యాండ్ ఇస్తాడు. ఓటమి గురించి ఓ నీతి వాక్యం చెబుతాడు. ఇందులో ఏం కన్వే అవుతుంది? రీమేక్‌లో ఇలాంటి సటిలిటీస్ మిస్సవడం కూడా అపరాధమే.

 
తెలుగు సినిమా మారాలి, కొత్తదనం రావాలి అని అందరూ అంటుంటారు. కానీ, కొత్త పాయింట్‌తో ఒక కథ చేతిలోకి వచ్చినప్పుడు రొటీన్ ఫార్ములాను ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నాం? మంచి ఎలిమెంట్‌తో సినిమా తీయడం మంచి విషయం. పింక్‌తో పోలిక లేకుండా చూస్తే, సినిమా మామూలు మసాలా సినిమాలతో పోలిస్తే మెరుగే కావచ్చు. పెద్ద హీరోతో చేస్తే రీచ్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మందికి చేరుతుంది అనేది కూడా నిజమే కావచ్చు. కానీ, దాని కోసం మాతృక లోని ఆత్మకు ఎంత దూరంగా వెళ్లారు, సున్నితమైన అంశాలను ఎంత మేర టోన్ డౌన్ చేసుకుంటూ పోయారని చూస్తే మాత్రం మనం చాలా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉందేమో అనిపిస్తుంది.