సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (15:21 IST)

Vijayawada Municipal Corporation: బిల్డర్లకు టౌన్ ప్లానింగ్ అధికారులే అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా? ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?

Buildings
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో కొందరు నిబంధనల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీద కేసు కూడా బుక్ అయింది. ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ కొనాలనుకొంటే దానికి సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోండని ప్రభుత్వం చెబుతోంది. అలాగే బిల్డర్లు లైసెన్స్ ఉన్నవారా కాదా? అనేది కూడా చూసుకోవాలని సూచిస్తోంది. ఎందుకంటే లైసెన్స్ ఉన్న బిల్డర్ అయితే అపార్ట్‌మెంట్ నాణ్యత బాగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

 
లైసెన్సు లేకుండా అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు అనుమతి లేదని, అందుకే డాక్యుమెంట్లు సరిచూసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. లైసెన్సు లేకుండా అపార్ట్‌మెంట్ నిర్మిస్తే మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియజేయాలని అంటోంది. కానీ అలాంటి బిల్డర్లకు లైసెన్సుల మంజూరులోనే నిబంధనలు పాటించడం లేదని, మున్సిపల్ అధికారులే చట్ట విరుద్ధంగా అనుమతులు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించి బిల్డర్ లైసెన్సులు మంజూరు చేశారంటూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పటికే మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలో ప్రణాళికా విభాగం తీరు మీద విమర్శలు వస్తున్నాయి. వాటికి తోడుగా లైసెన్సుల మంజూరులోనే ఇలా వ్యవహరిస్తే ఇక అలాంటి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.

 
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
పట్టణాలు, నగరాల పరిధిలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం బిల్డర్లకు లైసెన్సుల మంజూరు చేసే అధికారం కమిషనర్లకు ఉంటుంది. జీవో నెం.119 ప్రకారం నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం, నిర్మాణదారులకు మోడల్ రూల్స్ అనుసరించి అనుమతులు మంజూరు చేయాలి. బిల్డర్‌ క్వాలిఫైడ్ సివిల్ ఇంజినీర్ అయి ఉండాలి లేదా ఆర్కిటెక్ట్‌ అర్హత ఉండాలి. ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ ఐదేళ్ల పాటు గ్రేడ్-2 కాంట్రాక్టర్‌గా నిర్మాణ రంగంలో ఉన్న వారు కూడా బిల్డర్ లైసెన్స్ పొందేందుకు అర్హులు.

 
ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్-2017 ప్రకారం నిబంధనలు పాటించని వారికి బిల్డర్ లైసెన్స్ మంజూరు చేయకూడదు. ఐదేళ్ల ఆదాయపు పన్ను చెల్లింపు పత్రాలు సహా అన్ని అర్హత పత్రాలు సమర్పించిన తర్వాత, వాటిని పరిశీలించి మాత్రమే లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు తొలుత తాత్కాలిక ప్రాతిపదికన, ఆ తర్వాత దానిని కొంత కాల పరిమితితో లైసెన్సులు జారీ చేస్తారు. ఆ సమయంలోనే బిల్డర్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్హత పత్రాలకు తగిన ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. వాటిని మున్సిపల్ అధికారులు సమగ్రంగా పరిశీలించ, కమిషనర్ ఆమోదంతో లైసెన్స్ అందిస్తారు.

 
నిబంధనలు పాటిస్తున్నారా?
బిల్డర్‌కు లైసెన్స్ మంజూరులో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు పదే పదే వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బిల్డర్ లైసెన్సుల మంజూరులో నిబంధనలు పాటించకుండా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జీవోను ఉల్లంఘించారటూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏపీ యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యన్నారాయణ ఈ పిర్యాదు చేశారు. జూన్ 15న తమకు ఫిర్యాదు అందిందని బీబీసీకి పోలీసులు తెలిపారు. దానిని పరిశీలించి, చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. వీఎంసీ పరిధిలోని గుణదల కార్మెల్ నగర్‌లో గల ఓ అపార్ట్‌మెంట్ విషయంలో బిల్డర్‌కు అర్హత లేకపోయినా లైసెన్సు మంజూరైందని ఫిర్యాదుదారు సత్యన్నారాయణ ఆరోపించారు. పాములపాటి నాగరత్నమ్మ అనే 72 ఏళ్ల మహిళ పేరుతో 2019లో మంజూరైన లైసెన్సులో నిబంధనలు పాటించలేదంటూ ఆరోపించారు. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ కొన్ని పత్రాలు సమర్పించారు.

 
'టెంపరరీ లైసెన్స్ చూపించి...'
తాత్కాలిక ప్రాతిపదికన మంజూరైన బిల్డర్ లైసెన్సు చూపించి అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు అనుమతులు వచ్చాయని, వాటి ద్వారా కొంత నిర్మాణం కూడా జరిగిందని ఫిర్యాదులో సత్యన్నారాయణ వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతినిచ్చిందనే పేరుతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వాటిని సేల్ డీడ్ చేసి అమ్మకాలను ధ్రువపరిచారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు రుణాలు మంజూరు చేయడానికి, తదుపరి అనుమతులకు ఈ లైసెన్సు మూల కారణమైందని ఆయన ప్రస్తావించారు. తద్వారా అర్హత లేని బిల్డర్ నిర్మించిన అపార్ట్‌మెంట్ కొన్నవారికి అన్యాయం జరిగిందన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సత్యన్నారాయణ రాతపూర్వకంగా కోరారు.

 
ఇలాంటివి చాలానే!
విజయవాడ పరిసరాల్లో ముఖ్యంగా కార్పొరేషన్‌తో పాటుగా సీఆర్డీఏ పరిధిలో 2015 తర్వాత నిర్మాణాలు పెరిగాయి. వాటికి అనుమతులు కోరుతూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇలా వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించడం, నిబంధనలను అనుసరించి లైసెన్సులు మంజూరు చేయడం లాంటి విషయాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది కొనుగోలుదారులకు సమస్యగా మారుతోందని సత్యనారాయణ విమర్శించారు. 'ఆంధ్రప్రదేశ్ అంతా టౌన్ ప్లానింగ్ విభాగం తీరుపై చర్యలు అవసరం. కొందరు అధికారులు వ్యవహరించే తీరు సామాన్యులకు శాపంగా మారుతోంది. నగరంలో అపార్ట్‌మెంట్ నిర్మాణాల విషయంలో మా దృష్టికి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఫ్లాట్లు కొని నష్టపోయామని భావిస్తున్న వారు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై ఆర్టీఐ పెట్టాం. అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయనే అంశం మా దృష్టికి వచ్చింది. వాటిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులను కోరినా ఖాతరు చేయలేదు.' అని సత్యన్నారాయణ బీబీసీకి తెలిపారు.

 
జీవోలు అమలు చేయకుండా, ఎవరికి తోచిన రీతిలో వారు బిల్డర్ లైసెన్సులు మంజూరు చేస్తే ఈ భవనాలకు భద్రత లేని పరిస్థితి వస్తే ఎవరు బాధ్యులన్నది అంతుబట్టకుండా ఉందని, అందుకే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. వీఎంసీ జారీ చేసిన బిల్డర్ లైసెన్సు విషయంలో నిబంధనలు పాటించకపోతే ఏం జరుగుతుందనడానికి ఈ వ్యవహారం ఓ ఉదాహరణ అని ఆర్టీఐ కార్యకర్త ఎస్‌కే ఆలీషా అభిప్రాయపడ్డారు. 'బిల్డర్ లైసెన్సు ఆధారంగా సుమారు రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు అపార్ట్‌మెంట్‌కు ప్లాన్ అప్రూవల్ వచ్చింది. దాని ఆధారంగా బ్యాంకు ఆధికారులు లోన్ మంజూరు చేశారు. అపార్ట్ మెంట్ నిర్మాణంలో ఉండగానే సేల్ డీడ్ కూడా జరిగిపోయింది. అందులోనూ బిల్డర్ భర్తనే సాక్ష్యంగా పెట్టి రిజిస్ట్రేషన్లు చేసేశారు.

 
కొనుగోలుదారులకు హౌసింగ్ లోన్లు ఇచ్చేశారు. తీరా ఇప్పుడు బిల్డర్ లైసెన్సు విషయంలోనే నిబంధనలు అనుసరించకపోవడంతో దానిని ఆధారంగా చేసుకున్న అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ తప్పిదానికి ఆస్కారం ఏర్పడింది. దీనిపై ఇప్పటికే రిజిస్ట్రేషన్ల విషయంలో డీఐజీ విచారణకు ఆదేశించారు. బ్యాంకు సిబ్బందిపైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం కదలడం లేదు.' అని ఆలీషా విమర్శించారు. ఒక్క చోట అధికారులు నిబంధనలు ఉల్లంఘించినా దాని ప్రభావం అన్ని చోట్లా అదే రీతిలో కనిపిస్తోందని ఆలీషా తెలిపారు. చాలా అపార్ట్‌మెంట్ల నిర్మాణంలలో ఇలాంటి సమస్యలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

 
మెమోకు సమాధానం పంపించాం: గుణదల రిజిస్ట్రార్
బిల్డర్ లైసెన్సుల మంజూరు విషయంలో ఏవైనా అవకతవకలు ఉంటే వాటిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారని గుణదల రిజిస్ట్రార్ కె.ప్రసాదరావు బీబీసీతో అన్నారు. 'డీఐజీ ఆదేశాలతో జిల్లా రిజిస్ట్రార్ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. రిజిస్ట్రేషన్ల విషయంలో వివరణ కోరారు. వాటికి సమాధానం పంపించాం. మా దగ్గర ఎలాంటి సమస్య లేదు. నిబంధనలను అనుసరించాం. బిల్డర్‌కు లైసెన్సు ఇచ్చిన దగ్గర ఏదైనా సమస్య ఉంటే సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ లేదా సీఆర్డీఏ వాళ్లు చూసుకుంటారు.' అని ఆయన బీబీసీతో చెప్పారు. ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న వారి సంఖ్య బాగా తగ్గిందని, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇచ్చిన వివరణతో ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారని తామంతా భావిస్తున్నట్టు ప్రసాదరావు అన్నారు. ఒకే వ్యక్తి సాక్ష్యంగా ఏడు రిజిస్ట్రేషన్లు జరగడం, సంతకాలు వేర్వేరుగా ఉన్నాయనే ప్రచారం వాస్తవం కాదని ఆయన తెలిపారు.
 
మాకు అన్ని అర్హతలు ఉన్నాయి: బిల్డర్ భర్త
విజయవాడ మున్సిపల్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు వరకూ వెళ్లిన అపార్ట్‌మెంట్ వివాదంపై బిల్డర్ పాములపాటి నాగరత్నమ్మను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆమె భర్త అనిల్ కుమార్ స్పందించారు. 'మాకు బిల్డర్ లైసెన్సు కోసం అన్ని రకాల అర్హతలున్నాయి. నిబంధనలు పాటించాం. లైసెన్సుల కోసం పెద్ద మొత్తం చెల్లించాం. కొందరు కావాలనే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మేం నిబంధనలను అనుసరించి సాగుతున్నాం.' అని ఆయన బీబీసీతో చెప్పారు. బిల్డర్ లైసెన్సు కోసం తన భార్య స్థానంలో తమ కుటుంబీకుల సర్టిఫికెట్ సమర్పించారనే ఆరోపణలు అవాస్తవమన్నారు.

 
అన్నీ పరిశీలిస్తున్నాం: కమిషనర్
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానింగ్ విభాగంపై వస్తున్న ఫిర్యాదులు తమ దృష్టిలో ఉన్నాయని కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. 'నేను కొద్దికాలం క్రితమే బాధ్యతలు తీసుకున్నా. గతంలో ఏం జరిగిందన్నది తెలుసుకోవాల్సి ఉంది. గుణదల అపార్ట్ మెంట్ విషయంపై వివరాలు తీసుకుంటున్నాం. అన్నింటినీ పరిశీలిస్తున్నాం. నగరంలో ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఉన్నాయనే ఆరోపణలపై దృష్టి పెడతాం. పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం.' అని ఆయన బీబీసీకి చెప్పారు. బిల్డర్లు, ఫ్లాట్ల కొనుగోలుదారులకు ఎలాంటి సమస్య వచ్చినా స్పందిస్తామని, నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

 
కార్పొరేషన్ అధికారులదే బాధ్యత: పౌర సంక్షేమ సంఘం
నిర్మాణాలకు అనుమతుల మంజూరుతోపాటు నిర్మాణంలో నాణ్యతకు ఢోకా లేకుండా తగిన పర్యవేక్షణ అవసరమని నగర పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి ఆర్.రమేష్ అన్నారు. రెరా చట్టం పగడ్బందీగా అమలైతే అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 'విజయవాడతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల ఇదే జరుగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రలోభాలతో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎక్కువ తప్పిదాలకు ఆస్కారం ఉంటుంది. దాని మూలంగా సామాన్యులు నష్టపోతున్నారు. సరైన అనుమతుల్లేని నిర్మాణాల విషయంలో అవగాహన లేకుండా కొనేసిన వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారుతోంది. అందుకే కార్పొరేషన్ అధికారులు బాధ్యత తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ విభాగం సరిదిద్దాలి. మాటలతో సరిపెట్టకుండా ఆచరణ అవసరం.' అని ఆయన బీబీసీతో అన్నారు. బిల్డర్ల దగ్గర పెద్ద మొత్తంలో లైసెన్సు ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం, నిబంధనల విషయంలోనూ అంతే శ్రద్ధ సారించాలని రమేష్ కోరారు.