బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 2 ఏప్రియల్ 2022 (17:04 IST)

ఇమ్రాన్ ఖాన్ చేసిన తప్పులేంటి? అందుకే ఆయనకు మిత్రులు దూరమయ్యారా?

ఇమ్రాన్ ఖాన్‌ చాలా మంచి ఆటగాడే కావచ్చు. కానీ, మంచి రాజకీయ నాయకుడిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారా? పాకిస్తాన్‌లో ఇటీవలి రాజకీయ సంక్షోభం ఆయన రాజకీయ చతురతపై సందేహాలను లేవనెత్తింది. మిత్రపక్షం ముత్తాహిదా ఖ్వామీ మూవ్‌మెంట్-పాకిస్తాన్ (ఎంక్యూఎం-పి) బుధవారం ఆయన దోస్తీ నుంచి విడిపోయింది. దీంతో ఆయన ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీ కోల్పోయింది. రాజకీయంగా ఆయన ఏకాకి అయ్యారు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే సందర్భంలో ఆయన చేసిన తప్పులే ఈ పరిస్థితి కారణమన్న మాట కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఆయనేం తప్పులు చేశారు?

 
వివాదాస్పద భాష
క్రికెట్‌లో దూకుడై బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఇమ్రాన్ ఖాన్, రాజకీయాల్లో కూడా అదే వైఖరిని కొనసాగించారు. గతంలో పాకిస్తాన్ రాజకీయాల్లో దూకుడైన భాషను ఉపయోగించడం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఆయన ప్రత్యర్ధులు ఎంతో హుందాగా వ్యవహరిస్తున్న సమయంలో, ఆయన మాత్రం తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు. నవాజ్ షరీఫ్, ఆసిఫ్ అలీ జర్దారీలను చోర్, డెకాయిట్(బందిపోటు) అని, మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్‌ను 'డీజిల్' అని పిలవడం ద్వారా రాజకీయ ప్రత్యర్ధులను దూషించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆయన ఇంతటితో ఆగిపోలేదు.

 
ఇటీవలి రాజకీయ సంక్షోభ సమయంలో ఆగ్రహంగా ఉన్న ఆయన సొంత పార్టీ సభ్యులపై విమర్శలు చేయడం ద్వారా మరిన్ని ఇబ్బందుల్లో పడ్డారు. ఇమ్రాన్ ఖాన్ పైన ఆగ్రహంతో ఉన్న కొంతమంది నాయకులు ఇటీవల పార్టీ విధానాలను, అధినేత తీరును విమర్శించారు. దీంతో మొదట ఇమ్రాన్ ఖాన్, తర్వాత ఆయన మంత్రులు పార్టీలోని అసంతృప్త నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వారు పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేయలేరని, చదువులు కూడా చెప్పించలేరని, కోట్ల రూపాయలకు మనస్సాక్షిని అమ్ముకున్నారంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు.

 
రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడైతే ఇలా చేసేవారు కాదని, కుటుంబంలో ఇలాంటి సమస్యలు వస్తాయని, సర్దుకుపోవాలంటూ ఒప్పించేవారని, కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్న అభిప్రాయం వినిపించింది. నేషనల్ అసెంబ్లీలో బలం తగ్గుతున్న సమయంలో ప్రధాని ఇలా వ్యవహరించడం పట్ల విస్మయం వ్యక్తమైంది. అసంతృప్త నేతల్లో ఆగ్రహాన్ని తగ్గించే బదులు ఆయన వారిని మరింత కోపానికి గురి చేశారు. పైగా అవిశ్వాస తీర్మానానికి వారు హాజరుకాకుండా అడ్డుకునే ఏర్పాటు చేశారు.

 
పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి ఓటింగ్‌లో పాల్గొంటే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారు శిక్షార్హులవుతారు. అయితే, విపక్షాలకు ఇమ్రాన్ పార్టీలోని అసంతృప్త నేతల బలం అవసరం లేదు. ఎంక్యూఎం-పీ ప్రతిపక్షాలతో చేతులు కలపడంతో నంబర్ గేమ్ మారిపోయింది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ నాయకులపై మాత్రమే కాకుండా అత్యాచారాలకు గురైన మహిళలపై కూడా నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలు చేశారు. ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడు అని, తటస్థంగా ఉండేవారిని జంతువులని విమర్శించారు. అనంతరం దీనిపై వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

 
ఆగ్రహించిన మిత్రులు
ప్రభుత్వం సాధారణ మెజారిటీ సాధించాలంటే మిత్రపక్షాల సహకారం అవసరం. కానీ, మిత్రపక్షాలు కూడా ఆయనపై ఆగ్రహంతో ఉన్నాయి. ఇమ్రాన్ పార్టీతో చేతులు కలిపిన మూడు రాజకీయపార్టీలు గ్రాండ్ అలయన్స్‌గా ఏర్పడ్డాయి. కానీ, ఈ మూడున్నరేళ్లలో తమ డిమాండ్లపై ఆయన దృష్టి సారించలేకపోయారని ఆ పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. పంజాబ్‌లో ఇమ్రాన్ ఖాన్ నియిమించిన ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్‌ను మిత్రపక్షాలు ఏవీ ఇష్టపడలేదు. రాజకీయ నిర్ణయాలను పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సి ఉండగా, ఆయన అన్ని విషయాల్లో నైతిక ప్రాతిపదికన రాజకీయాలు నడపాలని ప్రయత్నించారు.

 
పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే కదా నైతికంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నైతికతను కాపాడే ప్రయత్నంలో ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో ఓడిపోయారన్న మాట పాకిస్తాన్ రాజకీయాల్లో వినిపిస్తోంది. అయితే, ఆయన లక్ష్యమైన నయా పాకిస్తాన్ నినాదం ఈ ఇన్నింగ్స్‌లో సాధ్యం కాకపోవచ్చు. కానీ, తదుపరి ఇన్నింగ్స్ లోనైనా సాధ్యమవుతుందని చాలా మంది పాకిస్తానీలు నమ్ముతారు. తీరా ప్రమాదం ముంచుకొచ్చిన దశలో కళ్లు తెరిచిన ఆయన పంజాబ్ ముఖ్యమంత్రితో పాటు మిత్రపక్షాలకు మరిన్ని మంత్రిత్వ శాఖలను పంచడం ప్రారంభించారు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది.

 
విదేశాంగ విధాన బలహీనతలు
విదేశాంగ విధానంతో పాటు దేశీయ రాజకీయాల్లోనూ కొత్త పోకడలను ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఇమ్రాన్ ఖాన్ యుక్రెయిన్-రష్యా యుద్ధంలో ఎవరికీ సహాయం చేయకుండా శాంతియుతంగా ఉండాలనే విధానాన్ని తీసుకొచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధం నుండి, పాకిస్తాన్ ప్రతి యుద్ధంలో పశ్చిమ దేశాలకు మద్దతు ఇస్తోంది. అఫ్గానిస్తాన్‌లో, పాకిస్తాన్ నాలుగు దశాబ్దాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉంది. జనరల్ పర్వేజ్ ముషారఫ్ వంటి శక్తివంతమైన సైనిక నియంతలు కూడా అమెరికాకు సహాయం చేయడానికి అంగీకరించారు. అఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత, అమెరికా నుంచి కూడా సహకారం ఆగిపోయింది. అయితే, ఇందులో పాకిస్తాన్ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వ అధికారుల నుండి వచ్చిన ప్రకటనలు మనోవేదనను తగ్గించడానికి బదులు పెంచాయి.

 
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఇస్లామిక్ దేశాలను ఏకం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. మొదట టర్కీ, మలేషియాలతో కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ, అది సౌదీ అరేబియా అసంతృప్తితో ఆగిపోయింది. వరుసగా రెండు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) సమావేశాలను అఫ్గానిస్తాన్‌లో నిర్వహించారు. ఇదివరకు ఈ సమావేశాలను పాకిస్తాన్‌లో కూడా నిర్వహించారు. లాహోర్‌లో ఓఐసీ సమావేశం నిర్వహించినప్పుడు అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను తొలగించేందుకు విదేశీ కుట్ర జరిగినట్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ అలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ఒక దేశం నుంచి పాకిస్తాన్‌లో విపక్షాలకు లేఖ అందినట్లు ఆయన చెబుతున్నారు.

 
ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనపై పశ్చిమ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ విషయంపై పాకిస్తాన్‌లో రాయబారులు సంయుక్తంగా ఒక లేఖ కూడా రాశారు. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించాలని వారు డిమాండ్ చేశారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన రోజు తొలి రోజు ఇమ్రాన్ ఖాన్.. రష్యాలో ఉన్నారు. మరోవైపు చైనా సాయంతో చేపడుతున్న సీపెక్ ప్రాజెక్టు విషయంలోనూ చైనా సంతోషంగా లేదు. చైనా అధికారుల్లో ఇమ్రాన్ ఖాన్ కంటే షాబాజ్ షరీఫ్‌కే మంచి పేరుంది.

 
పాకిస్తాన్ సైన్యంతో విభేదాలు
చివరి వరకు పాకిస్తానీ సైన్యంతో తమకు ఎలాంటి విభేదాలు లేవని పీటీఐ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇదివరకటి ముస్లిం లీగ్ (నవాజ్) ప్రభుత్వంతో పోలిస్తే, సైన్యం చర్యలకు బహిరంగంగానే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మద్దతు పలుకుతూ వచ్చింది. అయితే గత ఏడాది ఐఎస్ఐ అధిపతి నియామకం విషయంలో సైన్యానికి, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ప్రస్తుత సంక్షోభం విషయంలో తాము తటస్థంగానే ఉంటున్నట్లు సైన్యం తెలిపింది. అయితే, సైన్యం తలుచుకుంటే, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఈ గండం నుంచి గట్టెక్కించగలదనే వాదన కూడా ఉంది. అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నప్పటికీ, సైన్యంతో తాను పరిష్కరించలేని కొన్ని విభేదాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఉన్నాయి. దేశంలో శక్తిమంతమైన సైన్యాన్ని అన్నివేళల్లోనూ సంతృప్తి పరిచేలా చేయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు

 
జట్టు ఎంపికలో తప్పులు
2018లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. 22 ఏళ్ల నుంచి రాజకీయాల్లో అష్టకష్టాలు పడుతున్న ఇమ్రాన్ ఖాన్.. ప్రభుత్వాన్ని నడిపేందుకు కావాల్సిన నైపుణ్యాలను అందిపుచ్చుకోలేదనే చెప్పాలి. ఆర్థిక మంత్రిగా మొదట అసద్ ఉమర్‌ను ఎంచుకున్నారు. అయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) బెయిల్ అవుట్ ప్యాకేజీకి అంగీకారం కుదర్చడంలో విఫలం కావడంతో ఆయన్ను ఏప్రిల్ 2017లో మార్చేశారు. ఉమర్ స్థానంలోకి కొత్తగా వచ్చిన అబ్దుల్ హఫీజ్ షేక్‌ను కూడా కొంత కాలానికి పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆర్థిక శాఖను పరిశ్రమల శాఖ మంత్రి హమ్మద్ అజార్‌కు అప్పగించారు. పీటీఐ ప్రభుత్వంలో అజార్ మూడో ఆర్థిక మంత్రి. ఆ తర్వాత నవాజ్ షరీఫ్, ముషారఫ్ ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన షౌకత్ తరీన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఎప్పటికప్పుడే ఇలా మంత్రులను మార్చడంతో ప్రభుత్వం మెరుగ్గా పనిచేయడంలో అవరోధాలు ఎదురయ్యాయి. అయితే, గత కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ విషయంలోనూ భిన్నమైన వాదనలున్నాయి.

 
ప్రస్తుతం ప్రపంచ ధరల సంక్షోభం నడుమ మరోసారి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. దీంతో విపక్షాలకు మరో అస్త్రం దొరికినట్లు అయింది. మూడేళ్లలో సాధించిన విజయాలను కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానిది. దేశంలో దాదాపు విపక్ష నాయకులందరినీ అరెస్టు చేశారు. నెలలపాటు వీరు జైళ్లలో గడిపారు. కానీ ఆధారాలు లేకపోవడంతో వీరు మళ్లీ బయటకు వచ్చారు. అవినీతి కూకటి వేళ్లతో పెకలిస్తామనే ఇమ్రాన్ ఖాన్ నినాదం.. నినాదంగానే మిగిలిపోయింది. మూడున్నరేళ్ల పదవీ కాలంలో ఆయన కోట్ల రూపాయల కుంభకోణాల గురించి మాట్లాడారు. కానీ ఈ విషయంలో పెద్దగా చేసింది కూడా కనిపించలేదు. ఇమ్రాన్ ఖాన్ కృషి, ఉద్దేశాల గురించి ఎవరూ సందేహాలు వ్యక్తం చేయడంలేదు. అయితే, ఆయన తొలి ఇన్నింగ్స్ ఓటమికి మాత్రం ఆయన పక్కన ఉన్నవారే కారణమని చెప్పుకోవాలి. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే ఇప్పుడు ఆయన ఎలా సిద్ధం అవుతారో చూడాలి.