శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 18 జనవరి 2021 (18:35 IST)

బాల్య వివాహాలు నేరం అయినప్పుడు, బాల్యంలో జరిగిన పెళ్లిళ్లు అక్రమం ఎందుకు కాదు

భారత బాల్య వివాహ చట్టం ప్రకారం దేశంలో బాల్య వివాహాలకు చట్టపరమైన గుర్తింపు లేదనే విషయం దేశంలో చాలామందికి తెలుసు. మీకు బాల్య వివాహం ప్రక్రియలో ప్రమేయం ఉంటే, శిక్ష మీకు కూడా పడవచ్చు. చిన్నతనంలో వివాహ బంధంలో చిక్కుకునేవారు, ఒక వయసు వచ్చాక తమ పెళ్లిని రద్దు చేసుకోవచ్చు. అలా చేయాలంటే, వారు తమ జిల్లా కోర్టులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాలను అడ్డుకోడానికి చట్టంలో సవరణలు చేశాయి. చిన్నతనంలో పెళ్లిళ్లు జరగకుండా అడ్డుకోడానికి, వాటి నుంచి విముక్తి అందించడానికి చాలా స్థాయిల్లో అధికారులను కూడా నియమించాయి. అప్పటికీ, ఒక 26 ఏళ్ల మహిళ చిన్నతనంలో జరిగిన తన పెళ్లిని రద్దు చేయాలంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దిల్లీలో బాల్య వివాహాలను చట్టవిరుద్ధంగా చెప్పాలని ఆ మహిళ న్యాయస్థానాన్ని కోరింది. దిల్లీ హైకోర్ట్ ఈ కేసులో దిల్లీ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.

 
వింత పరిస్థితి
కానీ, భారత్‌లో చట్టపరంగా బాల్య వివాహాలకు అసలు గుర్తింపే లేనపుడు, ఈ మహిళ పిటిషన్ మీద దిల్లీ హైకోర్టు విచారణ ఎందుకు జరుపుతోంది. ఐక్యరాజ్యసమితిలోని యునిసెఫ్ ప్రకారం 18 ఏళ్లకు ముందు మైనర్లకు పెళ్లి చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయినా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అవి జరుగుతూనే ఉన్నాయి.

 
యునిసెఫ్ వివరాల ప్రకారం భారత్‌లో ప్రతి ఏటా దాదాపు 15 లక్షల మంది బాలికలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేస్తున్నారు. అలాంటి ఎంతోమంది బాలికల్లో దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన మహిళ కూడా ఒకరు. ఆమెకు 2010లో మైనర్‌గా ఉన్నప్పుడు పెళ్లి చేశారు. "ఈమెకు 16 ఏళ్ల వయసులో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ సమయంలో ఆమె వైవాహిక జీవితం ప్రారంభించలేదు. కానీ, ఇప్పుడు దానిని ప్రారంభించాలని ఆమెను బలవంతం చేస్తున్నారు" అని మహిళ తరఫున కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ తన్వీర్ అహ్మద్.

 
తన వివాహాన్ని రద్దు చేయాలని ఈ 26 ఏళ్ల మహిళ కోర్టును అభ్యర్థించారు. కానీ బాల్య వివాహ చట్టం ప్రకారం ఇప్పుడు ఈ వివాహం రద్దు చేయడం కుదరదు. లాయర్ తన్వీర్ అహ్మద్ దానికి కారణం చెప్పారు. "బాల్య వివాహ చట్టం ఒక కేంద్ర చట్టం. కానీ, దాన్ని షెడ్యూల్ 'సి'లో కూడా చేర్చవచ్చు. అలా చేయడం వల్ల రాష్ట్రాలు ఈ చట్టంలో సవరణలు చేయవచ్చు" అన్నారు. కానీ, ఈ చట్టంలో ఉన్న చిక్కేంటంటే ఇది ఒక విధంగా తటస్థ చట్టం. సమాజంలో ప్రతి వర్గం, మతానికి ఇది వర్తిస్తుంది. ఈ చట్టం బాల్య వివాహాలను ఒక నేరపూరిత కార్యం కిందికి తీసుకువస్తుంది. కానీ, ఇదే చట్టంలోని ఒక విషయం దీనిని హాస్యాస్పదంగా మార్చేస్తోంది" అంటారు తన్వీర్.

 
"ఎందుకంటే, బాల్య వివాహాల నుంచి కాపాడవచ్చని చెప్పే, ఇదే చట్టం ఒక విధంగా బాల్య వివాహాలను అనుమతిస్తోంది. అంటే, ఈ చట్టం ప్రకారం బాల్య వివాహం చేసుకునే మహిళ-పురుషుల్లో ఎవరైనా తమ పెళ్లి రద్దు చేసుకోడానికి 18 ఏళ్లు దాటిన తేదీ నుంచి రెండేళ్ల లోపు జిల్లా కోర్టులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది". బాల్య వివాహాలు అనైతికం, నేరపూరిత కార్యం అని ప్రభుత్వం భావించినప్పుడు, అలాంటి వివాహాలు రద్దు చేసుకునే బాధ్యతను 18 ఏళ్ల మైనర్లపై ఎందుకు వేస్తోంది అంటారు తన్వీర్ అహ్మద్

 
"మీరు ఒక చట్టం ప్రకారం బాల్య వివాహాలను ఒక నేరపూరిత కార్యంగా చెప్పా రు. అవి అనైతికం, చట్టవిరుద్ధం, పిల్లల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అంటూ అలా చేశారు. కానీ అదే చట్టంలో మీరు బాల్య వివాహాల చట్టబద్ధతను అనుమతిస్తున్నారు. బాల్య వివాహాలు చేసుకున్న మైనర్లను 18 ఏళ్లు దాటాక కోర్టుకు వెళ్లండి, నా పెళ్లి చట్టవిరుద్ధం అని మీ వాదన వినిపించండి అంటున్నారు. వారు తమ కెరియర్‌పై దృష్టి పెట్టాల్సిన వయసులో సుదీర్ఘ న్యాయపోరాటం చేయండి అంటున్నారు" అని చెప్పారు. రాష్ట్ర చట్టాల్లో సవరణలు చేయాలని లాయర్ తన్వీర్ అహ్మద్, ఆయన క్లైంట్ దిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఈ డిమాండ్ వెనకున్న కారణం ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది.

 
చట్టంలో బలహీనతలు ఏంటి
సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే అమ్మాయి-అబ్బాయికి చిన్న వయసులో పెళ్లి జరిగినపుడు, ఆ పెళ్లిని అంగీకరించని వ్యక్తి తనకు 20 ఏళ్లు రావడానికి ముందే కోర్టుకు వెళ్లాలి. తన పెళ్లిని రద్దు చేయాలని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి షరతులు బాల్య వివాహాలను చట్టవిరుద్ధంగా చెప్పే ప్రక్రియను చాలా జటిలంగా మార్చేస్తోంది. ఎందుకంటే, భారత్‌లో ఏయే ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయో, అక్కడ 18 ఏళ్లు దాటిన తర్వాత యువతీ యువకులు తమ కుటుంబాలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి, వివాహం రద్దు చేసుకోవడం చాలా కష్టం.

 
అంతే కాదు, ఇలాంటి కేసుల్లో అవతలి పక్షం నుంచి, ఆ పెళ్లి కొనసాగాలని వాదించవచ్చు. అలా ఈ ప్రక్రియ మరింత జటిలం అయిపోతుంది. ఈ షరతును బాల్య వివాహ చట్టంలో ఉన్న చాలా పెద్ద లోపం అని బాల్య వివాహాలను అడ్డుకోడానికి ఎన్నో ఏళ్ల నుంచీ ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త కృతి భారతి చెబుతున్నారు. "బాల్య వివాహాలు చట్టప్రకారం అక్రమం అని చెప్పాలనే డిమాండ్ రావడం న్యాయమే. ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే ఈపెళ్లి రద్దు చేసుకోవాలనుకునేవారు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు. హాయిగా ఇంట్లో ఉండగానే, వారి పెళ్లి చట్టవిరుద్ధం అవుతుంది" అంటారు భారతి.

 
కానీ, దీనిలోని సామాజిక కోణం విషయానికి వస్తే, మీ పెళ్లి చట్టపరంగా అక్రమమే అయినప్పటికీ సమాజంలో అది నిరూపించడానికి మీ దగ్గర ఒక చట్టబద్ధమైన పత్రాలు ఉండాలి. ఎందుకంటే చట్టం ప్రకారం మీ పెళ్లి అక్రమమే కావచ్చు. మీ పెళ్లిని మీరు చట్టవిరుద్ధం అనుకోవచ్చు. కానీ, మీ ఇంట్లో వాళ్లు, మీ బంధువులు అది ఒప్పుకోరు. మీ సమాజం దానిని అంగీకరించదు. మీకు పోలీసుల నుంచి భద్రత కూడా లభించదు" అంటారు భారతి.

 
అలాంటప్పుడు బాల్య వివాహం రద్దు చేసే ప్రక్రియ చాలా సహజంగా, సరళంగా ఉండాలని నాకు అనిపిస్తోంది. అది ఎలా ఉండాలంటే, ఆధార్ కార్డ్ కోసం నమోదు చేసుకోవడంలా ఉండాలి. అక్కడ మీరు మీ సమాచారం ఇవ్వగానే, ఆధార్ కార్డు నేరుగా మీ ఇంటికే వచ్చేస్తుంది. ఇది అలా ఉండాలి" అని ఆమె చెప్పారు. అది నిజమేనని, కోర్టుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుందని, కోర్టుకెక్కిన తర్వాత కుటుంబంలో ఒత్తిడి చాలా పెరుగుతుందని దిల్లీ హైకోర్టు వెళ్లిన యువతి తనకు చెప్పిందని కృతి భారతి తెలిపారు. ఆమెపై బంధువుల ఒత్తిడి కూడా ఉందన్నారు.

 
"తమ పెళ్లిని చట్టవిరుద్ధంగా చేయాలని మా దగ్గరకు వచ్చే అమ్మాయిలు చాలా చిన్న వయసులో ఉంటారు. ఇవన్నీ భరించడం, అందరినీ వ్యతిరేకించడం వారికి చాలా కష్టం. ఎందుకంటే మనం అయిన వాళ్లందరికీ వ్యతిరేకంగా అలాంటి అడుగు వేయాల్సి ఉంటుంది" అని కృతి భారతి చెప్పారు. అలాంటప్పుడు అది సమస్యే, కానీ పరిష్కారం గురించి చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, చట్టపరమైన ఆధారంగా చూపించడానికి మీకు ఒక డాక్యుమెంట్ అవసరం అవుతుంది. కానీ, బాల్య వివాహాలను చట్టవిరుద్ధంగా చెప్పాలనే డిమాండ్లు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి కేసుల్లో కర్ణాటక మోడల్ అనుసరించాలని సుప్రీంకోర్టు భారత్‌లోని అన్ని రాష్ట్రాలకూ అపీల్ చేసింది.

 
కర్ణాటక మోడల్ ఎందుకు అమలు కాదు
కర్ణాటక ప్రభుత్వం 2017లో ఒక చట్టం పాస్ చేసింది. దాని ప్రకారం కర్ణాటకలో జరిగే బాల్య వివాహాలను మొదటి నుంచీ చట్టవిరుద్ధంగా భావిస్తారు. ఇది ఒక చట్టపరమైన సమస్యతోపాటూ సామాజిక సమస్య కూడా అని సుప్రీంకోర్ట్ లాయర్ విరాగ్ గుప్తా చెప్పారు. "బాల్య వివాహాల కేసుల్లో కర్ణాటక మోడల్ అనుసరించాలని 2017లో సుప్రీంకోర్టు జస్టిస్ మదన్ లోకుర్ అన్ని రాష్ట్రాలకు అపీల్ చేశారు. కర్ణాటక మోడల్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు తమ చట్టాల్లో మార్పులు చేసి బాల్య వివాహాలను చట్టవిరుద్ధంగా చెప్పే వ్యవస్థకు ముగింపు పలికి, వాటిని మొదటి నుంచే అక్రమంగా చెప్పవచ్చు" అన్నారు

 
ఇది పెద్ద సమస్యలో ఒక భాగం అని విరాగ్ గుప్తా భావిస్తున్నారు. దానిని పరిష్కరించేందుకు సమాజం నుంచి చట్టం స్థాయిలో ఎన్నో మార్పులు అవసరం అంటున్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన 2030 నాటికి బాల్య వివాహాలు లేకుండా చేయాలనే సవాలును భారత ప్రభుత్వం స్వీకరించింది. కానీ, ఆ లక్ష్యాన్ని అందుకోవడంలో భారత్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.