మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 27 డిశెంబరు 2019 (19:20 IST)

ఏపీకి రాజధాని విశాఖపట్నమా, అమరావతా.. ఒకటికి మించి రాజధానులున్న రాష్ట్రాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదని ఇటీవల శాసన సభలో ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్. అది జరిగిన కొన్ని రోజుల్లోనే, సరిగ్గా రాష్ట్రానికి మూడు రాజధానులు, నాలుగు జోన్లు ఉండాలని నివేదిక ఇచ్చింది రాజధానిపై జీఎన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ. దీనిపై ఎంతో చర్చ జరుగుతోంది.

 
అసలు హైకోర్టు, సచివాలయం, శాసన సభ - ఈ మూడూ ఒకే నగరంలో ఉండాలా? ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? రాష్ట్రాన్ని జోన్లుగా విభజిస్తే జరిగేదేంటి? అసలు ఇది సాధ్యమేనా?

 
సచివాలయం - శాసన సభ
ఇప్పటి వరకూ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ సచివాలయం ఒక చోట, శాసన సభ మరోచోటా లేవు. రెండూ ఒకే నగరంలో, రాజధాని నగరంలో మాత్రమే ఉంటూ వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం, శాసన సభ సమావేశాలు, రాజధానితో పాటూ మరో నగరంలో కూడా జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో ఈ పద్ధతి ఉంది. మహారాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాలు, ఏడాదికి ఒక్కసారి నాగపూర్‌లో నిర్వహిస్తుంటారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేక భవనం ఉంది.

 
ఒకప్పుడు నాగపూర్ మధ్యప్రదేశ్ రాజధానిగా ఉండేది. బ్రిటిష్ కాలం నుంచీ రాజధాని నగరం అది. రాష్ట్రాల పునర్విభజన సమయంలో, నాగపూర్ రాజధానిగా విదర్భ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఉండేది. మొదటి ఎస్సార్సీలో విదర్భను ప్రతిపాదించినా అమలు కాలేదు. తరువాత మధ్యప్రదేశ్, హైదరాబాద్, బాంబే రాష్ట్రాల్లోని మరాఠీ మాట్లాడే ప్రజలందర్నీ కలిపి మహారాష్ట్ర ఏర్పాటు చేశారు. దీంతో నాగపూర్‌కి రాజధాని హోదా పోయింది. స్థానికంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో 1953లో నాయకుల మధ్య నాగపూర్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం నాగపూర్‌ని మహారాష్ట్రకు రెండో రాజధానిగా వ్యవహరిస్తారు.

 
ఆ ఒప్పందం ప్రకారం, ఏడాదికి ఆరు వారాలు తగ్గకుండా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాగపూర్లో జరపాలి. అందులో విదర్భ సంబంధిత అంశాలు చర్చించాలి. అంతేకాదు, నాగపూర్‌లో ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి.

 
ఇక ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌ని ప్రస్తుతం మధ్యంతర రాజధానిగా వ్యవహరిస్తున్నారు. గైరిసన్ నగరాన్ని రాజధానిగా చేయాలని అక్కడ డిమాండ్లు ఉన్నాయి. 2014లో ఒకసారి అక్కడ మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిపారు. రాజధానిగా ఉన్న డెహ్రాడూన్‌కి అదనంగా గైరిసన్‌లో కూడా సమావేశాలు జరుపుతామని బీజేపీ చెబుతోంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఉన్న నైనిటాల్‌ని న్యాయ రాజధానిగా వ్యవహరిస్తున్నారు.

 
హిమాచల్ ప్రదేశ్‌కి సిమ్లాతోపాటు ధర్మశాల రాజధానిగా ఉంది. ధర్మశాలను హిమాచల్ శీతాకాల రాజధానిగా వ్యవహరిస్తారు. ఇక్కడ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ఇక ఎక్కువ మందికి తెలిసిన రెండు రాజధానులు కశ్మీర్‌వే. శ్రీనగర్ మే నుంచి అక్టోబర్ వరకూ, జమ్ము నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ రాజధానిగా ఉండేవి.

 
ఇక పక్కనే ఉన్న కర్నాటకకు రెండు అసెంబ్లీలు ఉన్నాయి. ఒకటి బెంగళూరులో, మరొకటి బెలగావిలో. దేశంలోనే అత్యంత అందమైన శాసన సభ భవనంగా పేరున్న బెంగళూరు విధానసౌధ తరహాలోనే బెలగావిలో కూడా శాసన సభ భవనం నిర్మించారు. ఇక్కడ కూడా ఏడాదికి ఒకసారి చొప్పున శీతాకాల సమావేశాలు జరుగుతాయి.

 
అయితే బెలగావిలో శాసన సభ నిర్మించడానికి మహారాష్ట్రతో ఉన్న సరిహద్దు వివాదమే కారణంగా చెబుతారు. చాలా కాలంగా మహారాష్ట్ర, కర్నాటకల మధ్య బెలగావి జిల్లా విషయంలో వివాదం ఉంది. ఆ జిల్లా తమదంటే తమదని రెండు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. దీంతో ఆ జిల్లాపై తమ పట్టు నిలుపుకునేందుకు కర్నాటక అక్కడ అసెంబ్లీ కట్టి, ఏడాదికి ఒకసారి సమావేశాలు నిర్వహిస్తోంది.

 
మహారాష్ట్ర, కర్నాటకల్లో శాసన సభ సమావేశాలు వేరే చోట్ల కూడా జరుగుతున్నాయి. తమ సమస్యలు కూడా సభలో చర్చకు వస్తాయని ఆయా ప్రాంతాలవారికి భరోసా కల్పించడమే దీని వెనుకున్న కారణమని రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు బి.కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ''సభ జరిగినప్పుడు అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు అక్కడే ఉంటారు కాబట్టి స్థానికంగా అభివృద్ధి జరుగుతుంది, అక్కడ పనులు చురుగ్గా సాగుతాయని అభిప్రాయం'' అని ఆయన అన్నారు.

 
''హైదరాబాద్ లాంటి నగరం నిజాం కాలం నాటికే రాజధానిగా ఉండి, అన్ని సౌకర్యాలూ ఉన్న నగరం. ఇక్కడెలా ఉంటుందంటే, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పాలన ఎక్కడ కేంద్రీకృతం అయితే అభివృద్ధి అక్కడే జరుగుతుంది. అభివృద్ధి ఎక్కడ ఎక్కువగా ఉంటే పాలనా కేంద్రం అక్కడికే తరలి వెళుతుంది. ఈ రెండూ పరస్పరం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రలో ప్రశ్న కూడా దీనిచుట్టే'' అని కృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు.

 
అయితే, ఎక్కడా శాసన సభ - సచివాలయం మాత్రం వేర్వేరు నగరాల్లో లేవు. నిజానికి ఎక్కువ మంది రాజనీతి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఎక్కడ సచివాలయం ఉంటుందో అదే సాంకేతికంగా రాజధాని అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పాలన సచివాలయం కేంద్రంగానే సాగుతుంది. ఆ పాలన గురించి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రజలు ఎన్నుకున్న సభ్యులకు సమాధానం చెప్పే వేదిక శాసన సభ. కాబట్టి, సచివాలయం ఉన్న చోటే రాజధాని. మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు సచివాలయంలోనే ఉంటారు కాబట్టి పరిపాలనకు సచివాలయం గుండె లాంటిదని కృష్ణా రెడ్డి అన్నారు.

 
జోనల్ వ్యవస్థ
జోనల్ వ్యవస్థలో పలు రకాలున్నాయి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాష్ట్రాన్ని జోన్లుగా విభజించడం. రెండు, ప్రాంతాలను జోన్లుగా ప్రకటించి అభివృద్ధి కోసం రాజకీయ కమిటీలు వేయడం. మూడు, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలను జోన్లుగా, జోన్లను జిల్లాలుగా విభజించడం. ఇప్పుడు జీఎన్ రావు కమిటీ ఈ మూడో తరహా జోనల్ వ్యవస్థను ప్రతిపాదించింది.

 
దీని ప్రకారం జిల్లాకు, రాష్ట్రానికి మధ్య స్థాయిలో జోన్ (కొన్ని రాష్ట్రాల్లో డివిజన్ అంటారు) ఉంటుంది. అక్కడొక కార్యాలయం ఉంటుంది. జిల్లా కలెక్టర్లకూ, రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీకి మధ్యలో జోనల్ కమిషనర్ ఉంటారు. దీనివల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిష్కారం కాని ప్రతి సమస్యా రాష్ట్ర స్థాయి వరకూ వెళ్లకుండా జోనల్ స్థాయిలో పరిష్కరించుకోవచ్చు. మిగిలిన పరిపాలన కూడా వికేంద్రీకరణ అవుతుంది.

 
ప్రస్తుతం కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ జోనల్ కమిషనర్ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది. ఇప్పటికీ పోలీస్ వ్యవస్థలో కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ పైన నేరుగా డీజీపీ కాకుండా, ఐజీ, డీఐజీలు ఉంటారు. వారు రెండు నుంచి ఐదు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తారు. వాటినే రేంజ్ అని పిలుస్తారు. జోనల్ వ్యవస్థ వస్తే సాధారణ పరిపాలన కూడా ఇలానే రెండు నుంచి నాలుగు జిల్లాలు ఒక్కో జోనల్ కమిషనర్ చేతుల్లోకి వెళ్తాయి.

 
ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రాన్ని మొత్తం నాలుగు డివిజన్లుగా విభజించారు. వాటి కింద 27 జిల్లాలు ఉంటాయి. బెంగళూరు, బెలగావి (బెల్గాం), కాలబురిగి (గుల్బర్గా), మైసూరు - ఇవే ఆ జోన్లు. వాటికి రెవెన్యూ కమిషనర్లు ఉంటారు.

 
ఇప్పుడు జీఎన్ రావు కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అవి..

 
ఉత్తర జోన్ : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
మధ్య కోస్తా జోన్ : తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
దక్షిణ కోస్తా జోన్ : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
రాయలసీమ జోన్ : కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు

 
హైకోర్టు
నిజానికి రాజధానిలో హైకోర్టు లేకపోవడం భారత్‌లో చాలా సాధారణ విషయం. చాలా రాష్ట్రాల్లో హైకోర్టులు ఆయా రాజధానుల్లో కాకుండా వేరే నగరాల్లో ఉన్నాయి. ఎంతలా అంటే, రాజధానిలో కాకుండా వేరే చోట్ల హైకోర్టులు ఉంటే, ఆయా రాజధానుల్లో తక్షణం ఒక బెంచ్ ఏర్పాటు చేయాలంటూ 2014లో కేంద్రం ఒక బిల్లు కూడా పెట్టింది.

 
రాజధానుల్లో హైకోర్టు ఉన్న రాష్ట్రాల్లో కూడా, ఆయా రాష్ట్రాల్లోని మిగిలిన నగరాల్లో హైకోర్టు బెంచ్‌లు పెట్టారు. అసలు వేరే నగరంలో హైకోర్టు లేదా బెంచ్ లేని ఏకైక పెద్ద రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే. హైకోర్టు బెంచీలు ఎన్నైనా, ఎక్కడైనా పెట్టుకోవచ్చని కృష్ణారెడ్డి అన్నారు.

 
''ఉదాహరణకు కర్నూలులో ఒక బెంచ్ ఉందనుకుందాం. అక్కడ జిల్లా కోర్టుల నుంచి హైకోర్టుకు రావల్సిన కేసులు స్థానిక బెంచ్‌కి వెళ్తాయి. ఆ తర్వాత నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్తాయి. హైకోర్టు ఛీఫ్ జస్టిస్ మాత్రం హైకోర్టు ప్రధాన కేంద్రంలోనే ఉంటారు'' అని ఆయన వివరించారు. న్యాయ వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలనో, రాజధాని కంటే మరో పెద్ద నగరం ఉండటం వల్లనో, రాజకీయ ఆందోళనల కారణంగానో మొత్తానికి ఇలాంటి ఏర్పాట్లు జరిగాయి.
 
రాజధానిలో హైకోర్టు లేని, లేదా రాజధాని బయట హైకోర్టు బెంచీలు ఉన్న జాబితా ఇది..