1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (12:52 IST)

రాజధాని మధ్యలోనే ఉండాలన్న నిబంధన లేదు.. ఢిల్లీ కూడా ఓ పక్కన ఉంది : టి.సుబ్బరామిరెడ్డి

వైజాగ్‌ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. అదేసమయంలో విశాఖపట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. 
 
రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, జీఎన్‌ రావు కమిటీ  ప్రభుత్వానికి నివేదిక అందించిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. 
 
ఏపీకి విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. రాష్ట్రం మధ్యలోనే రాజధాని ఉండాలనే నిబంధన లేదని సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ కూడా ఓ పక్కకు ఉన్నాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌కు కావాల్సిన అన్ని వసతులు విశాఖకు ఉన్నాయని, విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
 
తెలుగు ప్రజలకు హైదరాబాద్ తర్వాత విశాఖే పెద్ద నగరమని తెలిపారు. అయితే, అమరావతిలో రాజధాని కోసం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని సుబ్బరామిరెడ్డి కోరారు. తాను తన వ్యక్తిగత అభిప్రాయాలను చెబుతున్నాని స్పష్టం చేశారు.
 
అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఉండాలని, బెంచ్ ను విశాఖలో ఏర్పాటు చేయాలని కమిటీ నివేదిక సమర్పించినట్లు మీడియాలో చూసి తెలుసుకున్నానని సుబ్చరామిరెడ్డి చెప్పారు. విశాఖ పారిశ్రామికవేత్తలకు పరిచయమైన ప్రాంతం కావడంతో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయితే మరింత మంది పారిశ్రామిక వేత్తలు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.