శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (11:47 IST)

ఢిల్లీలో ఎముకలు కొరికేస్తున్న చలి : 118 యేళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. గత 118 యేళ్ల తర్వాత రాజధానిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి. దీంతో ఢిల్లీ వాసులు ఎముకలు కొరికే చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా, గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఫలితంగా118 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
1901లో తొలిసారిగా డిసెంబర్‌లో నెలలో ఉష్ణోగ్రతలు పడిపోగా.. మళ్లీ ఇప్పుడు నాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ యేడాది డిసెంబర్‌ అతి శీతల రెండో డిసెంబర్‌ నెలగా నిలిచిపోనుంది. భారత వాతావరణ శాఖ గణాంకాల మేరకు.. 1919, 1929, 1961, 1997 సంవత్సరాల్లో మాత్రమే డిసెంబర్‌ నెలలో ఢిల్లీలో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైంది. 
 
ఈ యేడాది డిసెంబర్‌ నెలలో 26వ తేదీ నాటికి సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు.. 19.85 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. డిసెంబర్‌ 31వ తేదీ నాటికి 19.15 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఒక వేళ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతే.. ఢిల్లీ చరిత్రలో 1901 తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన రెండో డిసెంబర్‌ నెలగా 2019, డిసెంబర్‌ నెల నిలిచిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్‌ 14వ తేదీ నుంచి వరుసగా 13 రోజులు ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అయ్యాయి. 1997, డిసెంబర్‌ నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 17.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.