శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2024 (15:41 IST)

అమెరికా నుంచి భారతీయులను ప్రత్యేక విమానాలలో ఎందుకు తిప్పి పంపుతున్నారు, ట్రంప్ వచ్చాక ఏం జరగనుంది?

donald trump
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) 2024 అక్టోబర్‌లో కొంతమంది భారతీయులను ఒక చార్టర్ విమానంలో అమెరికా నుంచి వెనక్కి పంపించింది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపే ధోరణి ఇటీవల బాగా పెరిగింది. ఈ విమానం సాధారణమైనది కాదు. అమెరికాలో ఉండటానికి తగిన చట్టబద్ధమైన పత్రాలను చూపడంలో విఫలమైన భారత వలసదారులను తిప్పిపంపడంలో, కనీసం వందమందికి తగ్గకుండా తీసుకువెళ్లడానికి ఉపయోగించిన అతిపెద్ద విమానాలలో ఇది కూడా ఒకటి. అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన అక్రమ వలసదారుల విమానంలోని మహిళలు, పురుషుల్లో ఎక్కువ మంది పంజాబ్ వారే కావడంతో, దాన్ని పంజాబ్‌కు మళ్లించారని అమెరికన్ అధికారులు తెలిపారు. వారు కచ్చితంగా ఎవరు ఏ ఊరికి చెందినవారనే విషయాన్ని వెల్లడించలేదు.
 
అమెరికాలో సెప్టెంబర్‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో వెయ్యిమందికి పైగా భారతీయులను చార్టర్, కమర్షియల్ విమానాల ద్వారా వెనక్కి పంపినట్లు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ రాయిస్ బెర్నెస్టెయిన్ ముర్రే చెప్పారు. “కొన్నేళ్లుగా అమెరికా నుంచి తిప్పి పంపిస్తున్న భారతీయుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అలాగే సరిహద్దుల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో(కెనడా, మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు) ఎక్కువ మంది భారతీయులు ఉంటున్నారు” అని ముర్రే పత్రికా సమావేశంలో చెప్పారు.
 
పెరిగిన అక్రమ వలసలు
అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను స్వదేశానికి పంపించే ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక పరిస్థితులు ఇంకెలా ఉంటాయోననే ఆందోళన పెరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో “భారీ బహిష్కరణలు” ఉంటాయని డోనల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్ 2020 నుంచి ఉత్తర, దక్షిణ సరిహద్దుల గుండా అమెరికాలోకి ప్రవేశిచేందుకు ప్రయత్నించిన లక్షా 70వేల మంది భారతీయులను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీపీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
“కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ బలగాలు గత నాలుగేళ్లుగా అదుపులోకి తీసుకున్న అక్రమ వలసదారుల్లో లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారితో పోలిస్తే తక్కువే అయినా, పశ్చిమార్థగోళం నుంచి వస్తున్న వారిలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది” అని గిల్ గేరా, స్నేహపురి చెప్పారు. వీరిద్దరూ వాషింగ్టన్‌కు చెందిన థింక్ టాంక్ నిస్కానెన్ సెంటర్‌లో వలసల వ్యవహారాలపై విశ్లేషకులుగా ఉన్నారు. అమెరికాలో 2022 నాటికి 7లక్షల 25వేల మంది భారతీయులు అక్రమంగా, సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారు. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత భారతీయులే ఎక్కువగా ఉన్నట్లు ప్యూ రీసర్చ్ సెంటర్ విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి.
 
ప్రమాదకర మార్గాల్లో ప్రయాణం
అక్రమ వలసదారుల సంఖ్య అమెరికా జనాభాలో 3శాతం, విదేశీ జనాభాలో 22 శాతంగా ఉంది. ఈ గణాంకాలను చూస్తే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని విశ్లేషకులు గేరా, స్నేహపురి చెబుతున్నారు. మరో అంశం ఏంటంటే, ఇలా వస్తున్న వారంతా ఆర్థికంగా వెనుకబడినవారు కాదు. వారు పెద్దగా చదువుకోకపోవడం లేదా ఆంగ్లం మీద పట్టు లేకపోవడం వల్ల అమెరికాకు టూరిస్ట్ వీసా లేదా స్టూడెంట్ వీసా లభించడం లేదు. అందుకే వారు, కొన్ని ఏజెన్సీల మీద ఆధారపడుతున్నారు. ఈ ఏజెన్సీలు వీరి నుంచి లక్ష అమెరికన్ డాలర్లు ( 80 లక్షల రూపాయలు) వసూలు చేస్తున్నాయి. వీరు కొన్నిసార్లు సరిహద్దు బలగాల కళ్లు గప్పి అమెరికాలోకి ప్రవేశించేందుకు చాలా దూరం ఉన్న, ప్రమాదకరమైన మార్గాలను ఉపయోగిస్తున్నారు.
 
ఏజెన్సీలకు సొమ్ములు చెల్లించేందుకు అనేక మంది భూములను అమ్మేస్తున్నారు లేదా అప్పు తీసుకుంటున్నారు. 2024లో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కోర్టులు విడుదల చేసిన డేటా ప్రకారం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది 18 నుంచి 34 ఏళ్ల లోపువారే. అక్రమ మార్గంలో అమెరికా చేరుకునేందుకు భారతీయులకు ఉన్న మరో మార్గం కెనడా. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి కెనడా ఉత్తర సరిహద్దు భారతీయులకు బాగా అనువైన మార్గం.76రోజుల్లో వచ్చే కెనడా విజిటర్ వీసా తీసుకుని కెనడా వస్తున్నారు( అమెరికాకు విజిటర్ వీసా రావాలంటే భారతీయులకు ఏడాది పడుతుంది)
 
అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రంతోపాటు న్యూయార్క్, న్యూహాంప్‌షైర్ కౌంటీల్లో సరిహద్దు భద్రత చూసే ది స్వాంటన్ సెక్టార్- ఈ ఏడాది మొదటి నుంచి భారతీయుల రాక ఎక్కువైనట్టు తెలిపింది. జూన్‌లో ఈ సంఖ్య భారీగా పెరిగి 2,715 మంది రాకను గుర్తించింది. గతంలో, భారత్ నుంచి అమెరికాలోకి ప్రవేశించే అక్రమ వలసదారులు ఎల్ సాల్వడార్ లేదా నికరాగ్వా ద్వారా ప్రయాణించి మెక్సికోతో ఉన్న దక్షిణ సరిహద్దుల ద్వారా వచ్చే వారు. వలసదారులకు ఎల్ ‌సాల్వడార్, నికరాగ్వా ఆశ్రయం ఇస్తున్నాయి. 2023 నవంబర్ వరకు భారతీయులు వీసా లేకుండానే ఎల్ సాల్వడార్ చేరుకునే సదుపాయం ఉండేది.
 
పంజాబ్ నుంచే ఎక్కువగా ఎందుకు ?
“అమెరికా- కెనడా సరిహద్దు చాలా పొడవుగా, భద్రత బలగాల పహారా తక్కువగా ఉంటుంది. అయినా అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలు అమెరికా మెక్సికో సరిహద్దుతో పోల్చుకున్నప్పుడు ఈ మార్గాన్ని తక్కువగా ఎంచుకుంటున్నాయి.”అని గేరా, పురి చెప్పారు. భారత్‌ నుంచి అమెరికాకు అక్రమంగా వలస వచ్చేవారిలో పంజాబ్, దాని పక్కనే ఉన్న హరియాణా నుంచే ఎక్కువమంది ఉంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య మొదటి నుంచి ఎక్కువగానే ఉంది. పంజాబ్, హరియాణా తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి ఎక్కువ మంది అక్రమ మార్గంలో అమెరికాలోకి అడుగు పెడుతున్నారు.
 
అక్రమవలసదారుల్లో సింహభాగం పంజాబీలదే. ఆర్థిక కష్టాలు, నిరుద్యోగం, వ్యవసాయరంగంలో సమస్యలు, మాదకద్రవ్యాల వినియోగం పెరగడం లాంటి అనేక సమస్యల వల్ల పంజాబీ యువత అమెరికా, కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజాబీలు చాలా కాలం క్రితం నుంచే వలస మార్గంలో ఉన్నారు. అక్కడి గ్రామీణ యువతలో విదేశాలకు వెళ్లాలనే ఉత్సాహం ఇప్పటికీ కనిపిస్తోంది. నవజోత్ కౌర్, గగన్‌ప్రీత్ కౌర్, లవజిత్‌కౌర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో భాగంగా 120 మందిని ప్రశ్నించారు. వీరిలో విదేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిలో 56 శాతం మంది 18 నుంచి 28 ఏళ్ల మధ్యవారే. వీరిలో చాలా మంది ఇంటర్ పూర్తైన తర్వాత విదేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పుచేస్తున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత డబ్బుసంపాదించి అప్పు తీరుస్తున్నారు.
 
వీటన్నింటితో పాటు ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకుంటోంది. “ఇది కొంతమంది సిక్కుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నాయకులు, అధికారులు తమను అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని భయపడుతున్నారు. ఇది నిజమైనా కాకున్నా, విదేశాల్లో స్థిరపడాలని భావించే సిక్కులకు, ఆశ్రయం కోరేందుకు బలమైన ఆధారంగా మారింది” అని స్నేహలత పురి చెప్పారు. ఇలాంటి కేసుల్లో నిజంగా ఆశ్రయం అవసరమైన వారు ఎవరో తెలుసుకోవడం సవాలుగా మారింది. “కారణాలు వేర్వేరు విధాలుగా ఉండవచ్చు, ఆర్థిక అవకాశాలే ప్రాథమిక అంశం. సామాజిక అంశాలు, “అమెరికాలో స్థిరపడ్డారు” అని చెబితే కుటుంబంలో లభించే గౌరవం లాంటివి వారిని ప్రోత్సహిస్తూ ఉండవచ్చు” అని పురి చెప్పారు.
 
ప్రాణాలు పణంగా పెట్టి..
సరిహద్దుల వద్ద భారతీయుల జనాభాలో మార్పును పరిశోధకులు గుర్తించారు. అనేక మంది కుటుంబాలతో సహా అమెరికా సరిహద్దులను దాటి లోపలకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2021లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పురుషులను సరిహద్దుల్లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, రెండు సరిహద్దుల్లోనూ అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడుతున్న కుటుంబాల సంఖ్య 16 నుంచి 18శాతానికి చేరుకుంది.
 
కొన్ని సందర్భాల్లో ఇది విషాద సంఘటనలకు దారి తీస్తోంది. 2022 జనవరిలో గుజరాత్‌కు చెందిన 11 మంది సభ్యుల బృందంలో నలుగురు సభ్యుల కుటుంబం కెనడా సరిహద్దుల్లో నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి గడ్డ కట్టించే చలిగాలుల మధ్య చిక్కుకుని చనిపోయింది. అది కూడా అమెరికా సరిహద్దుకు 12 మీటర్ల దూరంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. భారతీయులు అమెరికాలోకి భారీ సంఖ్యలోకి రావడానికి కారణం ఇక్కడున్న ఆర్థిక అవకాశాలే అని యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్‌లో మైగ్రేషన్ అండ్ అర్బన్ స్టడీస్ స్కాలర్ పాబ్లో బోస్ చెప్పారు. “అమెరికాలోని పెద్ద నగరాలు, ప్రత్యేకించి న్యూయార్క్, బోస్టన్ లాంటినగరాల్లో అసంఘటిత రంగంలో అవకాశాలను దక్కించుకోవచ్చనే ఆశతో ఎక్కువ మంది వస్తున్నారు” అని ఆయన అన్నారు.
 
రానున్నది కష్టకాలమేనా?
“అమెరికా వచ్చిన భారతీయుల్లో ఎక్కువమంది వెర్మాంట్, న్యూయార్క్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం లేదు. వాళ్లు వీలైనంత త్వరగా నగరాలలో ఉద్యోగాలు వెదుక్కోవడానికి వెళ్లిపోతున్నారని నేను నిర్వహించిన ఇంటర్వ్వూల ద్వారా తేలింది” అని బోస్ బీబీసీతో చెప్పారు. వాళ్లంతా ఎక్కువ శాతం మంది ఇంటి పనులలో, హోటల్ ఉద్యోగాలలో చేరుతున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత కఠినంగా మారనున్నాయి. “కెనడాతో ఉన్న ఉత్తర సరిహద్దు చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ నుంచి దేశంలోకి వస్తున్న అక్రమ వలసలు భద్రత సమస్యగా మారాయి” ఇమ్మిగ్రేషన్ మాజీ అధికారి టామ్ హొమన్ చెప్పారు. జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఆయన అమెరికా సరిహద్దుల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. తర్వాత ఏం జరగనుంది అనే దానిపై స్పష్టత లేదు.
 
“కెనడా కూడా తమ సరిహద్దులపై దృష్టి సారించనుంది. తమ దేశం నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకునేందుకు అమెరికా తరహా విధానాలను అమలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే సరిహద్దుల్లో భారతీయుల నిర్బంధాలు తగ్గే అవకాశం ఉంది” అని పురి చెప్పారు. ఏదేమైనా కానీ, మెరుగైన జీవితం కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వేలమంది భారతీయులు తమ ముందున్న దారి ఎంత కఠినంగా ఉన్నా సరే, తమ కలలను నెరవేర్చుకోవాలనే అనుకుంటున్నారు.