గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (14:38 IST)

లక్షలాది మంది భారతీయులు ఎందుకు భారత పౌరసత్వం వదులుకుంటున్నారు?

Passport
కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం... 2021లో 1,63,370 మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా వారు ఇండియా సిటిజెన్‌షిప్ వదులుకున్నట్లు పార్లమెంటుకు తెలిపింది. భారత పౌరసత్వం తీసుకున్న వారిలో ఎక్కువ మంది అంటే 78,284 మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తరువాత 23,533 మంది ఆస్ట్రేలియా, 21,597 మంది కెనడా పౌరులుగా మారారు. చైనాలో 300 మంది భారతీయులు ఇండియా సిటిజెన్‌షిప్ వదులుకుని ఆ దేశ పౌరసత్వం తీసుకోగా 41 మంది ఇండియన్స్ పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారు.

 
ఇక 2020లో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య 85,256. 2019లో ఇది 1,44,017. 2015 నుంచి 2020 మధ్య 8 లక్షల మందికి పైగా ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. కరోనా వల్ల 2020లో ఈ సంఖ్య తగ్గినట్లుగా కనిపిస్తోంది. '2021లో విదేశాల్లో పౌరసత్వం తీసుకున్న వారి సంఖ్య పెరిగినట్లు కనిపించడానికి కారణం కరోనా. 2020లో కరోనా వల్ల సిటిజెన్‌షిప్ లభించని వారికి ఆ తరువాత ఏడాది లభించింది' అని విదేశీ వ్యవహారాల నిపుణుడు హర్ష్ పంత్ తెలిపారు.

 
ఎందుకు పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు?
భావన (పేరు మార్చాం) అమెరికాలో ఉంటున్నారు. 2003లో ఉద్యోగంరీత్యా ఆమె అక్కడకు వెళ్లారు. కొంతకాలం ఉన్నాక అక్కడి వాతావరణం నచ్చి అమెరికాలోనే స్థిరపడాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె కూతురు అక్కడే జన్మించింది. గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోగా కొద్ది సంవత్సరాల కిందటే భావనకు అది వచ్చింది. 'అమెరికాలో జీవితం చాలా సుఖంగా ఉంటుంది. జీవన ప్రమాణాలు చాలా బాగా ఉంటాయి. పిల్లలకు మంచి చదువు దొరుకుతుంది. భారత్‌తో పోలిస్తే ఇక్కడ వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడి పని వాతావరణం చాలా బాగా ఉంటుంది. మనం చేసే పనికి తగిన జీతం ఇస్తారు. ఈ విషయంలో భారత్ చాలా మెరుగుపడాలి. మంచి నైపుణ్యాలు ఉండేవారు దేశం విడిచి వెళ్లకుండా ఉండాలంటే అనేక చర్యలు తీసుకోవాలి. మెరుగైన మౌలిక సదుపాయాలు, మంచి అవకాశాలతోపాటు ద్వంద్వ పౌరసత్వం వంటి వాటిని అమలు చేసే దిశగా ఆలోచించాలి' అని భావన వివరించారు.

 
'పని వాతావరణం చాలా బెటర్'
కెనడాలో నివసిస్తున్న 25 ఏళ్ల అభినవ్ ఆనంద్ అభిప్రాయం కూడా దాదాపుగా భావన మాదిరిగానే ఉంది. కెనడాలో చదువుకున్న అభినవ్, ఏడాదిగా అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. భారత పౌరసత్వం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అభినవ్. కెనడాలో పని చేసే వాతావరణం చాలా బాగా ఉందని, అందువల్ల తిరిగి భారత్‌కు వెళ్లాలని అనుకోవడం లేదంటూ అభినవ్ అంటున్నారు. 'ఇక్కడ పని చేసే గంటలు మారవు. పని చేసే చోట నిబంధనలు కచ్చితంగా పాటిస్తారు. చేసిన పనికి తగినట్లుగా జీతం చెల్లిస్తారు. కానీ భారత్‌లో ఇక్కడి మాదిరిగా నిబంధనలు పాటించరు. అందుకే భారత్‌కు వెళ్లి జాబ్ చేయాలని నేను అనుకోవడం లేదు.

 
వేరే దేశంలో పని చేస్తూ అక్కడే నివసిస్తున్నప్పుడు ఆ దేశ పౌరసత్వం తీసుకోవడం తప్పు కాదు కదా?' అని అభివన్ చెప్పుకొచ్చారు. మంచి ఉద్యోగ అవకాశాలు, డబ్బు, మెరుగైన జీవితం కోసం చాలా మంది భారతీయులు దేశం విడిచిపోతున్నారని హర్ష్ పంత్ అన్నారు. 'అభివృద్ధి చెందిన దేశాల్లో మంచి సౌకర్యాలుంటాయి. నేడు చిన్నచిన్న దేశాలు కూడా వ్యాపారం చేసుకోవడానికి మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆయా దేశాల్లో ఇప్పటికే స్థిరపడ్డ బంధువుల సాయంతో కొందరు అక్కడకు వెళ్తున్నారు' అని హర్ష్ పంత్ వివరించారు. జర్నలిస్ట్ అయిన హరేంద్ర మిశ్ర, 22 ఏళ్లుగా ఇజ్రాయెల్‌లో ఉంటున్నారు. తనకు భారత్‌తో చాలా ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందని, అందువల్లే ఇండియా పౌరసత్వాన్ని వదులుకోలేక పోతున్నానని ఆయన అన్నారు. ఆయన భార్యది ఇజ్రాయెల్. వారి ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు. వారికి ఆ దేశ పౌరసత్వం ఉంది.

 
'ఇండియా పాస్‌పోర్ట్ వల్ల ఒక సమస్య ఉంది. చాలా దేశాలకు వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి ఉంటుంది. లండన్ వెళ్లాలంటే నేను తప్పకుండా వీసా తీసుకోవాలి. కానీ ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా అవసరం లేదు. వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా ఇక్కడ ఆఫీసు లేదు. స్టాంపింగ్ కోసం ఇస్తాంబుల్ పోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లి రావడానికి చాలా ఖర్చు అవుతుంది. నేను సెంటిమెంటల్‌గా భారత పౌరసత్వం ఉంచుకున్నా. కానీ దాని వల్ల నాకు అంతకు మించి పెద్ద ప్రయోజనం ఏమీ లేదు' అని హరేంద్ర మిశ్ర వివరించారు. ప్రస్తుతం భారత్ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా 60 దేశాల వరకు వెళ్లొచ్చు. ఇతర దేశాల పాస్‌పోర్టులతో పోలిస్తే ఇది తక్కువే. పాస్‌పోర్ట్ ర్యాంకుల్లో 199 దేశాల్లో 87వ స్థానంలో భారత్ ఉంది.

 
ద్వంద్వ పౌరసత్వం అవసరమా?
ద్వంద్వ పౌరసత్వం తీసుకొస్తే భారత పౌరసత్వం వదులుకునే వారి సంఖ్య తగ్గుతుందని హరేంద్ర మిశ్రా అభిప్రాయపడుతున్నారు. 'నేను పుట్టిన దేశపు పౌరసత్వం కలిగి ఉండాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. కానీ ద్వంద్వ పౌరసత్వానికి భారత్ చట్టాలు ఒప్పుకోవు. కాబట్టి ఇండియా సిటిజెన్‌షిప్ వదలుకోవడం తప్ప నా ముందు మరో దారి లేదు. కేవలం ద్వంద్వ పౌరసత్వం తీసుకునే వీలు లేకపోవడం వల్ల నాలాగే చాలా మంది భారత పౌరసత్వాన్ని వదులుకోవాలని అనుకుంటున్నారు' అని అభినవ్ ఆనంద్ తెలిపారు. అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్న భావనకు ఇప్పుడు ఓవర్‌సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు ఉంది. కానీ అమెరికా, భారత్ దేశాల పౌరసత్వాలు ఉండాలని ఆమె కోరుకుంటున్నారు.

 
ఓసీఐ అంటే?
ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకున్నవారు భారత దేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. అలాంటప్పుడు ఇండియాకు రావాలంటే వారు వీసా తీసుకోవాల్సి ఉంటుంది. బంధువులు, తల్లిదండ్రుల కోసం భారత్‌కు తరచూ వచ్చే వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 2003లో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్(పీఐఓ) కార్డును తీసుకొచ్చారు. 10 ఏళ్లపాటు పీఐఓ కార్డు పాస్‌పోర్టులా పని చేస్తుంది. ఇక 2006 నుంచి ఓవర్‌సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డును జారీ చేస్తున్నారు. ఈ కార్డు ఉన్న వాళ్లు వీసా లేకుండానే భారత్‌కు రావొచ్చు. ఇండియాలో నివసించొచ్చు, ఉద్యోగం చేయొచ్చు. ఈ కార్డుకు జీవితకాల పరిమితి ఉంది.

 
అయితే ఓసీఐ కార్డు ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఓటు హక్కు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా రాజ్యాంగబద్ధమైన పదవులను చేపట్టలేరు. వ్యవసాయ భూమిని కొనుగోలు చేయకూడదు. 2015 నుంచి పీఐఓ కార్డులను తీసేసి కేవలం ఓసీఐ కార్డులను మాత్రమే జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ఆర్థికమాంద్యం దృష్ట్యా భారతదేశ పౌరసత్వం వదలుకునే వారి సంఖ్య తగ్గొచ్చని హర్ష్ పంత్ అంచనా వేస్తున్నారు. 'ప్రస్తుతం ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ ఆర్థికవ్యవస్థ మెరుగ్గా ఉంది. ఇక్కడ ఎక్కువ అవకాశాలు రానున్నాయి. అందువల్ల భారత్‌లో ఉండాలనుకునే వారి సంఖ్య కూడా పెరగొచ్చు' అని పంత్ వివరించారు.