బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 18 డిశెంబరు 2024 (19:40 IST)

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

India-America
ఏటా ప్రపంచవ్యాప్తంగా వలసలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో వలసలు తగ్గుతాయని చెప్పలేం. గడిచిన దశాబ్దంలో వలసదారులకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. డోనల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు వలసల నిరోధానికి సరిహద్దుల్లో గోడ కడతాననడం, కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణాలపై ఆంక్షలతోపాటు యూకే, యురోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలకు బ్రెగ్జిట్ ఆటంకంగా మారడం లాంటివి చూశాం. ఇక ప్రపంచంలో వలసలకు అతిపెద్ద గమ్యస్థానాలైన రెండు దేశాలలో 2025వ సంవత్సరం భారీ రాజకీయ మార్పులతో మొదలు కానుంది. అమెరికాలో డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. జర్మనీలో ముందస్తు ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండొచ్చని భావిస్తున్నారు. జర్మనీలో కఠినమైన వలసవిధానాలు అమలు చేస్తామని చెబుతున్న పార్టీలకు ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 18న అంతర్జాతీయ వలస దినోత్సవం. ఈ సందర్భంగా 2025లో అంతర్జాతీయ వలసలు ఎలా ఉండనున్నాయో చూద్దాం.
 
ప్రస్తుతం ఎలా ఉంది?
మూడు దశాబ్దాలుగా అంతర్జాతీయంగా వలసల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. అయితే ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే ఒక దేశం నుంచి మరో దేశానికి వలసపోయేవారి శాతం కొంత తక్కువగా ఉంది. ‘‘మేం 25 ఏళ్ల వలసల డేటాను, అలాగే మానవాభివృద్ధి సూచిక డేటాను పరిశీలించాం. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు అంతర్జాతీయంగా మధ్య, అధిక, మానావాభివృద్ధి బాగా జరిగిన దేశాలకు వెళ్లడం కష్టతరంగా మారడాన్ని గమనించాం’’ అని ఐక్యరాజ్యసమితిలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) కు చెందిన మైగ్రేషన్ రీసర్చ్ అండ్ పబ్లికేషన్స్ విభాగం అధిపతి మేరీ మెక్ ఔలిఫ్ చెప్పారు.
 
‘‘సాధారణ మార్గాల్లో వెళ్లడం వలసదారులకు కష్టంగా మారిన ధోరణిని ఇది స్పష్టంగా చూపిస్తోంది. అంతర్జాతీయంగా జరిగే చాలా వలసలలో ఎక్కువ భాగం సంపన్న దేశాల మధ్యనే జరుగుతోంది. వాటిల్లోనే ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు సాగుతున్నాయి'' అని ఔలిఫ్ చెప్పారు. ఇందుకు ఆమె యూరప్ దేశాల మధ్య వలసలను ఉదాహరణగా చూపారు. ఈయూ, ఎకోవాస్, మెర్కోసూర్ వంటి స్వేచ్ఛాయుత రాకపోకలు ఉన్న ప్రాంతాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన ఔలిఫ్, దక్షిణాసియా దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు ప్రధాన ఇమ్మిగ్రేషన్ కారిడార్ ఉందని తెలిపారు.
 
ప్రపంచంలో 70 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. మూడు దశాబ్దాలలోపే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగింది. సిరియాలో అసద్ ప్రభుత్వ పతనం కారణంగా విదేశాలలో తలదాచుకుంటున్న 60 లక్షల మంది సిరియన్లు తమ దేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయిన తొలినాళ్లలో తుర్కియే సరిహద్దు వద్ద సిరియాకు తిరిగివెళ్లేందుకు సిరియన్లు క్యూ కట్టారు. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే సిరియాలో భద్రతపరమైన స్థితిగతులు ఎలా మారుతాయనేది ఊహించలేం. అనిశ్చితి చుట్టుముట్టిన పరిస్థితులలో సిరియా పాలన ఎలా ఉండనుందో చెప్పలేం.
 
వలసలపై ట్రంప్ ప్రభావం ఎంత?
డోనల్డ్ ట్రంప్‌కు, ఆయన వర్గానికి వలసలు చాలా కీలకమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వలసల గమ్యస్థానం అమెరికానే. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అప్పట్లో తన ర్యాలీలో వలసలను అరికట్టేందుకు ''గోడ కడతాం'' అని ఆయన పదేపదే చెప్పేవారు. దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకు మెక్సికన్ సరిహద్దు వెంబడి అడ్డుగోడ నిర్మిస్తామనే హామీని ఉటంకిస్తూ ఆయన ఈ మాట చెప్పేవారు. అయితే తన మొదటి పదవీకాలంలో మెక్సికన్ సరిహద్దు వెంబడి తను అనుకున్న స్థాయిలో కంచెలు, గోడల నిర్మాణల పొడవు పెంచలేకపోయినా, ఆయన తీసుకున్న ఇతర చర్యలు వలసలపై నిర్మాణాత్మకమైన ప్రభావాన్ని చూపాయి.
 
ట్రంప్ 2017 జనవరిలో అధ్యక్షుడైన తరువాత ఆయన చేసిన మొదటిపని ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఏడు దేశాలు(ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్) ప్రజలు అమెరికాకు రాకుండా ప్రయాణ నిషేధాన్ని విధించడం. అందుకే ఈ విధానాన్ని "ముస్లిం నిషేధం"గా పిలుస్తారు. ఈ నిషేధంపై ట్రంప్ సంతకం చేసే సమయంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ప్రయాణమై విమానాల్లో ఉన్నవారు సుమారు 2 వేల మంది దాకా ఉంటారు. వారు అమెరికాలో దిగాక అందరినీ అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు ఏడాదికోసారి లాటరీ పద్ధతిలోఇచ్చే డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా కార్యక్రమాన్ని కూడా ట్రంప్ రద్దు చేశారు. ఈ పద్ధతిలో అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు హక్కులు కల్పించేవారు.
 
కోవిడ్ మహమ్మారి సమయంలో తమ దేశ కార్మికుల మార్కెట్‌ను రక్షించుకోవడమే లక్ష్యంగా ట్రంప్ తన పాలనాకాలం చివరి సంవత్సరంలో ఈ ప్రక్రియను నిలిపివేశారు. ఫలితంగా లాటరీ విజేతలై కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్న వేలాది మందికి ఇది ఆటంకంగా మారింది. ''నేను 2019లో లాటరీలోకి ప్రవేశించా. 2020 జూన్‌లో ఫలితాలు వచ్చాయి. నాకు లాటరీ తగిలినట్టు చూశాను'' అని తుర్కియేకు చెందిన 27 ఏళ్ల మహిళ ఇర్మాక్ (ఆమె అసలు పేరు కాదు) చెప్పారు. "ద్విలింగ సంపర్కురాలిగా, నాస్తిక మహిళగా, నేను నేనుగా జీవించడానికి, భావవ్యక్తీకరణకు తుర్కియే సురక్షితమైన ప్రాంతం కాదనిపించింది. అమెరికాలో వ్యక్తిగత జీవితానికి ఇచ్చే గౌరవం అంటే నాకు ఎంతో ఇష్టం. అమెరికాలో జీవితం సులభంగా గడిచిపోతుందని భావించా'' అని ఆమె చెప్పారు.
 
అయితే దీనిపై ఇర్మాక్ తనలాంటివారితో కలిసి చట్టపరమైన అభ్యంతరాలను లేవనెత్తుతూ కోర్టుకు ఎక్కారు. కానీ కేసు ఓడిపోయారు. ఇక ట్రంప్ ప్రజారోగ్యం అంటూ తీసుకువచ్చిన వివాదాస్పద చట్టం సరిహద్దుల వద్ద వలసదారులను, ఆశ్రయం కోరేవారిని వేగంగా తిప్పి పంపడానికి కావాల్సిన అధికారాలను అమెరికా అధికారులకు దఖలు పరిచింది. ట్రంప్ శ్వేత సౌధాన్ని వీడే 2021 జనవరి నాటికి 4లక్షలమంది నిర్బంధానికి, బహిష్కరణకు గురయ్యారు.
 
రెండోసారి ఏం చేయనున్నారు?
అక్రమ వసలదారులను భారీ ఎత్తున వెనక్కు పంపుతామని డోనల్డ్ ట్రంప్ తన ప్రచారంలో హామీ ఇచ్చారు. ''ఇది ఖర్చుకు సంబంధించిన విషయం కాదు. నిజంగా మాకు వేరే దారిలేదు'' అని ట్రంప్ చెప్పారు.తన హామీ అమలు కోసం అమెరికా సైన్యాన్ని వినియోగించుకునేందుకు వీలుగా జాతీయ అత్యవసర స్థితిని ప్రకటిస్తానని చెప్పారు. పది లక్షల మందితో ఈ బహిష్కరణలను ప్రారంభిస్తామని జేడీ వాన్స్ చెప్పారు. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా అని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గత దశాబ్ద కాలంగా ఏటా అమెరికాలో అరెస్ట్ అయ్యి బహిష్కరణకు గురవుతున్న వలసదారుల సంఖ్య లక్ష లోపే ఉంటోంది.
 
''ఈ సంఖ్యను ఏడాదిలో పదిలక్షలకు పెంచడానికి అపారమైన వనరులను సమకూర్చాల్సి ఉంటుంది. కానీ అన్ని వనరులు అందుబాటులో ఉండకపోవచ్చు'' అని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ పాలసీ డైరెక్టర్ ఆరోన్ రైచ్లిన్ మెల్నిక్ బీబీసీతో అన్నారు. పది లక్షలమంది, అంతకంటే ఎక్కువ బహిష్కరణల కోసం వందలాది బిలియన్లు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క ఇంతపెద్ద సంఖ్యలో బహిష్కరణ ప్రక్రియను ఇమ్మిగ్రేషన్ కోర్టు వ్యవస్థలు నిర్వహించలేకపోతున్నాయి. పైగా ఏదైనా సామూహిక బహిష్కరణ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. తన మొదటి పాలనా కాలంలో డైవర్సిటీ వీసాల లాటరీ విజేతలకు చేసినట్టుగానే చట్టబద్ధమైన వలసలను తగ్గించడంలో ఈసారి ట్రంప్ విజయం సాధించవచ్చేమో.
 
జర్మనీలో ఏం జరగనుంది?
ప్రపంచంలో వలసలకు రెండో అతిపెద్ద గమ్యస్థానమైన జర్మనీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల కాలంలో కార్మిక నియామకాల కోసం వలస విధానాలను జర్మనీ సరళతరం చేసింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న రైట్ పార్టీలకు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి? కార్మికుల కొరతను ఎదుర్కొనేందుకు జర్మనీ ప్రభుత్వం వలస నిబంధనలను సులభతరం చేసింది. కానీ ప్రస్తుత ప్రధాని ఉలాఫ్ షుల్జ్స్‌కు చెందిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ క్రిస్టియన్ డెమొక్రాట్స్ (డీసీయూ/సీఎస్‌యూ), ఫార్ రైట్ పార్టీ అయిన ఏఎఫ్‌డీ కంటే వెనుకబడి ఉంది.
 
వలసలను కఠినతరం చేయడం జర్మనీ పార్టీల ఎన్నికల ప్రచారంలో భాగం, ముఖ్యంగా సీడీయూ, డీసీయూ పార్టీలు, అతిమితవాద ఏఎఫ్‌డీ, ఫార్-లెఫ్ట్ బీఎస్‌డబ్ల్యు పార్టీల ప్రచారంలో ఇది కీలకం" అని జర్మన్ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ హెడ్ విక్టోరియ రైటెగ్ చెప్పారు. కార్మికుల కొరత కారణంగా జర్మన్ పార్టీలు సాధారణ వలసలను తక్కువగా విమర్శించినప్పటికీ, 10 మందిలో ఆరుగురు ఈ మూడు పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. ''ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తే ఫిబ్రవరి తరువాత అధికారంలోకి వచ్చే పార్టీ కచ్చితంగా జర్మనీ వలస విధానాలను కఠినతరం చేస్తుంది. క్రిస్టియన్ డెమొక్రాట్స్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం దీనిని మరింత కఠినతరం చేయవచ్చు అని రైటెగ్ నమ్ముతున్నారు.
 
మిగిలిన దేశాల పరిస్థితేంటి?
జర్మనీ, అమెరికా దేశాలు వలస విధానాలను కఠినతరం చేస్తే, మిగిలిన దేశాలు కూడా మరిన్ని నిబంధనలను అమలు చేయవచ్చు. అయితే ప్రాంతీయ విధానాల కారణంగా ఈయు, ఎకోవాస్, దక్షిణాసియా, గల్ఫ్ మార్గాలు పెద్దగా ప్రభావితం కాకపోవచ్చు. ''దక్షిణాసియా నుంచి గల్ఫ్ దేశాలకు భారీగా కార్మికుల వలసలు ఉంటాయి. కార్మికులకు డిమాండ్ ఉన్న కారణంగా అవి కొనసాగుతాయి. గల్ఫ్‌లోని చాలా దేశాలకు కార్మికులవలస అనేది కీలకమైన అంశంగా ఉంది. వీరంతా ముఖ్యమైన సేవలు అందిస్తుంటారు'' అని మేరీ మెక్ ఔలిఫ్ చెప్పారు. వలసల విధానంలో విశ్వాసాన్ని తగ్గించేలా ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.
 
''నావరకైతే అంతర్జాతీయ వలసల విషయంలో అతి పెద్ద సమస్య... తప్పుడు సమాచారం వలసలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది'' అని చెప్పారు. ‘‘యుద్ధాలు, విపత్తుల వల్ల నిరాశ్రయులైనవారు కాకుండా, అంతర్జాతీయ వలస ధోరణులు సాపేక్షంగా ఊహించదగినవి. స్థిరమైనవి. కాలక్రమేణా విధాన మార్పుల ద్వారా మాత్రమే అవి ప్రభావితమవుతాయని’’ మెక్ ఆలిఫ్ చెప్పారు. "అంతర్జాతీయ వలసలు దీనికి మినహాయింపు అని మాకు తెలుసు. చాలా మంది ప్రజలు తాము జన్మించిన దేశాలలోనే ఉంటారు. అక్కడే నివసిస్తున్నారు" ఔలిఫ్ తెలిపారు.