మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (15:31 IST)

ఈ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం పనిచేయదా?

Paytm
పేటీఎం పేమెంట్ బ్యాంక్‌‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నియంత్రణలు విధించింది. ఆర్‌బీఐ చెప్పినదాని ప్రకారం, ఫిబ్రవరి 29 తర్వాత నుంచి పేటీఎంకు చెందిన అనేక సేవలు నిలిచిపోతాయి. పేటీఎం నిబంధనల్ని ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ చేసిన ఈ ప్రకటన తర్వాత, పేటీఎం షేర్లు భారీగా పడిపోయాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభాని కంటే ముందే పేటీఎం షేర్లు 20 శాతం పతనమయ్యాయి.
పేటీఎం షేరు ధర రూ. 609కి పడిపోయింది. గత ఆరు వారాల్లో ఇదే కనిష్ఠ ధర. ఆర్‌బీఐ తాజా ప్రకటన సమాజంలోని చాలా పెద్ద వర్గాన్ని ప్రభావితం చేయొచ్చు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్ మార్కెట్‌లో పేటీఎం వాటా 16-17 శాతం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోట్లాది మంది ఈ నిర్ణయం వల్ల ప్రభావితం అవుతారు.
 
ఆర్‌బీఐ ఉత్తర్వుల్లో ఏం ఉంది?
పేటీఎంకు సంబంధించి బుధవారం ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘పేటీఎం ఆడిట్ నివేదికతో పాటు ఇతర బాహ్య ఆడిటర్ల నివేదికల ప్రకారం చూస్తే, పేటీఎం తరచుగా నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా తేలింది. అందుకే బ్యాంకుల నియంత్రణ చట్టంలోని 35ఏ నిబంధన ప్రకారం, ఫిబ్రవరి 29 తర్వాత నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో క్రెడిట్ డిపాజిట్, లావాదేవీలు, వ్యాలెట్, ఫాస్టాగ్ టాప్‌అప్‌లు నిలిపేస్తున్నాం. వినియోగదారులు బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి, వాటిని వాడుకోవడానికి పేటీఎం పూర్తిగా సహకరించాలి. అందుకు సౌకర్యాలు కల్పించాలి. పేటీఎంలో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫాస్టాగ్‌లలో నిల్వ ఉన్న మొత్తాల విత్‌డ్రా, వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు’’ అని ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కస్టమర్లు దీన్ని ఉపయోగించలేరు. మార్చి 15 లోపు నోడల్ అకౌంట్‌ను సెటిల్ చేయాలని పేటీఎంను ఆర్బీఐ కోరింది.
 
ఆర్బీఐ ఆదేశాలపై పేటీఎం ఎలా స్పందించింది?
ఆర్బీఐ సూచనలకు అనుగుణంగా పేటీఎం పనిచేస్తోందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్ (ఓసీఎల్) చెప్పింది. ‘‘ఒక పేమెంట్ కంపెనీగా ఓసీఎల్ కేవలం ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంకు’తోనే కాకుండా అనేక బ్యాంకులతో కలిసి పని చేస్తుంది. మేం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత, మేం పూర్తి స్థాయిలో మా బ్యాంక్ భాగస్వాముల మీద ఆధారపడతాం. భవిష్యత్‌లోనూ ఓసీఎల్ ఇతర బ్యాంకులతో మాత్రమే పనిచేస్తుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో పనిచేయదు’’ అని ఓసీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
 
పేటీఎం పేమెంట్ బ్యాంక్ అంటే ఏంటి?
ఆర్బీఐ నిర్ణయ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం కావాలంటే, ముందుగా పేటీఎం బ్యాంక్ అంటే ఏంటి? సాధారణ బ్యాంకు కంటే ఇది ఎలా భిన్నంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో కేవలం డబ్బును డిపాజిట్ చేయవచ్చు. రుణాలు ఇచ్చే అధికారం దీనికి ఉండదు. ఇది డెబిట్ కార్డ్‌లను జారీ చేస్తుంది. కానీ, క్రెడిట్ కార్డ్‌లను ఇవ్వడానికి ఏదైనా రుణదాత (లెండర్) రెగ్యులేటర్‌తో ఇది వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది ఎలాంటి బ్యాంక్ ఖాతా అంటే, ఇందులో డబ్బులు జమ చేసుకోవచ్చు. మామూలుగా వ్యాపారులకు చేసే చెల్లింపులు ముందుగా వారి పేటీఎం పేమెంట్స్ అకౌంట్‌లోకి వెళ్లి, ఆ తర్వాత వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ అవుతాయి. దీనికి బదులుగా పేటీఎం తన కస్టమర్లకు క్రెడిట్ పాయింట్లు ఇస్తుంది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వద్ద ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్ (పీపీఐ) లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్‌ను 2017లో పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ని ప్రారంభించడానికి ఉపయోగించారు.
 
మీ వ్యాలెట్, యూపీఐకి ఏం జరుగుతుంది?
ఫిబ్రవరి 29 వరకు పేటీఎంకు చెందిన అన్ని సర్వీసులు మామూలుగానే పని చేస్తాయి. ఆ తర్వాత నుంచి పేటీఎం వ్యాలెట్, యూపీఐ సేవలను వాడే వ్యక్తులకు కొన్ని మార్పులు వర్తిస్తాయి. మరీ ముఖ్యంగా, ఒకవేళ మీ వ్యాలెట్‌లో ఇప్పటికే డబ్బులు ఉంటే వాటిని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. కానీ, ఈ వ్యాలెట్‌లో ఇక డబ్బులు జమ చేయలేరు. ఒకవేళ మీ పేటీఎం అకౌంట్‌ను ఏదైనా థర్డ్ పార్టీ బ్యాంక్‌తో లింక్ చేసినట్లయితే మీ పేటీఎం పనిచేస్తుంది. యూపీఐ పేమెంట్‌ను కూడా కొనసాగించొచ్చు. థర్డ్ పార్టీ (ఎక్స్‌టర్నల్) బ్యాంక్ అంటే మీరు పేటీఎంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంక్ ఖాతాను వాడుతున్నట్లయితే మీకు ఎలాంటి మార్పులు వర్తించవు. ఏదీ మారదు.
ఒకవేళ మీరు పేటీఎం బ్యాంక్‌తో లింక్ అయిన వ్యాలెట్‌ను వాడుతున్నట్లయితే దాన్ని ఇక వాడలేరు. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి బ్యాంక్ అకౌంట్‌లో, వ్యాలెట్‌లో నగదు క్రెడిట్ చేయడం కుదరదు.
 
ఫాస్టాగ్‌కు ఏమవుతుంది?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రతీ కారు విండ్‌షీల్డ్ మీద ఫాస్టాగ్ ఉంటుంది. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీన్నినిర్వహిస్తుంది. ప్రతీ టోల్ బూత్ వద్ద ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా ఫీజు చెల్లిస్తారు. ఆర్బీఐ తాజా నిర్ణయం తర్వాత, మార్చి 1 నుంచి వినియోగదారులు పేటీఎం ఫాస్టాగ్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోగలరు. కానీ, ఆ ఫాస్టాగ్ అకౌంట్‌లో డబ్బును ఇక డిపాజిట్ చేయలేరు.
 
పేటీఎం చెల్లింపులను వ్యాపారులు అంగీకరిస్తారా?
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌ను వాడే దుకాణదారులు ఇకపై పేమెంట్‌ను స్వీకరించలేరు. ఎందుకంటే, పేమెంట్ బ్యాంక్ ఖాతాల్లో నగదు క్రెడిట్‌కు ఇక అనుమతి ఉండదు. కానీ, చాలా మంది వ్యాపారులు, కంపెనీల వద్ద ఇతర కంపెనీలకు చెందిన క్యూఆర్ స్టిక్కర్లు ఉంటాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు వారు స్వీకరించవచ్చు.
 
ఫిన్‌టెక్ కంపెనీలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఆర్బీఐ తాజా నిర్ణయంపై ఎంట్రప్రెన్యూర్, భారత్‌-పే వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ, ఈ రకమైన చర్యలు ఫిన్‌టెక్ రంగాన్ని నాశనం చేస్తాయని అన్నారు. ట్విటర్ వేదికగా ఆయన తన అంసతృప్తిని వెలిబుచ్చారు. ‘‘నాకేం అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే ఆర్బీఐ, ఫిన్‌టెక్ వ్యాపారం ఉండకూడదు అనుకుంటోంది. ఇలాంటి చర్యల వల్ల ఫిన్‌టెక్ రంగం నాశనం అవుతుంది. ఈ వ్యవహారంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవాలి. నేడు ఐఐటీ-ఐఐఎంలు తమ విద్యార్థులకు ప్లేస్‌మెంట్ల కోసం కష్టపడుతోంది. ఇలా చేయడం మంచిది కాదు. ప్రపంచంలో యూపీఐని ప్రోత్సహిస్తూ దాన్ని ప్రారంభించిన వారికి శిక్ష వేయడం తగదు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
పేటీఎం వాటాదారుల పరిస్థితి ఏంటి?
ఆర్బీఐ నిషేధపు ప్రకటన చేసినప్పటి నుంచి పేటీఎం షేర్ల ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇవి మరింత పడిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది కచ్చితంగా షేర్ హోల్డర్లపై ప్రభావం చూపుతుందని బ్యాంకులకు డిజిటల్ ఆర్థిక సేవల్ని అందించే ప్లూటోవన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రజత్ గులాటీ అన్నారు. పేటీఎంకు మూడు ఎంటిటీలు ఉన్నాయి. వాటిలో ఒకటి మూతబడుతుంది. కాబట్టి దాని ప్రభావం భారీగానే ఉండబోతుంది.