శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2019 (14:33 IST)

పాకిస్తాన్‌తో మ్యాచ్... విరాట్ కోహ్లి ఏమన్నాడో తెలుసా?

క్రికెట్ ప్రపంచ కప్‌లో గురువారం ఒక్క బంతి కూడా పడకుండానే న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షార్పణమైన వెంటనే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌తో జరుగనున్న మ్యాచ్‌పై దృష్టి సారించాడు. పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఇంగ్లండ్‌లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఆదివారం జరుగనుంది.

చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది చూస్తారనే అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ మ్యాచ్ ఒక అవకాశమని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద మ్యాచ్ అని చెప్పాడు.
 
మేజర్ టోర్నీల్లో కాకుండా ఇతర సందర్భాల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడటం అరుదు. ఈ రెండు జట్లు చివరిసారిగా 2018 ఆసియా కప్‌లో పోటీపడ్డాయి. అప్పుడు పాకిస్థాన్‌ను భారత్ రెండుసార్లు ఓడించింది. అంతకుముందు 2017లో ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాకిస్తాన్ గెలిచింది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో భారత్ ఊపు మీద ఉంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగిన రెండు మ్యాచుల్లోనే గెలుపొందింది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. మరోవైపు పాకిస్తాన్ ప్రదర్శనలో నిలకడ లోపించింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో మ్యాచుల్లో పరాజయం పాలైంది.
 
'మేం బాగా ఆడుతున్నాం'
"మేం బాగా ఆడుతున్నాం. పాయింట్ల పట్టికలో మేం ఎక్కడున్నామనేదానిపై అంతగా ఆలోచించడం లేదు. రెండు మ్యాచుల్లో లభించిన విజయాలు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి" అని కోహ్లీ చెప్పాడు. తాము ఓ రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనబోతున్నామని, తమ ఆలోచనా తీరు, నైపుణ్యాల స్థాయి ఎలా ఉన్నాయో మరోసారి పరీక్షించుకుంటామని అతడు తెలిపాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నామని కోహ్లీ ధీమా వ్యక్తంచేశాడు.
 
ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు?
పాకిస్తాన్‌తో మ్యాచ్‌ కలిగించే ఒత్తిడిని ఎలా అధిగమిస్తారనే ప్రశ్నకు కోహ్లీ బదులిస్తూ- మైదానంలోకి అడుగు పెట్టిన వెంటనే తమ ఆలోచనల్లో స్థిమితం వచ్చేస్తుందని, ఆందోళన లేకుండా ఆడతామని తెలిపాడు. మ్యాచ్‌పై సర్వత్రా నెలకొన్న ఆసక్తి, ఉత్కంఠ తొలిసారిగా ఆడుతున్న వారిని ఆందోళనకు గురిచేస్తుందని, కానీ ఎప్పట్లాగే ఇప్పుడు కూడా ప్రొఫెషనల్‌గా ఉండటం, ప్రాథమిక అంశాలను సరిగా పాటించి, అనుకున్న ఫలితాన్ని సాధించేందుకు ప్రయత్నించడమే తమ జట్టుకు ముఖ్యమని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
 
ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో కలుపుకొని నాలుగు మ్యాచ్‌లు వాన కారణంగా రద్దయ్యాయి. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ రోజైన ఆదివారం మాంచెస్టర్‌లో జల్లులు పడే అవకాశముందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి.