మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 19 నవంబరు 2024 (16:04 IST)

వైఎస్ జగన్: అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోతారా?

Jagan
‘‘అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యంలోకి పోతా ఉన్నాం’’ అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ ఏడాది జూన్ 20న తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ సమావేశంలో అన్నారు. అసెంబ్లీకి వెళ్తే పెద్దగా చేయగలిగిందేమీ ఉండదని ఆయన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 16 రోజులకే చూచాయగా చెప్పేశారు. ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? రారా? అనే చర్చ మొదలైంది. 2024 జూన్ 22న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పులివెందుల శాసనసభ్యునిగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆరోజు అసెంబ్లీ వెనుక గేటు నుంచి సభలోకి వచ్చిన జగన్ ప్రమాణస్వీకారం చేశాక సభ నుంచి వెళ్లిపోయారు.
 
జులైలో కూడా సభ జరిగింది. జులై 22న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు జగన్ నల్లకండువా ధరించి హాజరయ్యారు. టీడీపీ 40 రోజుల పాలనలో 30కి పైగా హత్యలు జరిగాయని ఆరోపిస్తూ, సభలో నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేశారు. ఆ తర్వాత శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. సభలో మిగిలిన ఏకైక పక్షం వైసీపీనే కాబట్టి, తమ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాకుండా ఎలా పోతుందనేది ఆయన వాదన.
 
జగన్ ఏం చెబుతున్నారు?
ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోతే తనకు కనీసం రెండు నిమిషాలు కూడా మైక్ ఇవ్వరని, అందువల్ల ప్రజాసమస్యలు ప్రస్తావించలేనని, ఇది ప్రతిపక్షం గొంతు నొక్కడమేనని కూటమి ప్రభుత్వాన్ని జగన్ విమర్శించారు. ‘‘అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం. మీడియా సమక్షంలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. అయితే జగన్ అధికారంలో ఉన్న సమయంలో గతంలో అసెంబ్లీలో... ‘‘అధ్యక్షా చంద్రబాబుకు 23 సీట్లు వచ్చాయి.

ఒక ఐదారుగురిని ఇటు పక్కకు లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు’’ అని చెప్పిన మాటలను టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు వెళ్లినా ప్రయోజనం ఉండదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధి సభకు వెళ్లకపోతే ఏమవుతుంది? అలాంటి సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారా? శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
 
60 రోజుల నిబంధన
అసెంబ్లీ లేదా పార్లమెంటు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించేందుకు రాజ్యాంగం కొన్ని నిబంధనలు విధించింది. వాటిలో ద్వంద్వ సభ్యత్వంతో పాటు ఒక సభ్యుడు స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజులపాటు సభకు హాజరుకాకపోతే అనర్హుడిగా ప్రకటించవచ్చని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 (4) కింద ఒక రాష్ట్ర శాసనసభలోని సభ్యుడు 60 రోజులపాటు సభ అనుమతి లేకుండా అన్ని సమావేశాలకు గైర్హాజరైతే, సభ ఆ ప్రతినిధి సీటు ఖాళీ అయినట్టు ప్రకటించవచ్చని తెలుపుతోంది.
 
కానీ, ఆ 60 రోజుల కాలాన్ని లెక్కించేటప్పుడు సభ వరుసగా నాలుగు రోజులకు మించి వాయిదా పడిన కాలాన్ని, ప్రోరోగ్ అయిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని తెలియజేసింది. అయితే రాజ్యాంగం కల్పించిన ఈ 60 రోజుల నిబంధనే సభకు దూరంగా ఉండడానికి నేతలకు అవకాశం ఇస్తోందా అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంటు కాల వ్యవధి ఐదేళ్లు. అసెంబ్లీ సమావేశాలు ఈ ఐదేళ్లలో కనీసం 150 రోజులు కూడా జరగని సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు 2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శాసనసభ మొత్తం ఐదేళ్ల కాల వ్యవధిలో 129 రోజులు పనిచేసింది.
 
2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో 79 రోజులు సభ నడిచినట్టు ఏపీ లెజిస్లేచర్ అధికారిక వెబ్ సైట్ చూపుతోంది. తెలుగుదేశం హయాంలో ఒక ఏడాదిలో (2018)లో అత్యధికంగా శాసనసభ 19రోజులు పనిచేయగా, వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీని ఒక ఏడాదిలో (2022లో) అత్యధికంగా 12 రోజులు నడిపింది. గతంలో అసెంబ్లీలు చాలా రోజులు నడిచేవి.
 
1952లో హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక్క ఏడాదిలోనే 74 రోజులు సమావేశమైంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశమయ్యే రోజులను పరిగణనలోకి తీసుకుంటే 60 రోజుల కాలవ్యవధి పూర్తి కావడానికి కనీసం 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుంది. ఏ ప్రభుత్వానికైనా మూడు నుంచి నాలుగేళ్ల కాలం పూర్తయ్యాక సహజంగా ఎంతో కొంత ప్రజావ్యతిరేకత అనే గుబులు మొదలవుతుంది. అలాంటి సమయంలో సభకు హాజరుకావడం లేదంటూ ఏ సభ్యుడిపైనైనా అనర్హత వేటు వేయడానికి ప్రభుత్వాలు అంత సుముఖంగా ఉండకపోవచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.
 
‘పార్లమెంట్ అలా.. అసెంబ్లీ ఇలా..’
‘‘ప్రజలు తమ ప్రతినిధిగా ఎన్నుకుని సభకు పంపితే, మళ్లీ ప్రజల్లోనే తేల్చుకుంటాననడం ఏమిటి? ఇది సరికాదు. నానాటికీ అసెంబ్లీ ప్రమాణాలు పడిపోతున్నాయి. గతంలో పార్లమెంటును చూసి అసెంబ్లీలు నడుచుకోవాలని చెప్పేవారు. అంటే పార్లమెంటు సమావేశాలు అంత అర్ధవంతంగా, బాగా జరిగేవన్నమాట’’ అని చెప్పారు సీనియర్ పాత్రికేయుడు ఏ. కృష్ణారావు.
 
‘‘పార్లమెంటులో అర్ధవంతమైన చర్చలు జరిగేవి. సభ హుందాగా నడిచేది. అంటే అక్కడ నిరసనలు, ఆందోళనలు, బహిష్కరణలు లేవని కావు. గతంలో తెహల్కా వ్యవహారంలో జార్జి ఫెర్నాండెజ్ సభకు వస్తే తాము సభను బహిష్కరిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇక గత పదేళ్లుగా పార్లమెంటులో కూడా ప్రతిష్టంభనలు మామూలైపోయాయి. కీలకమైన బిల్లులపై చర్చలు లేకుండా రెండే నిమిషాలలో ఆమోదిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరగడం లేదు’’ అని చెప్పారు కృష్ణారావు.
 
‘‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ ప్రమాణాలు పడిపోయాయి. రాజకీయాలు వ్యక్తిగతంగా మారిపోవడంతో, సమాజమే రెండుగా విడిపోయింది. ఇది వాంఛనీయం కాదు’’ అన్నారు కృష్ణారావు. ‘‘ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులను మనసులో పెట్టుకుని రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చింది. దీన్ని అరికట్టాలి’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘జగన్ అసెంబ్లీకి రావాలి. అధికారపక్షం ఏం మాట్లాడినా, తాను చెప్పాలనుకున్నది చెప్పాలి. అంతేకానీ ప్రజలు ఎన్నుకుని పంపితే, తిరిగి ప్రజల్లోనే తేల్చుకుంటాననడం సరికాదు’’ అన్నారు ఆయన.
 
ఏపీలో ఈ సమస్య పరిష్కారానికి మేధావులు, పాత్రికేయులు ఏదైనా మార్గం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘సభకు రాకపోతే ఆ విషయాన్ని స్పీకర్‌కు తెలియజేసి, అనుమతి తీసుకోవాలి. లేదంటే చర్యలు తీసుకునే అధికారం ఉంది. కానీ ఇలాంటి సంప్రదాయం ఇప్పటిదాకా పెద్దగా ఆచరించిన దాఖలా లేదు’’ అని ఆయన చెప్పారు.