బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (20:02 IST)

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

Vishnu Kumar Raju
తాను గత వైకాపా పాలకులు అధికార దాహంతో విపక్ష నేతలపై ప్రయోగించి థర్డ్ డిగ్రీలో తాను తప్పించుకున్నానని, దీనికి కారణం తాను భారతీయ జనతా పార్టీలో ఉండటేమేనని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఏపీ శాసనసభ ఉప సభాపతిగా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు బీజేపీ శాసనభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ, 
 
'అధ్యక్షా... మీరు, నేను కలిసి చదువుకున్నాం. 1978లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో బీఫార్మసీలో చేరాను. యూనివర్సిటీ మొత్తానికి ఫస్ట్ సీట్ నాదే అధ్యక్షా. కాలేజీకి వెళ్లాక... ఇంకా ఎవరెవరు చేరారు అనే ఆసక్తి ఉండటం సహజం. 10 రోజుల తర్వాత మీరు కూడా బీఫార్మసీలో చేరడం జరిగింది అధ్యక్షా. అయితే మనిద్దరం రెండు నెలల కాలమే బీఫార్మసీలో కలిసి ఉన్నాం. ఆ తర్వాత నేను ఇంజినీరింగ్ సీటు రావడంతో వెళ్లిపోయాను. మీరు బీఫార్మసీలో కొనసాగారు. ఆ తర్వాత మీరు పీజీ కూడా చేశారు. మీకు, నాకు 46 సంవత్సరాల అనుబంధం ఉంది అధ్యక్షా!' అని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు.
 
అదేసమయంలో గత ప్రభుత్వం ఎవరినీ వదల్లేదు. ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురిచేసింది. భౌతికంగా ఇబ్బందులు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించారు. ఏదైనా ఉంటే నేను కూడా ఓపెన్‌గా మాట్లాడే వ్యక్తిని. నాపై కూడా అప్పుడు కేసు పెట్టారు. నా అదృష్టం ఏమిటంటే... నేను బీజేపీలో ఉన్నాను. లేకపోతే... మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగిందో, నాక్కూడా అదే జరిగేది... బీజేపీలో ఉండడం వల్ల తప్పించుకున్నాను. ఆ రోజున పెద్దలు కొంత అభయం ఇచ్చారు కాబట్టి బతికి బయటపడ్డానని అనుకుంటున్నాను అని పేర్కొన్నారు.