శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (15:32 IST)

ఏపీలో ఆర్థిక అవకతవకలు : సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ అధికార వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఈ కేసు తదుపరి విచారణను డిసెంబలు 14వ తేదీకి వాయిదా వేసింది. 
 
రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటును ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘరామకృష్ణం రాజు తన పిటిషన్‌‍లో పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వివరించారు. 
 
మరోవైపు, పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు ఆలకించిన ధర్మాసనం ఏపీ సీఎం జగన్ రెడ్డితో సహా పలువురు మంత్రు, అధికారులతో కలిసి మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబరు 14వ తేదీకి వాయిదావేసింది.