జగన్ బెయిల్ రద్దయ్యేనా? సుప్రీం కోర్టు నోటీసులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు భయం ప్రారంభమైంది. తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అదేసమయంలో సీబీఐతో పాటు జగన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనం తెలిపింది. జగన్‌తో పాటు సీబీఐ ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
మరోవైపు, విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్‌లో రఘురామ కోరారు. దీనని పిటిషన్‌కు జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా బెయిల్ ఇపుడే రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించగా, తొలుత నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురామరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు.