గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (16:01 IST)

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు లభించని తక్షణ ఊరట..

chandrababu
ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు మరోమారు వాయిదా వేసింది. ప్రస్తుతం విచారణలో 17ఏ సెక్షన్‌పై తీర్పు వెలువరించిన తర్వాత ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అప్పటివరకు యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. 
 
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్.ఎల్.పి)పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది సారథ్యంలోని ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున రంజిత్ కుమార్‌‍లు తమ వాదనలు వినిపించారు. 
 
ఈ కేసులో తొలుత సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయని, ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయిందని గుర్తు చేశారు. ఫైబర్ నెట్ కేసులో అరెస్టు చేయొద్దని ఇప్పటికే చెప్పారన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది రంజిత్ కుమార్ వాదిస్తూ, ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నపుడు మల్లీ అరెస్టు అనే ప్రశ్నే ఉత్పన్నం కారాదన్నారు. చంద్రబాబు జ్యూడీషియల్ కస్టడీ కొనసాగుతుందని, ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపామన్నారు. 
 
ఇరు తరపు వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను నవంబరు 8వ తేదీకి వాయిదా వేసిందన్నారు. అయితే, తన వ్యక్తిగత ఇబ్బంది దృష్ట్యా ఈ విచారణను తొమ్మిదో తేదీన విచారణ చేపట్టాలని కోరారు. దీనికి ధర్మాసనం.. ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజున విచారణ చేపడుతామని తెలిపింది. 
 
ముందుగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పును వెలువరిస్తామని, ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటివరకు ఫైబర్ నెట్ కేసులో యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అంతవరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని స్పష్టం చేసింది. కాగా, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేయడంతో ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.