ప్రాణం కోసం దున్న.. ఆహారం కోసం మొసలి : మధ్యలో నీటిగుర్రం.. ఏది గెలిచింది?
అడవి మృగాలు అతి క్రూరంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమ ఆకలిని తీర్చుకునేందుకు క్రూరంగా దాడికి తెగబడతాయి. ఇలాంటి వన్యప్రాణుల పోరాటం దక్షిణాఫ్రికాలోని శాబిశాండ్స్ సఫారీ పార్కులో అరుదైన దృశ్యాలుగా కనిపిస్తుంటాయి. తాజాగా, నీటి కోసం దున్న.. ఆహారం కోసం మొసలి.. మధ్యలో నీటిగుర్రం మధ్య జరిగిన పోరాటం.. చూపరులను భీతికొల్పేలా ఉంది. వీటి పోరాటాన్ని నిక్ క్లీర్ అనే సఫారీ ఫోటోగ్రాఫర్ తన వీడియోలో బంధించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...ఓ అడవి దున్న.. నీళ్లు తాగడానికి నీటి మడుగు వద్దకు వచ్చింది.
ఆ మడుగులో ఉన్న ఓ మొసలి ఒకటి.. దానిపై దాడి చేసి మెడబట్టి నీళ్లల్లోకి లాగేసింది. ప్రాణాల కోసం దున్న పోరాటం.. ఆహారం కోసం మొసలి ఆరాటం. ఇంతలో ఓ నీటిగుర్రం (హిప్పోపొటమస్) వాటి మధ్య దూరి యుద్ధం చేసింది. చివరికి.. దున్న ఓపిక తగ్గి ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడింది. నీటిగుర్రం కూడా తన పట్టును సడలించింది. దీంతో మొసలి దున్నను తన ఆహారంగా స్వీకరించింది. ఏకంగా గంటపాటు సాగిన ఈ యుద్ధాన్ని ఆ ఫొటోగ్రాఫర్ చిత్రీకరించి బాహ్యప్రపంచానికి చూపించాడు.