ఏసీ కోచ్‌లలో బెడ్ షీట్లను కొట్టేస్తున్నారు.. హీట్ పెంచేస్తారట..!
రైళ్లల్లోని ఏసీ కోచ్‌ల్లో ఉష్ణోగ్రత పెంచాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణం బెడ్ షీట్లు దొంగతనానికి గురికావడమే. పలు రైళ్లలోని ఏసీ కోచ్‌లలో బెడ్ షీట్లను ప్రయాణీకులు వెంట బెట్టుకుని వెళ్లిపోతున్నారు. దీంతో ఎయిర్ కండిషన్ కోచ్‌లలో ఉష్ణోగ్రతను పెంచాలని, ప్రయాణం ముగియడానికి కనీసం అరగంట ముందే బెడ్ షీట్లను స్వాధీనం చేసుకోవాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఉష్ణోగ్రత పెంచేసినా.. ఏ ప్రయాణీకుడికి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. కోచ్ కండక్టర్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తారని స్పష్టం చేశారు. రైళ్లలో సాధారణంగా ఏసీ విభాగంలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కోచ్‌లుంటాయి. ఈ కోచ్‌లలో ప్రయాణించేవారికి బెడ్ షీట్లను అందుబాటులో వుంచుతారు.
వీరికి రగ్గులతో పాటు బెడ్ షీట్లు కూడా అందుబాటులో వుంటాయి. అయితే బెడ్ షీట్లు దొంగతనానికి గురికావడంతో.. కోచ్‌లలోని ఉష్ణోగ్రతను అవసరమైనంత మేరకు పెంచడం ద్వారా రగ్గులను కప్పుకోవాల్సిన అవసరం లేకుండా చూడాలని రైల్వే శాఖ నిర్ణయించింది.