గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్

ఎయిరిండియాలో ప్రీమియం ఎకానమీ సీట్లు - ఎంపిక చేసిన మార్గాల్లోనే...

air india seats
టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా ఎంపిక చేసిన విమాన మార్గాల్లో ప్రీమియం ఎకానమీ క్లాస్ సీట్లను ఆఫర్ చేస్తుంది. విమానాల్లో ఫస్ట్ క్లాస్, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ అనే నాలుగు కేబిన్ క్లాసులను అందించే తొలి ఏకైక భారతీయ విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించింది. 
 
ప్రారంభ దశలో బోయింగ్‌ 777-200 ఎల్‌ఆర్‌ విమానాలు నడిచే మార్గాల్లో (బెంగళూరు-శాన్‌ఫ్రాన్సిస్కో, ముంబై-శాన్‌ఫ్రాన్సిస్కో, ముంబై-న్యూయార్క్‌) ప్రీమియం ఎకానమీ సీట్లు అందుబాటులో ఉంటాయి. 'అందుబాటు ధరలోనే మెరుగైన సౌకర్యాలు కావాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అందుకే మా వినియోగదార్లకు ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను అందుబాటులోకి తెచ్చాం. త్వరలో మరిన్ని మార్గాల్లో నడిచే విమానాల్లోనూ ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రపంచ స్థాయి సేవల ప్రమాణాల్లో ఈ విధంగా మరో అడుగు వేశామ'ని ఎయిరిండియా సీఈఓ, ఎండీ కాంబెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు.
 
ప్రీమియరం ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు ప్రత్యేకంగా చెక్‌ ఇన్‌ కౌంటర్లను ఏర్పాటుచేస్తారు. చెక్‌-ఇన్‌ బ్యాగేజీలపై ప్రయారిటీ టాగ్‌లను వేస్తారు. విమానాల్లోకి ముందుగా ఆహ్వానిస్తారు. కేబిన్‌ కూడా వెడల్పాటి సీట్లతో పెద్దగా ఉంటుంది. 5 అంగుళాల రిక్లైన్‌, అడ్జస్టబుల్‌ లెగ్‌ రెస్ట్‌, ఫుట్‌ రెస్ట్‌లుంటాయి. అదనపు లెగ్‌ రూం వల్ల సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు.
 
ఉచిత, అందమైన టీయూఎమ్‌ఐ అమ్నెటీ కిట్‌ (ఎయిరిండియా కోసమే ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు) ఇస్తారు. ఇందులో విమాన సాక్స్‌లు, ఐ మాస్క్‌, మాలిన్‌+గోయెట్జ్‌ లిప్‌ మాయిశ్చర్‌, పెన్‌, కార్పెట్‌ స్లిప్పర్లు ఉంటాయి. ఇన్‌ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(ఐఎఫ్‌ఈ)ను ఉపయోగించుకునేందుకు సౌకర్యవంతమైన హెడ్‌ఫోన్స్‌ ఇస్తారు. ఆహారం విషయానికొస్తే.. వెల్కమ్‌ డ్రింక్‌ అందిస్తారు. ఎంపిక చేసిన మూడు మీల్స్‌, ఆల్కహాల్‌, నాన్‌-ఆల్కహాల్‌ పానీయాలు, ఇతరత్రా ఆహారం అందిస్తారు.