ఏఐ ముప్పుకంటే అతిపెద్ద సంక్షోభం అదే .. అపుడు వారే విజేతలు : ఆనంద్ మహీంద్రా
కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో అతిపెద్ద సంక్షోభం రానుందని మహీంద్రా మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. ఈ సంక్షోభం గురించి ఏ ఒక్కరూ ఆలోచన చేయడం లేదని ఆయన వాపోయారు. ఏఐ రాకతో వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగు అవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈ విషయంపై అమెరికా ఆటో మొబైల్ దిగ్గజం ఫోర్డ్ సీఈవో జిమ్ ఫార్లే ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఫోర్డ్‌లో ప్రస్తుతం 5 వేల మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో చాలా వాటికి వార్షిక వేతనం కోటి రూపాయలకు పైగా ఉన్నప్పటికీ భర్తీ కావడం లేదన్నారు. ఇది కేవలం ఫోర్డ్ కంపెనీకే పరిమితం కాదని అమెరికా వ్యాప్తంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్ వంటి రంగాల్లో పది లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
దశాబ్దాలుగా మన పౌర సమాజం కేవలం డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, నైపుణ్య ఆధారితశ్రామిక శక్తిని విస్మరించిందని ఆయన గుర్తుచేశారు. నైపుణ్యం, అనుభవం, నేర్పు అవసరమైన ఈ పనులను ఏఐ భర్తీ చేయలేదని స్పష్టంచేశారు. పైపెచ్చు ఈ ధోరణి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో ప్రపంచాన్ని నిర్మించే, నడిపించే, మరమ్మతులు చేసే నైపుణ్యం ఉన్నవారే ఏఐ యుగంలో విజేతలుగా నిలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. నైపుణ్యం కొరత కారణంగా కార్మికులు ఉన్నత స్థాయికి ఎదురుగుతారని, అది హింస ద్వారా కాకుండా నైపుణ్యం ద్వారా వచ్చే విప్లవమని కార్ల్ మార్క్స్ కూడా ఊహించివుండరంటూ తన పోస్టును ఆనంద్ మహీంద్రా ముగించారు.