గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (20:21 IST)

2020లో సరికొత్త బ్యాంకింగ్ రూల్స్... ఏంటవి?

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం (2020) రానుంది. 2019కి మరికొన్ని గంటల్లో గుడ్‌బై చెప్పనున్నారు. అయితే, 2020 సంవత్సరంలో పలు బ్యాంకులు కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. అంటే.. కొత్త యేడాదిలో తమతమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాయి. ముఖ్యంగా, పలు సేవలపై వసూలు చేస్తూ వచ్చిన చార్జీలను ఎత్తివేయనున్నారు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
ఓటీపీ ఆధారిత న‌గ‌దు విత్‌డ్రా... 
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) జనవరి ఒకటో తేదీ నుంచి ఓటీపీ ఆధారిత నగదు విత్‌డ్రా సేవలను ప్రవేశపెట్టనుంది. ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎంల నుంచి రూ.10 వేలు అంతకన్నా ఎక్కువగా నగదును విత్‌డ్రా చేస్తే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఏటీఎంలో వెరిఫై చేసుకోవడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎం సెంటర్‌కు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తమ వెంట ఫోన్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. 
 
రూపే, యూపీఐ చెల్లింపుల చార్జిలు ర‌ద్దు... 
దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపే, యూపీఐ చెల్లింపులపై చార్జిలను పూర్తిగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన జనవరి ఒకటో తేదీన నుంచి అమల్లోకి రానుంది. ఇకపై రూపే, యూపీఐ ప్లాట్‌ఫాంలపై జరిపే చెల్లింపులపై ఎలాంటి చార్జిలు ఉండవు. దీంతో రూపే డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి ఎండీఆర్‌ చార్జిలను వ్యాపారులు వసూలు చేయరాదు.
 
నెఫ్ట్ చార్జిల ర‌ద్దు... 
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ఇకపై నెఫ్ట్‌ (ఎన్.ఈ.ఎఫ్.టి) చార్జిలను వసూలు చేయకూడదని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే జనవరి ఒకటో తేదీ నుంచి ఆ రూల్‌ అమలులోకి రానుంది. దీంతో బ్యాంకింగ్‌ కస్టమర్లు ఎలాంటి రుసుం లేకుండానే నెఫ్ట్‌ విధానంలో నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.