శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (10:33 IST)

రైల్వేలో నూతన శకం : మేకిన్ ఇండియా రైలు.. గంటకు 180 కిమీ స్పీడ్

భారతీయ రైల్వే శాఖలో నూతనశకం ఆరంభమైంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశీయంగా అత్యంత వేగంతో నడిచే రైలును తయారు చేశారు. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. పైగా, దేశంలో అత్యంత వేగంతో నడిచే తొలి రైలుగా ఇది గుర్తింపుపొందింది. 
 
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రైలు టెస్టింగ్ రన్ ఆదివారం జరిగింది. దీన్ని గంటకు 180 కిలోమీటర్ల వేగంగా నడుపగా, ఈ ట్రయల్ రన్ విజయవంతమైంది. కోట - సవాయ్ మధోపూర్ రైల్వే సెక్షన్‌లో ఈ ట్రయల్ టెస్ట్ నిర్వహించగా, ఇది గంటకు 180 కిమీ వేగాన్ని అందుకుంది. ఈ రైలును రూ.100 కోట్ల వ్యయంతో తయారు చేశారు. 
 
ఇప్పటికే ఈ ట్రైన్‌కు సంబంధించి ప్రధాన ట్రయల్ రన్స్ పూర్తయ్యాయని.. ఈ ట్రైన్‌ను తయారు చేసిన ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ జీఎం ఎస్.మణి తెలిపారు. అధికారులు, నిపుణుల రిపోర్ట్ ప్రకారం ట్రైన్‌కు తుది మెరుగులు దిద్దుతామన్న ఆయన ట్రయల్ రన్స్‌లో ఎలాంటి భారీ సాంకేతిక సమస్యలు తలెత్తలేదని చెప్పారు. రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ సాధారణంగా మూడు నెలలు జరుగుతుందని అయితే ఈ ట్రైన్‌కు సంబంధించి అన్నీ త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.