గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2024 (15:04 IST)

వామ్మో వంట నూనెలు.. పండగ పూట మండిపోతున్న ధరలు

Oils
దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనికితోడు దీపావళి పండుగ కావడంతో ఈ ధరలకు మరింతగా రెక్కలు వచ్చాయి. దీంతో వంట నూనెలు కొనాలంటే జనాలు భయపడిపోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు వినియోగించే పామాయిల్ ధర గత నెలతో పోల్చితే ఏకంగా 37 శాతం మేరకు పెరగగా, సన్‌ఫ్లవర్, ఆవనూనె ధరలు మాత్రం 29 శాతం మేరకు పెరిగాయి. 
 
పండగ సీజన్ వేళ ఈ ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్లను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వంటనూనెను అధికంగా ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల వ్యయాలు కూడా పెరగనున్నాయని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ధరల పెరుగుదలకు దిగుమతి సుంకాల పెంపు ఒక కారణమని ప్రస్తావించింది. 
 
కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి సోయాబీన్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను పెంచింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను 5.5 శాతం నుంచి 27.5 శాతం వరకు పెంచిందని పేర్కొంది. ఇక శుద్ధి చేసిన వంట నూనెలపై సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచిందని వివరించింది. పెరిగిన సుంకాలు సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. దీంతో వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
వంటనూనెల ధరల పెరుగుదలపై అధికారులు స్పందిస్తూ గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెల ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం మేర పెరిగాయని తెలిపారు. దేశంలో వంటనూనెల డిమాండ్లో 58 శాతం దిగుమతి అవుతోందని, భారత్ రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉందని ప్రస్తావించారు. కాగా దిగుమతి సుంకాలను ఇప్పట్లో తగ్గించే అవకాశం లేనందున వినియోగదారులు రాబోయే కొద్ది నెలల పాటు అధిక ధరలను భరించాల్సిన ఉంటుందని వారు పేర్కొంటున్నారు.