ఆదివారం, 16 నవంబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2025 (23:09 IST)

ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త... ఇక నుంచి 100 శాతం ఉపసంహరణకు ఓకే

epfo withdrawal
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ పాక్షిక ఉపసహరణ విషయంలో నిబంధనలు సరళతరం చేయడానికి సిద్ధమైంది. దీనిలోభాగంగా, పీఎఫ్ పరిధిలో ఉపసంహరించుకోగల బ్యాలెన్స్‌‍లో వంద శాతం వరకు తీసుకునే వెసులుబాటును కల్పించనుంది. 
 
కేంద్ర కార్మిక శాఖ మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో సమావేశమైన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగులపై ప్రయోజనం చేకూర్చనుంది. 
 
పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన 13 సంక్లిష్టమైన నిబంధనలను ఒకే నిబంధనగా క్రమబద్దీకరించి ముఖ్యమైన అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది. ముఖ్యమైన అవసరాల్లో అనారోగ్యం, విద్య, వివాహం ఉన్నాయి. 
 
అదేవిధంగా ఉపసంహరణల సంఖ్యను కూడా పెంచింది. చదువుల కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండింటికి మూడుసార్లకే అనుమతి ఉంది. 
 
గతంలో ప్రత్యేక పరిస్థితులు ఆప్షన్‌లో కారణం చెప్పాల్సి ఉండేది. నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, సంస్థల మూసివేత వంటి కారణాలు చూపాల్సి ఉండేవి. ఇపుడు ఎలాంటి  కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. పీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తంలో 25 శాతం కనీస నిల్వగా ఉంచేలా నిబంధన రూపొందించారు.