1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (18:17 IST)

తగ్గిన బంగారు ధరలు.. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ సూచీలు

గత కొన్ని రోజులుగా తారాజువ్వలా పైకికెగిసిన బంగారు, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఈ ధరల తగ్గుదల గ‌త నాలుగైదు రోజులుగా కనిపిస్తోంది. గ‌త మూడు నెల‌లుగా అడ్డు అనేదే లేకుండా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఇప్పుడు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. బుధ‌వారం నాటి ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.210 త‌గ్గి రూ.51,963 వ‌ద్ద నిలిచింది. కిలో వెండి ధ‌ర సైతం రూ.1077 త‌గ్గి రూ.65,178కి చేరింది.
 
అంత‌ర్జాతీయ మార్కెట్‌లలో ప్ర‌తికూల‌త‌లు, రూపాయి మార‌కం విలువ మెరుగుప‌డ‌టం బంగారం, వెండి ధ‌ర‌ల త‌రుగుద‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయ‌ని బులియ‌న్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ మ‌రో మూడు పైస‌లు మెరుగుప‌డి 74.30 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1918 డాల‌ర్ల వ‌ద్ద‌, ఔన్స్ వెండి ధ‌ర 26.45 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ‌య్యింది. 
 
ఇకపోతే, బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీలు లాభాల బాటలో ముగిశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన సూచీలు... ట్రేడింగ్ చివర్లో లాభాల్లోకి మళ్లాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 39,074కి చేరుకుంది. నిఫ్టీ 77 పాయింట్లు లాభపడి 11,550 వద్ద స్థిరపడింది.