పీఎల్ఐ స్కీమ్.. మార్చి నాటికి 50వేల ఉద్యోగాలు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక రంగాల్లో సంక్షోభం నెలకొంది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్- (పీఎల్ఐ) స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశంలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, విస్తరించడానికి విదేశీ సంస్థలతో పాటు దేశీయ సంస్థల్ని ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ ప్రకటించింది మోదీ ప్రభుత్వం.
ఈ స్కీమ్ కారణంగా భారతదేశంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం విస్తరించబోతోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో 2021 మార్చి నాటికి 50,000 ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయని అంచనా. ప్రస్తుతం భారతదేశంలో హ్యాండ్‌సెట్ సెక్టార్‌లో 7 లక్షల ఉద్యోగులు ఉన్నారు. గతేడాది 15,000 మందిని నియమించుకున్నారు. ఈసారి పీఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు ఉండటంతో కొత్త ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఉద్యోగాల సంఖ్య పెరగనుంది.
లాక్‌డౌన్ ఆంక్షల్ని తొలగించడంతో కంపెనీలు కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం, ఉన్న ఫ్యాక్టరీలను విస్తరించడంపై దృష్టిపెట్టాయి. ఇందుకోసం కావాల్సిన ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో అనుభవం ఉన్నవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి.
డిక్సన్ టెక్నాలజీస్, యూటీఎల్ నియోలింక్స్, లావా ఇంటర్నేషనల్, ఆప్టీమస్ ఎలక్ట్రానిక్స్, మైక్రోమ్యాక్స్ లాంటి సంస్థలు డిసెంబర్ చివరి నాటికి 20,000 ప్రత్యక్ష ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. గత నెలలో ప్రభుత్వం 10 మొబైల్ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది.
అందులో సాంసంగ్, ఫాక్స్‌కాన్‌కు చెందిన హోన్ హాయ్, రైజింగ్ స్టార్, విస్ట్రన్, పెగట్రాన్ లాంటి విదేశీ సంస్థలున్నాయి. ఈ సంస్థలకు ఐదేళ్లలో పీఎల్ఐ స్కీమ్ ద్వారా రూ.41,000 కోట్ల ప్రోత్సాహకాలు రానున్నాయి.