మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (22:23 IST)

పెళ్లైన మహిళలకు 500 గ్రాములు, యువతికి 250, పురుషులకు 100 గ్రాముల బంగారం..?

మనదేశంలో పసిడి ప్రేమికులు ఎక్కువే. ఇక్కడి ప్రజలు వయస్సు, ఆదాయంతో సంబంధం లేకుండా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. బంగారు ఆభరణాలను ధరించడం అనేది భారతీయులకు అనాదిగా ఒక ఆచారంగాగా వస్తోంది. అందుకే, ఏవైనా పండుగలు, శుభకార్యాలు వస్తే చాలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక మరికొందరు దీన్ని ఉత్తమ పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటారు. 
 
ఏవైనా అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చని వారి భావన. అందుకే అలంకరణ కోసమే కాకుండా ఫైనాన్షియల్​ ఎమర్జెన్సీ కోసం కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. డబ్బులు ఉన్నప్పుడల్లా బంగారం కొని ఇంట్లో దాచేస్తుంటారు. అయితే, ఇలా ఎంత పడితే అంత బంగారం కొనుగోలు చేయవచ్చా? అనే దానిపై చాలా మందికి తెలియదు. వాటి గురించి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం, నల్లధనాన్ని వెలికి తీయడానికి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆదాయపు పన్ను చట్టాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
 
ఈ నేపథ్యంలో బంగారం నిల్వలపై అందరి దృష్టి నెలకొంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 132 ప్రకారం ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు జరిపినప్పుడు లెక్క చూపని ఆభరణాలను లేదా ముడి బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లెక్కకు మించిన బంగారం ఉంటే వాటి కొనుగోలు, కానుకలకు సంబంధించిన డాక్యుమెంట్​ ప్రూఫ్స్​ను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో మీ వద్ద ఎంత ఎన్నా సరే జప్తు చేయరు.
 
కాగా, బంగారం పరిమితికి సంబంధించిన విషయాన్ని సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్ట్​ ట్యాక్సెస్​ (సీబీడీటీ) గతంలోనే వెల్లడించింది. దీనిపై డెలాయిట్ ఇండియా భాగస్వామి సుధాకర్ సేతురామన్ మాట్లాడుతూ ''ఆదాయపు పన్ను అధికారులు తనిఖీ నిర్వహించే సమయంలో మీ ఇంట్లో ఉన్న బంగారానికి కొనుగోలు / ఎక్స్​ఛేంజ్​ ఇన్వాయిస్‌లు చూపించాలి. 
 
ఒకవేళ మీకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆభరణాలైతే బహుమతి దస్తావేజులను చూపించాల్సి ఉంటుంది. వారసత్వ బంగారానికి 1994 మే 11 నాటి CBDT చట్టంలోని సూచన నెం .1916 రక్షణగా నిలుస్తుంది. లెక్కలో చూపని బంగారాన్ని జప్తు చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఉంటుంది.' అని ఆయన చెప్పారు. అయితే, డాక్యుమెంట్స్​ ప్రూఫ్స్​ లేకపోయినప్పటికీ ఒక వ్యక్తి కొంత బంగారం కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుంది. పరిమితికి లోబడి ఉండే బంగారాన్ని జప్తు చేయబోమని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
 
పెళ్లైన మహిళలు 500 గ్రాముల బంగారం, పెళ్లి కాని మహిళలు 250 గ్రాముల బంగారాన్ని కలిగి ఉండవచ్చు. అలాగే, మగవారు తమ వద్ద 100 గ్రాముల బంగారాన్ని కలిగి ఉండవచ్చు. వీటిని కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలతో సహా వివిధ కారణాల ఆధారంగా స్వాధీనం చేసుకోకూడదని చట్టం చెబుతోంది. ఈ పరిమితికి మించి మీ వద్ద లెక్కల్లో చూపని బంగారు ఆభరాణాలుంటే, వాటిని జప్తు చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది.