సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (22:02 IST)

ఇకపై కళ్యాణమస్తు జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు!

తిరుమల కళ్యాణమస్తు వివాహ జంటలకు టీటీడీ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కళ్యాణమస్తు కార్యక్రమంలో వివాహం చేసుకునే జంటలకు ఒక్క గ్రాము బదులు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు అందజేయనున్నట్టు టిటిడి ప్రకటించింది. ఇప్పటికే ట్రేజరిలో వున్న 20 వేల బంగారు తాళిబొట్టు కళ్యాణమస్తు కార్యక్రమానికి టిటిడి వినియోగించుకోనుంది. 
 
టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహుర్తాలు ఖరారు చేశారు పండితులు. కళ్యాణమస్తు లగ్నపత్రికని స్వామివారి పాదాల చెంత వుంచి పూజలు నిర్వహించారు అర్చకులు. మే 28,అక్టోబర్ 30వ తేదీ, నవంబర్ 17వ తేదిలలో కళ్యాణమస్తు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇఓ జవహర్ రెడ్డి ప్రకటించారు. కళ్యాణమస్తు నిర్వహించే ప్రాంతాలను పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
 
ఈ నేపథ్యంలో స్వామి వారికి ఏడాదికి రూ.2 వేల కోట్ల వరకు కానుకలు వస్తుంటాయి. టిటిడి ఏటా రూ.200 కోట్ల రూపాయలు వెచ్చించి హిందూ ధార్మిక ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగా 2007లో టిటిడి అట్టహాసంగా ఈ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్నిగతంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. 
 
కల్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా, పెళ్లి చేసుకునే జంటలకు 2 గ్రాముల బంగారంతో మంగళసూత్రాలతో పాటు వస్త్రాలను ఉచితంగా అందజేసింది. వధూవరులు తో పాటు 50 మందికి ఉచితంగా భోజనం సరఫరా చేసింది టిటిడి. 
 
ఇలా ఒక్క జంట వివాహానికి 8 వేల రూపాయల వరకు ఖర్చు చేసేది టిటిడి. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ధపా ఐదు వేల నుంచి 7 వేల వరకు జంటలు పాల్గొనేవి. 2011 మార్చిలో రద్దయిన ఈ పధకాన్ని ఇప్పటి పాలక మండలి తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.