గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:03 IST)

రిలయన్స్‌పై అమేజాన్ విజయం.. ఏ విషయంలో తెలుసా?

రిలయన్స్‌పై అమేజాన్ విజయం సాధించింది. రిలయన్స్‌తో న్యాయపోరాటంలో ఈ కామర్స్​ దిగ్గజం గెలుపును నమోదు చేసుకుంది. ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ మధ్య కుదిరిన రూ.24,713 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేస్తూ..అమెజాన్​కు అనుకూలంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం విషయంలో సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్న అమెజాన్‌ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది.
 
వివరాల్లోకి వెళితే.. ఫ్యూచర్‌ గ్రూప్స్ రిటైల్‌ ఆస్తులను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గత ఏడాది రూ.24,713 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. అయితే,అంతకు ముందే ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమేజాన్‌ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. 
 
ఫ్యూచర్‌ కూపన్స్‌‌కి 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో 3-10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ ను కొనుగోలు చేసే హక్కు అమేజాన్‌‌కు దఖలు పడింది. అంటే పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌‌కు కూడా యాజమాన్య హక్కులు ఉన్నాయి. దీంతో రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం తమ హక్కులను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదించింది. దీనిపై సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేసింది. 
 
ఫ్యూచర్‌ గ్రూప్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ హరీశ్‌ సాల్వే, అమెజాన్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ గోపాల్‌ సుబ్రమణియమ్‌ వాదించారు. ఈ వివాదంపై విచారణను సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (SIAC) గత నెలలో పూర్తి చేసిన కోర్టు.. రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్​ డీల్‌ పై స్టే విధించింది. తుది తీర్పు వెలువడే వరకు ఒప్పందంపై ముందుకెళ్లవద్దని ఆదేశించింది.
 
అయితే విదేశీ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులు భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్‌ గ్రూప్ వాదిస్తూ వచ్చింది. దీంతో సింగపూర్ మధ్యర్తిత్వ కోర్టు తీర్పును అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అమెజాన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
 
దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు మొదట అమెజాన్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఈ తీర్పును ఫ్యూచర్‌ గ్రూప్ అదే కోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం మునుపటి తీర్పును తిరగరాస్తూ ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. 
 
అయితే ఢిల్లీ హైకోర్టు తదుపరి తీర్పుతో సంతృప్తి చెందని అమెజాన్‌.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం జులై 29న తీర్పును రిజర్వ్‌ చేసి.. ఇవాళ అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. సింగపూర్ కోర్టు ఆదేశాలు భారత్‌లో చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది.