బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మే 2022 (13:06 IST)

ఎల్ఐసీ తొలి పబ్లిక్ ఇష్యూ - సరికొత్త రికార్డులు

licipo
భారతీయ బీమా సంస్థ ఎల్.ఐ.సి తొలి పబ్లిక్ ఇష్యూ ఆఫర్ బుధవారం ప్రారంభమైంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది చరిత్రపుటలకెక్కింది. ఈ పబ్లిక్ ఇష్యూలో పాల్గొనేందుకు ఎంతో మంది పెట్టుబడిదారులు అమితాసక్తిని చూపుతున్నారు. ఫలితంగా ఐపీఓ ఆరంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5620 కోట్ల నిధులను ఎల్ఐసీ సేకరించింది. ఈ ఇష్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిలోని 3.5 శాతాను ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తుంది. తద్వారా రూ.20,557 కోట్ల నిధులను సమీకరించుకోనుంది. 
 
ఇష్యూ ఆరంభమైన మొదటి రెండు గంటల్లోనే (మధ్యాహ్నం 12 గంటలకు) పాలసీదారులకు కేటాయించిన కోటా మేరకు పూర్తి బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల కోటాలో 48 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 31 శాతానికి సమానమైన బిడ్లు వచ్చాయి. మొత్తం మీద 28 శాతం ఇష్యూకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి. 
 
మొత్తం 22.13 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయిస్తోంది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. పాలసీదారుల కోటా కింద 10 శాతం రిజర్వ్ చేశారు. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.902-949. ఒక లాట్ కింద కనీసం 15 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాలసీదారులకు ఇష్యూ ధరపై రూ.60 డిస్కౌంట్, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఇష్యూ ఈ నెల 9న ముగియనుంది. 17న స్టాక్ ఎక్సేంజ్‌లలో ఎల్ఐసీ లిస్ట్ కానుంది.