బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (14:16 IST)

నాలుగు రోజులుగా లేని పెట్రో బాదుడు.. ఎన్నికల ప్రభావమేనా?

దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు.. ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా పెట్రోలు, డీజిల్ ధ‌రల పెరుగుల‌కు కాస్త బ్రేక్ ప‌డింది. 
 
వరుస‌గా నాలుగో రోజు ధ‌ర‌లు పెర‌గ‌కుండా, త‌గ్గ‌కుండా స్థిరంగా ఉన్నాయి. గ‌త శ‌నివారం పెట్రోల్ ధర లీట‌రుకు 25 పైసలు, డీజిల్ ధ‌ర ధర 16 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ 91.17, డీజిల్ ధర రూ.81.47గా ఉంది.
 
అలాగే, ముంబైలో పెట్రోల్ ధర లీటరు రూ.97.57, డీజిల్ ధర రూ.88.60గా ఉంది. రాజస్థాన్‌లోని బికనేర్‌లో లీటరు పెట్రోలు ధర రూ.100.01గా ఉంది. అలాగే డీజిల్ ధ‌ర‌ 92.09గా ఉంది. గ‌త నెల పెట్రోల్ ధర లీటరు‌కు రూ. 4.87, డీజిల్ ధర రూ.4.99కి  పెరిగింది. హైద‌రాబాద్‌లో పెట్రోలు ధ‌ర లీట‌రుకు రూ.94.79గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ.88.86గా కొన‌సాగుతోంది.
 
గత నాలుగు రోజులుగా పెట్రోల్ బాదుడు లేకపోవడానికి కారణం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పుణ్యమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెలలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందువల్లే పెట్రోల్ వడ్డనకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.