గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (23:15 IST)

పీఎఫ్ ఖాతాల్లో ఏకంగా రూ.103 కోట్లు.. ఆ డబ్బును డ్రా చేస్తున్నారా?

దేశంలోనే ఓ పీఎఫ్ ఖాతాలో ఏకంగా రూ.103 కోట్లు ఉన్నాయి. 2018- 19లో అత్యంత పీఎఫ్ ఉండే 1.23 లక్షల పీఎఫ్ అకౌంట్లలో రూ.62,500 కోట్లు జమ అయ్యాయి. దేశంలో 4.5 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో 0.27 శాతం మంది ఈపీఎఫ్ కార్పస్ ఫండ్ కలిగి ఉన్నారు. 20 మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలో రూ.15,000 కంటే ఎక్కువ వేతనం పొందే వారికి కచ్చితంగా పీఎఫ్ సదుపాయం కల్పించారు. వారి వేతనంలో 12 శాతం పీఎఫ్ కింద జమ చేయాలి. 
 
అయితే, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏడాదికి రూ.7.5 లక్షల కంటే ఎక్కువ పీఎఫ్ జమకావడంపై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పరిమితి విధించింది. అంతకు మించి పీఎఫ్ ఖాతాలో జమచేయడానికి వీల్లేదు. కానీ, ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. కంపెనీలు ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు. దేశంలో అత్యంత ఎక్కువ నిధులు ఉన్న టాప్ 10 ఖాతాల్లో రూ.825 కోట్లు ఉన్నాయి. 
 
టాప్ 100 కలిపితే ఆ మొత్తం రూ.2000 కోట్లు పైనే ఉంది. దేశంలో టాప్ 3 పీఎఫ్ ఖాతాలను లెక్కిస్తే మొదటి దాంట్లో రూ.103 కోట్లు, రెండో దాంట్లో రూ.86 కోట్లు, మూడో దాంట్లో కూడా రూ.86 కోట్లు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అవసరానికి డబ్బు కావాల్సినప్పుడు గుర్తొచ్చే సేవింగ్స్‌లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF డబ్బులు కూడా ఉంటాయి. ఉద్యోగుల వేతనంలో నుంచి 12 శాతం, అంతే మొత్తంలో యాజమాన్యం వాటా ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతాయి. ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన మొత్తంలోనుంచి ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు తమ అవసరానికి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీన్నే అడ్వాన్స్ విత్‌డ్రాయల్ అంటారు. 
 
పెళ్లిళ్లు, పిల్లల పైచదువులు, ఇంటి నిర్మాణం ఇలా పలు కారణాలతో విత్‌డ్రా చేయొచ్చు. గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని కూడా ప్రారంభించింది ఈపీఎఫ్ఓ. అంటే కరోనా వైరస్ ప్రభావాన్ని కారణంగా చూపించి విత్‌డ్రా చేయొచ్చు. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి రిటైర్మెంట్ వరకు డబ్బులు విత్‌డ్రా చేయకపోవడమే మంచిదని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెబుతుంటారు. ఇందుకు కారణం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పొందడమే. కొన్నేళ్ల పాటు డబ్బులు జమ చేస్తూ పోవడం, ఆ డబ్బుకు ఈపీఎఫ్ఓ నుంచి ఏటేటా వడ్డీ జమ అవుతుండటం, ఇలా రిటైర్మెంట్ నాటికి జమచేసినదాని కన్నా ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. 
 
మధ్యలో డబ్బులు విత్‌డ్రా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నట్టైతే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక అత్యవసర కారణాలతో విత్‌డ్రా చేసినా పన్నులు ఉండవు. ఒకవేళ ఐదేళ్లు అకౌంట్ కొనసాగించినా మధ్యలో కంట్రిబ్యూషన్ లేకపోయినా పన్నులు చెల్లించాలి. 
 
ఐదేళ్ల లోపు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్-టీడీఎస్ వర్తిస్తుంది. అందుకే మరీ తప్పదు అనుకుంటేనే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ఆప్షన్‌గా పీఎఫ్ డబ్బును తీసుకోవాలి. అంతే తప్ప ఏ చిన్న అవసరం ఉన్నా ఈపీఎఫ్ అకౌంట్ నుంచి విత్‌డ్రా చేయకూడదు.