శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:06 IST)

రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ పెట్టుబడి.. ఆర్ఐఎల్ ప్రకటన

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో పీఈ సంస్థ సిల్వర్‌ లేక్‌ స్వల్ప వాటాను కొనుగోలు చేయనుంది. 1.75 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సిల్వర్‌ లేక్‌ డీల్‌ కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ ప్రకటించింది. 
 
ఇందుకుగాను సిల్వర్‌లేక్‌ రూ. 7,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. ఈ డీల్‌తో రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు అంచనా. కొద్ది రోజుల క్రితం డిజిటల్‌ అనుబంధ విభాగమైన రిలయన్స్‌ జియోలో సైతం సిల్వర్‌ లేక్‌ ఇన్వెస్ట్‌ చేసింది. 
 
డిజిటల్‌ అనుబంధ విభాగం రిలయన్స్‌ జియో బాటలో రిలయన్స్‌ రిటైల్‌లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్‌ అంబానీ ఉన్నట్లు తెలుస్తోంది. 
 
రిలయన్స్‌ జియోలో ఇప్పటికే సిల్వర్‌ లేక్‌ రూ. 10,202 కోట్లను పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ జియోలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలకు రిలయన్స్‌ రిటైల్‌లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్‌ అంబానీ ఉన్నట్లు  కంపెనీ వర్గాల సమాచారం. 
 
అలాగే గత నెలలో కిశోర్‌ బియానీ సంస్థ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌ బిజినెస్‌లను ముకేశ్‌ అంబానీ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌ సొంతం చేసుకున్న సంగతి విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది.