రూ.2 వేల నోట్లను వదిలించుకోవడానికి కంపెనీ యజమానుల కొత్త ఎత్తుగడ... ఏంటది?
భారత రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు సెప్టెంబరు నెలాఖరుతో దేశ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న రూ.2 వేల నోటు రద్దు కానుంది. తమ వద్ద ఉన్న రూ.2 వేల నోటును ఈ గడువు లోగా బ్యాంకుల్లో మార్చుకోవాల్సి వుంది. ఈ నేపథ్యంలో అనేక కంపెనీల యజమానులు తమ వద్ద మూలుగుతున్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు కొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నాయి.
నిన్నామొన్నటి వరకు బంగారం, స్థిరాస్తి కొనుగోళ్లపై దృష్టి పెట్టిన యజమానులు ఇపుడు తమ వద్ద పని చేసే ఉద్యోగులకు రూ.2 వేల నోట్లను వేతనాలుగా ఇస్తున్నాయి. పైగా, ఇప్పటివరకు ఐదు నుంచి పదో తేదీ వరకు చెల్లించే వేతనాలను ఇపుడు ఒకటో తేదీనే ఠంచనుగా ఇచ్చి, స్వామి కార్యం స్వకార్యం పూర్తయిందని చేతులు దులిపేసుకుంటున్నారు.
సాధారణంగా ప్రతినెలా నాలుగు, ఐదో తేదీల్లో వేతనాలు ఇస్తుండగా మే నెల జీతం జూన్ ఒకటో తేదీనే ఇవ్వడంతో ముందే ఇస్తున్నారన్న సంతోషంతో వాటిని తీసుకున్నామని ఆ ఉద్యోగులు చెబుతున్నారు. మరికొందరు వేతనం రూ.10 వేలు ఉంటే రూ.20 వేలు చేతిలో పెట్టి మరో పదివేలు బ్యాంకులో మార్చుకొని రావాలని ఆదేశిస్తున్నారని తెలిపారు. ఇలా జూన్ ఒకటో తేదీన నగరంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం.