శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:27 IST)

ఆర్‌ఐఎల్ సంచలన నిర్ణయం.. ఓటూసీ వ్యాపారం ఇక అనుబంధ సంస్థగా..?

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) సంచలన నిర‍్ణయాన్ని ప్రకటించింది. తన ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. 
 
వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడిన ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ కలిగి ఉంటుందని ఆర్‌ఐఎల్ తెలిపింది. మొత్తం అపరేటింగ్‌ టీం, కొత్త సంస్థలోకి మారుతుందనీ, అలాగే ఆదాయాలను తగ్గించడం లేదా నగదు ప్రవాహాలపై ఎటువంటి పరిమితులు ఉండవని పేర్కొంది.
 
పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఓటూసీ వ్యాపారంలో 49.14 శాతం వాటాను కలిగి ఉంటుందనీ, ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పు ఉండదని రెగ్యులేటరీ సమాచారంలో రిలయన్స్‌ వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం లభించినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. 
 
అయితే, ఈక్విటీ వాటాదారులు, రుణదాతలు, ఐటీ, ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ల నుండి ఇంకా క్లియరెన్స్ పొందలేదని చెప్పింది. 2022 నాటికి ముంబై, అహ్మదాబాద్ ఎన్‌సీఎల్‌టీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. 
 
సంస్థకు చెందిన రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్ ఆస్తులు మొత్తం కొత్త అనుబంధ సంస్థలోకి బదిలీ అవుతాయి. సౌదీ అరామ్‌కోతో ఒప్పందం అనంతరం మరింతగా ఇన్వెస్టర్ల ద్వారా కేపిటల్ సమకూర్చుకోవడానికి దోహద పడుతుందని కంపెనీ తెలిపింది.