శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (16:38 IST)

స్టాక్ మార్కెట్ : వరుసగా ఐదో రోజూ నష్టాలే...

దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పర్వం కొనసాగుతోంది. క్రితం వారం నుంచి ప్రారంభమైన ఈ నష్టాలు ఈ వారంలో కూడా కొనసాగుతున్నాయి. ఫలితంగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. అంటే గత ఐదు రోజులుగా నష్టాలనే చవిచూశాయి. 
 
బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 65 పాయింట్లు నష్టపోయి 37,668కి పడిపోయింది. నిప్టీ 21 పాయింట్లు కోల్పోయి 11,131 వద్ద స్థిరపడింది. దీనికిగల కారణాలపై మార్కెట్ విశ్లేషకులు స్పందిస్తూ, ఒకవైపు చైనాతో సరిహద్దుల వద్ద సమస్య, దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల భయంతో పెట్టుబడిదారులు తమ షేర్ల అమ్మకానికి మొగ్గు చూపుతున్నారనీ ఈ కారణంగానే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. 
 
కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో అమెరికాకు చెందిన కేకేఆర్ సంస్థ మరో రూ.5500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుందనే వార్త కూడా మార్కెట్‌ను గట్టెక్కించలేక పోయంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ సంస్థల్లో ఈ సంస్థ ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనుంది. 
 
కాగా, బుధవారం రోజున యాక్సిస్ బ్యాంకు, హిందుస్థాన్ యూనీలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంకు, నెస్లే ఇండియా, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు షేర్లు లాభాల్లో పయనించగా, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టీసీఎస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టాలను చవిచూశాయి.