బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (19:26 IST)

ఎస్.బి.ఐ సర్వర్ లీక్ : తక్షణం పిన్ నంబర్లు మార్చుకోండి...

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా గుర్తింపు పొందిన భారతీయ స్టేట్ బ్యాంకు సర్వర్ డేటా లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎస్.బి.ఐ ఖాతాదారులంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖాతాదారులంతా తమ క్రెడిట్, డెబిట్ కార్డుల పిన్ నంబర్లను తక్షణం మార్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
ముఖ్యంగా, బ్యాంకు ఖాతా నంబరు, బ్యాలెన్స్, ఫోన్ నంబరు, పిన్ నంబర్లు స్టోర్ అయివుండే సర్వర్‌లోని డేటా లీక్ అయినట్టు టెక్ క్రంచ్ అనే సంస్థ వెల్లడించింది. దీనికిగల కారణాలను కూడా ఆ సంస్థ వెల్లడించింది. 
 
ముంబైలోని ఎస్.బి.ఐ కేంద్రంలో ఉన్న సర్వర్‌ దాదాపు 2 నెలల పాటు ఎలాంటి పాస్‌వర్డ్‌ సెక్యూరిటీ లేకుండా వదిలేయడంతో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని యాక్సెస్ చేశారట. ఫలితంగా అత్యంత గోప్యంగా ఉండాల్సిన డేటా అంతా లీకైనట్టు టెక్ క్రంచ్ చెబుతోంది. మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాంకు బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ వంటి వివరాలను వెల్లడించే 'ఎస్బీఐ క్విక్' సర్వర్ నుంచి ఈ డేటా లీక్ జరిగిందని చెప్పింది. 
 
బ్యాంకు తమ కస్టమర్లకు పంపే మెసేజెస్ కూడా లీక్ అయ్యాయని తెలిపింది. సోమవారం ఒక్క రోజే బ్యాంకు 30 లక్షల మందికి మెసేజెస్ పంపిందన్నారు. తాము కూడా సర్వర్‌ను యాక్సిస్ చేశామని, అయితే ప్రస్తుతం సర్వర్ సేఫ్‌గానే ఉందని టెక్ క్రంచ్ వివరించింది.
 
అయితే ఇప్పటికే లీక్ అయిన డేటా ఆధారంగా భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను టార్గెట్ చేసి దోచేసుకునే అవకాశం ఉందని టెక్నికల్ రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. వెంటనే ఎస్బీఐ ఖాతాదారులు తమ పాస్‌వర్డ్స్ మార్చుకోవడం మేలని చెబుతున్నారు.